వెల్దండ, మార్చి 12 : బీఆర్ఎస్ సర్కారు మాదిరిగా యాసంగిలో ప్రభుత్వం కేఎల్ఐ ద్వారా సాగునీరు సరఫరా చేస్తుందని పంటలు వేసిన రైతులను నిరాశే మిగిలింది. దాదాపు రెండు నె లలుగా కాల్వల్లో నీరు రాకపోవడంతో వెల్దండ మండలంలో రైతులు వేసిన పంటలు ఎండుముఖం పట్టాయి. దీంతో చేతికి వచ్చిన పంటలు ఆగమవుతున్నాయని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం బండోన్పల్లి, బర్కత్‌పల్లి, చొక్కన్నపల్లి గ్రామాల్లో కొంత మంది రైతులు సాగు నీరు వస్తాయి కదా అని నమ్మి పంటలు వేసి మోసపోయారు. బర్కత్‌పల్లి గ్రామానికి చెందిన కేశమళ్ల నర్సింహ అనే రైతు కాల్వ కింద పొలంలో పది ఎకరాల్లో వేరుశనగ పంట వేశాడు. మొదట్లో కేఎల్ఐ ద్వారా బాగానే నీరు వస్తున్నాయని మురిసి పోయాడు.
ఆ ఆనందం కొన్ని రోజలు మాత్రమే ఉన్నది. కాల్వ నీరు బంద్ కావడంతో షాక్‌కు గురయ్యాడు. ఇప్పటికి 45 రోజులు గడిచినా కాల్వ నీరు వదలక పోవడంతో ఇప్పటికీ 3ఎకరాల వేరుశనగ పంట ఎండుముఖం పట్టడంతో పశువులకు మేతగా ఉపయోగిస్తున్నాడు. చొక్కన్నపల్లిలో శ్రీనివాస్‌రెడ్డి నాలుగు ఎకాకరాల్లో వేసిన వరి పంట పశువులకు మే తగా మారగా, బండోన్పల్లిలో శంకరయ్యకు చెందిన రెండెకరాల వరి సాగునీరు లేక నెర్రెలు బారడంతో పశువుల మేతకు వదిలేశారు. పదేండ్లలో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ లేదని, నీళ్లు వస్తాయని నమ్మి పంటలు వేసి అప్పుల పాలయ్యామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సాగునీరు వస్తుందని నమ్మి రెండు ఎకరాల్లో వరి పంట వేశాను. నీళ్లు లేక పోవడంతో వరిపంట నెర్రెలు బారింది. చేసేది లేక పంటను పశువులకు మేతకు వదిలేశా. గత పదేండ్లలో ఇలాంటి దుస్థితి ఎన్నడూ చూడలేదు. నీళ్లు వస్తాయని నమ్మి పంటలు వేసి అప్పుల పాలయ్యా. పంటలు పండుతాయని ఎంతో ఆశగా పెట్టుబడి పెట్టి పంటలు వేస్తే తీరా ఎండిపోయాయి. ఏం చేయాలో తోచడం లేదు. ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదు. ఎండిన పంటలకు నష్ట పరిహారం ఇచ్చి ఆదుకోవాలి.
– శంకరయ్య, రైతు, బండోన్పల్లి, వెల్దండ మండలం