మాగనూరు/కృష్ణ, మే 2 : పంట సాగు మొదలుకొని అమ్ముకునే వరకు కాంగ్రెస్ సర్కారులో అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. మిల్లుల వద్ద వారాలు గడిచినా ధాన్యం దింపుకోకపోవడంతో విసుగుచెందిన రైతులు శుక్రవారం గుడెబల్లూరు సమీపంలో జాతీయ రహదారిపై ట్రాక్టర్లను అడ్డంగా పెట్టి వందల మంది గంటపాటు నిరసన తెలిపారు. ధాన్యం తీసుకొచ్చి వారాలు గడిచినా దింపుకునే నాథుడు లేడని, 15మంది కూలీలను పెడితే వేల బస్తాలు ఎప్పుడు దింపుకొంటారని ప్రశ్నించారు.
దీనికితోడు మూడు కిలోల తరుగు తీస్తున్నారని ఆరోపించారు. కోస్గి, కొడంగల్ నుంచి వచ్చిన లారీలను ముందుగా దింపుకొని చిన్న, సన్నకారు రైతులను రోజుల తరబడి పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కాగా, కొంతమంది బస్సు యజమానులు రాస్తారోకో నుంచి వెళ్లాలని ప్రయత్నం చేయగా, రైతులు అడ్డుకొని ముండ్ల కంప, రాళ్లు తెచ్చి రోడ్డుకు అడ్డంగా పెట్టి ఆందోళన చేపట్టారు.
విషయం తెలుసుకున్న తాసీల్దార్ వెంకటేశ్, ఎస్సై నవీద్, పీఏసీసీఎస్ చైర్మన్ వెంకటరెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని రైతులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయినా వినకపోవడంతో వారాజన్య రైస్‌మిల్ యజమానితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. రైస్‌మిల్లులో ధాన్యం దింపుకోవడానికి స్థలం లేదని, సమాధానమిచ్చారు. దీంతో కృష్ణా, ఇందుపూరు శివారులో నూతనంగా ఏర్పాటు చేసిన వసుధ రైస్‌మిల్లు యజమానితో మాట్లాడి ధాన్యం దింపుకొనేలా చర్యలు చేపట్టారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు.