దేవరకద్ర, మార్చి 11 : మండలంలోని గోపన్‌పల్లి, డోకూర్, మినుగోనిపల్లి తదితర గ్రామాల్లో భూగర్బజలాలు అడుగంటి పోవడంతో బోరు బావులు ఎండి పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోటి ఆశలతో రైతులు సాగు చేసిన పంటలు చేతికి రాకపోవడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే పంటలు పొట్టదశలో ఉన్నాయని వీటికి 15 రోజుల పాటు సాగునీరు అందిస్తే పంటలు చేతికి వచ్చే అవకాశం ఉందని రైతులు పేర్కొంటున్నారు. అయితే సోమవారం మండలంలోని గోపన్‌పల్లి, డోకూర్, మినుగోనిపల్లి గ్రామాల్లో ఏడీ యశ్వంత్‌రావు, తాసీల్దార్ కృష్ణయ్య, ఇరిగేషన్ ఏఈ హరిందర్‌రెడ్డి, ఏవో రాజేందర్ అగర్వాల్, ఆర్ఐ శరత్‌నాయక్ ఎండిన పంటలను పరిశీలించారు.
బోర్లల్లో నీరు రావడం లేదు..
మీనుగోనిపల్లి గ్రామంలో తనకున్న రెండెకరాల్లో ఒక బోరు ఉండడంతో మొత్తం వరి పంటను సాగు చేశాను. అయితే కొద్ది రోజులుగా బోరులో నీరు రావడం లేదు. దీంతో దాదాపు అర ఎకరం వరకు పంట పూర్తిగా ఎండిపోయింది. ప్రభుత్వం ఎండిన పంటలను పరిశీలించిన నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలి.
– నర్సింహులు, రైతు, మీనుగోనిపల్లి, దేవరకద్ర మండలం