మాగనూరు, ఏప్రిల్ 28 : ఉమ్మడి మండలంలో గన్నీ బ్యాగుల్లేక రైతులు నానా కష్టాలు పడుతున్నారని మక్తల్ ఎమ్మెల్యే వాకిట్ శ్రీహరి, కలెక్టర్ సిక్తాపట్నాయక్‌కు ఉమ్మడి మాగనూరు మండల రైతులు మొరపెట్టుకున్నారు. మాగనూరు, కృష్ణ మండల కేంద్రాల్లో సోమవారం భూభారతిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయా మండల కేంద్రాల్లో ని రైతువేదికల్లో నిర్వహించిన అవగాహన సదస్సుకు కలెక్టర్, మక్తల్ ఎమ్మెల్యే ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కలెక్టర్ కి ఉ మ్మడి మండలాల రైతులు తమ సమస్యలను వినిపించారు.
ప్రధానంగా మాగనూరు మండలంలో 14 వేల ఎకరాలు, కృష్ణా మండలంలో 12,500 ఎకరాల్లో వరిధాన్యం పండించిన రైతులకు దాదాపు 15లక్షల గన్నీ బ్యాగులు రావాల్సి ఉండగా ఇప్పటివరకు అధికారులు సగానికిసగం కూడా సరఫరా చేయలేదని వాపోయారు. అధికారులు తమకు గన్నీబ్యాగులు అందించకపోవడంతో పండించిన ధాన్యా న్ని వారం రోజులుగా కల్లాల్లోనే ఆరబెట్టామని, కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం ఆదివారం కురిసిన అకా ల వర్షానికి తడిసి ముద్దయిందని, తడిసిన ధాన్యాన్ని తక్షణమే ప్రభుత్వం కొనుగోలు చేసి తమకు న్యాయం చేయాలని కోరారు.
అలాగే రైతులకు లారీలు పంపించాలంటే లారీ యజమానులు, డ్రైవర్లకు మూడు నుంచి ఐదువేలు కచ్చితంగా ఇవ్వాల్సిందేనని.. లేదంటే ఎవరిస్తే వారికి మాత్రమే వెళ్తారని ఆరోపించారు. లారీల కొరతతో రైతులు ఇంకా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి మండలంలో 64 లారీలు మాత్రమే ఉన్నాయని వాటిని యజమాని ఇష్టానుసారంగా వాళ్లకు తెలిసిన వారికి మాత్రమే పంపుతున్నారని కలెక్టర్‌కు వివరించారు.
రైతుల విన్నపాలకు స్పందించిన కలెక్టర్ వర్షానికి తడిసిపోయిన ధాన్యం కొనుగోలు చేసే విషయమై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగిన న్యాయం చేసేందుకు కృషిచేస్తామని హామీ ఇచ్చారు. 64లారీలు సరిపోకపోతే ఇంకా కొన్ని లారీలు కేటాయించే విధంగా చర్యలు చేపడుతానని రైతుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తే, ధాన్యం సేకరించడంలో రైతుకి ఎలాంటి ఇబ్బందులున్నా.. హెల్ప్‌లైన్ నెంబర్ 9963471959కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. సమావేశంలో నారాయణపేట ఆర్డీవో రాంచందర్, ట్రైనీ కలెక్టర్ ప్రణయ్‌కుమార్, మాగనూరు, కృష్ణ తాసీల్దార్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు.