మూసాపేట, మే 1 : ధాన్యం కొనుగోలు చేయాలని గురువారం రైతులు ఆందోళన చేపట్టగా స్పందించిన అధికారులు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. మూసాపేట మండలంలోని నిజాలాపూర్‌లో వరి పంటనే అధికం. గత నెల రోజుల ముందు నుంచే వరి కోతలు ప్రారంభించారు. అందుకు ఏప్రిల్ 14వ తేదీన గ్రామంలో కొనుగోలు కేం ద్రాన్ని ప్రారంభించి అధికారులు చేతులు దులుపుకున్నా రు. అప్పుడు ఇప్పుడు అంటూ అధికారులు కొనుగోళ్లు ప్రారంభిచకపోవడంతో ఐదు రోజు కిందట రైతులంతా కలిసి తాసీల్దార్ కార్యాలయం ముట్టించడానికి సిద్ధమయ్యారు. దీంతో పొల్కంపల్లి సింగిల్‌విండో అధికారులు స్పందిస్తూ కొంత మంది హమాలీలను తీసుకొని గ్రామానికి వెళ్లి ప్రారంభిస్తున్నట్లు చెప్పడంతో రైతులు శాంతించారు. కానీ ధాన్యం సేకరణ నత్తనడకన సాగుతున్నది.
రో జురోజుకు వరి ధాన్యం పూర్తిగా ఒట్టిపోయి పడిపోతుందని చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదని, వర్షం వస్తే నష్టపోతామని ఆందోళన చేపడుతూ స్థానిక మాజీ జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన కొంతమంది రైతులతో కలిసి తాసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. అందుకు స్పందించిన తాసీల్దార్ రాజు మీరు కొనుగోలు కేంద్రం వద్దకే వెళ్లండి అక్కడికే అందరం వస్తామని చెప్పిపంపారు. దీంతో నిజాలాపూర్లోని వరి కొనుగోలు కేంద్రం వద్దకు వెళ్లారు. అక్కడికి డిప్యూటీ తాసీల్దార్ అంజనేయులు, ఏవో అనిల్‌కుమార్, ఏఈవో అనితా, సింగిల్‌విండో సీఈవో భాస్కర్‌గౌడ్ అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ధాన్యం సేకరణకు కుంటి సాకులు చెబుతూ ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారని, అధికారులు ఉద్దేశ పూర్వకంగానే కొనుగోలు చేయడం లేదని ఆరోపిస్తూ నిలదీశారు.
నెల రోజు కిందట కోతలు కోశామని, అప్పటి నుంచి తీవ్రమైన ఎండలు, మరో వైపు వర్షం వస్తుండడంతో నానా అవస్థలు పడుతూ ధాన్యాన్ని తూర్పు ఆరబెట్టామని, మండే ఎండలకు వేడి తీవ్రత ఎక్కువగా ఉండడంతో వరి ధాన్యం పూర్తిగా ఎండిపోయి తూకం పూర్తిగా పడిపోయిందని చెప్పారు. మ్యాచర్ ఇప్పుడు 8.5శాతానికి పడిపోయిందని చెప్పారు. అయినా కొనుగోలు చేయకుండా ఇంకా మళ్లీ తూర్పు ఆరబెట్టమని చెప్తూ కాలయాపన చేస్తున్నారని, రైతులను మరింత నష్టం చేయడం కోసమే ఇబ్బందులు పెడుతున్నారని రైతులు ఆరోపిస్తూ నిలదీశారు. దీనిపై మాజీ జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్ మాట్లాడుతూ మీరు ఆలస్యం చేసే కొంది మ్యాచర్ పడిపోయి రైతులకు నష్టపోయి మిల్లర్లకు లబ్ధి జరుగుతుందని, ఒక సంచిలో 40కిలోలు వడ్లు సరిపోవాలి, కానీ సంచి సగం పోసినా సరిపోవడం లేదని, మరో వైపు 40 కిలోలకు బదులుగా 41 కిలో 200 గ్రాములు తీసుకుంటుండడంతో తీవ్రంగా నష్టం జరుగుతుందని వెంటనే కొనుగోలు చేయకపోతే రైతులమంతా కలిసి కలెక్టర్ వద్దకు వెళ్తామని చెప్పారు.
అదేవిధంగా మాజీ ఎంపీటీసీ సీజీ గోవర్థన్ మాట్లాడుతూ రైతుల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లామని, ఎ మ్మెల్యే జీఎంఆర్ సంబంధిత అధికారులను కూడా వెం టనే కొనుగోలు చేపట్టాలని ఆదేశించినట్లు తెలిపారు. సీఈవో భాస్కర్‌గౌడ్ మాట్లాడుతూ హామాలీలు లేరని, ట్రాన్స్పోర్ట్ వాహనాలు రావడం లేదని చెప్పుకోచ్చారు. అందుకు ఏవో మాట్లాడుతూ ట్రాన్స్పోర్ట్ ఇబ్బందులు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. వెంటనే కొనుగోళ్లు చేపడతామని చెప్పడంతో రైతులు శాంతించారు.