కోడేరు/కొల్లాపూర్, ఫిబ్రవరి 20 : రైతులు యూరియా కోసం పాట్లు పడుతున్నారు. యాసంగి సీజన్లో వివిధ పంటలు సాగు చేయగా.. సరైన సమయంలో యూరియా వేయాల్సి ఉన్నది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై కక్ష కట్టడంతో సరైన సమయంలో చేరక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రుణమాఫీ సగం మందికి కూడా వర్తించలేదు. రైతు భరోసాకు రేవంత్ సర్కారు పాతరేసింది. అయినా వ్యవసాయం తప్పా మరో పని తెలియని రైతు సొంత, వడ్డీకి తెచ్చిన డబ్బుతో పంటలు సాగు చేశాడు. కానీ ఎరువుల కొరత తలెత్తింది. గురువారం నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండల కేంద్రానికి యూరియా వచ్చిందని తెలుసుకొని రైతులు ఎగబడ్డారు. మండలంలో వానకాలం సీజన్లో 40 వేల ఎకరాలు, యాసంగిలో 35 వేల ఎకరాల వరకు పంటలు సాగయ్యాయి.
అధికారుల అంచనా మేరకు.. వరి 7వేల ఎకరాల్లో, వేరుశనగ 2 వేల ఎకరాల్లో, మొక్కజొన్న వెయ్యి ఎకరాల్లో.. సాగైనట్లు అధికారుల అంచనా.. అయితే గురువారం నాటికి 195 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే అందుబాటులో ఉన్నది. కానీ 296 మెట్రిక్ టన్నుల యూరియా డిమాండ్ ఉందని అధికారులు తెలిపారు. పలువురు రైతులు యూరియా కోసం ఆరాటపడుతున్నారు. డిమాండ్ కంటే సప్లయి తక్కువగా ఉండటంతో దుకాణాల ముందు బారులుదీరుతున్నారు. కోడేరు సొసైటీకి యూరియా వచ్చిందన్న విషయం తెలియగానే రైతులు తెల్లవారుజాము నుంచే సింగిల్ విండో కార్యాలయానికి క్యూ కట్టారు. పెద్ద మొత్తంలో అక్కడకు చేరుకోవడంతో రైతులు మినీ యుద్ధమే చేయాల్సి వచ్చింది.
దీంతో ఇదే అదునుగా ప్రైవేట్ ఫర్టిలైజర్ దుకాణదారులు రూ.270లోపు ఉన్న యూరియా బస్తాను రూ.300 నుంచి రూ.350 ధరకు విక్రయించారు. ఎరువులను కొనుగోలు చేయలేక పంటల సాగును మానుకోవడం ఉత్తమని పలువురు వాపోయారు. ఎరువులు ఎంత అవసరం ఉంటాయో ముందస్తుగా అధికారుల ద్వారా ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తారు. కానీ ప్రభుత్వానికి వ్యవసాయంపై ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో యాసంగి పంటలకు ఎరువుల కొరత ఏర్పడింది. మండలంలోని 13 గ్రామా ల్లో 27962.22 గుంటల భూమికి పాసుపుస్తకాలు ఉండగా.. ఇందులో ఇప్పటికే సర్వే పేరుతో 485.15 గుంటల భూమికి రైతుభరోసా రాకుండా బ్లాక్ లిస్టులో పెట్టినట్లు తెలిసింది.
వంగూరు, ఫిబ్రవరి 20 : మండలంలోని రంగాపూర్ సింగిల్‌విండో కార్యాలయం వద్ద గురువారం యూరియా కోసం రైతులు బారులు తీరారు. కేవలం ఒక లారీలో 300 బ్యాగుల యూరియా రావడంతో రైతులు దాని కోసం రెండు గంటలపాటు క్యూలైన్ లో నిల్చున్నారు. ఒక్కో రైతుకు 5 బ్యాగులు ఇవ్వాలని కోరగా ఒకే బస్తా ఇస్తామని అధికారులు చెప్పడంతో వారు తీసుకోవడానికి నిరాకరించారు. దీం తో రైతులు అధికారులపై ఒక్క సారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం వరకు మరో రెండు లారీల యూరియా వస్తుందని తిరిగి శుక్రవారం పంపిణీ చేస్తామని సీఈవో విష్ణుమూర్తి చెప్పడంతో రైతులు వెనుతిరిగారు.
అయితే మండలంలోని సు మారు 8500 ఎకరాల్లో రైతులు వరిని సాగు చేశా రు. ఎకరాకు 5 బ్యాగుల చొప్పున అవసరమున్నా 42,500 బ్యాగుల యూరియా అవసరమని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.
కోడేరు శివారులో ఐదెకరాల్లో యాసంగి పంటగా మొక్కజొన్న సాగు చేశాను. పంటకు యూరి యా వేసేందుకు అందుబాటు లో లేదు. కొరత ఏర్పడడంతో ఇబ్బందులు తప్పడం లేదు. కో డేరు విండో కార్యాలయంలో యూరియాను రైతులకు అందుబాటులో ఉంచాలి. ప్రభుత్వం చర్యలు చేపట్టి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి.
– శేఖర్ యాదవ్, రైతు, కోడేరు
మక్తల్, ఫిబ్రవరి 20 : రైతులకు రాయితీతో ఇవ్వాల్సిన యూరియాను నిజమైన వారికి ఇవ్వకుండా తెల్లచొక్కాలు వేసుకొచ్చే నాయకులకు ఇస్తున్నారని మక్తల్ సహకార సంఘం సభ్యులపై రైతు లు ఆరోపణలు చేస్తున్నారు. గురువారం మక్తల్ ప్రాథమిక సహకార సంఘం కార్యాలయానికి 900 బ్యాగుల యూరియా వచ్చింది. ఈ విషయం తెలుసుకొన్న రైతులు అక్కడకు చేరుకొన్నారు.
గం టల తరబడి బారులుదీరినా తమకు అందించకుండానే నాయకులకు దొడ్డిదారిన ఇస్తున్నారని పలువురు రైతులు ఆరోపించారు. ఉదయం నుంచి పడిగాపులు కాసినా చాలా మందికి అందడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. రైతులను పట్టించుకోకుండా వారికి కావాల్సిన వారికే అప్పగిస్తున్నార న్న మండిపడుతున్నారు.
ఈ విషయమై కార్యాలయ కార్యదర్శి రాములును వివరణ కోరగా.. 900 బస్తాలు స్టాక్ ఉన్న విషయం వాస్తవమే.. నేను కార్యాలయానికి వెళ్లాక రైతుల ఆధార్ కార్డులను తీసుకొని బయోమెట్రిక్ చేసి రైతుల పాస్‌పుస్తకం ఆధారంగా ఒక్కో రైతుకు పది బస్తాల యూరియాను పంపిణీ చేశామన్నారు. వ్యవసాయ అధికారి మిథున్ చక్రవర్తి సంప్రదించగా.. రైతులకు యూరియా అందజేస్తామన్నారు. త్వరలోనే మళ్లీ లోడ్ వస్తుందని, రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు.