మక్తల్, జూలై 16 : వానకాలం ప్రారంభమై 45 రోజులు గడుస్తున్నప్పటికీ అనుకున్న రీతిలో వర్షాలు లేకపోవడం వల్ల సాగు చేసుకున్న పంటలు చేజారి పోకుండా ఉండాలని రైతన్నలు అప్పులు చేసి బోరుబావులను తవ్వి నీటి కోసం నానా తిప్పలు పడుతున్నారు. అందులో భాగంగా గురువారం మక్తల్ పట్టణానికి చెందిన కుమ్మరి ఆనంద్ అనే రైతు భీమా కాలువపై ఆధారపడి పంటను సాగు చేస్తున్న క్రమంలో 45 రోజులైనప్పటికీ భీమా కాల్వకు చుక నీరు రాలేదు.
తనకున్న పది ఎకరాల్లో ఆరు ఎకరాల్లో వరి నారువేసి, నీళ్లు లేక వేసిన నారు ఎండిపోయే పరిస్థితి రావడంతో పంటను కాపాడుకోవడం కోసం రూ.1.50లక్షల అప్పు చేసి మరి బోరు వేయించారు. కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో ప్రాజెక్టుల్లో నీరు ఉన్నప్పటికీ, దిగువ ప్రాంతానికి చుకనీరు రాకపోవడంతో భీమా ప్రాజెక్టుకు నీళ్లు రాక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి కర్ణాటకతో మాట్లాడి దిగువకు నీటిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.