ఊట్కూర్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ( Congress ) పాలనలో పేదలు, మధ్య తరగతి ప్రజలు, రైతులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ( Chittem Rammohan Reddy) ఆరోపించారు. నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని బిజ్వారం, ఎడవెల్లి గ్రామాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ ( BRS )పార్టీ కార్యకర్తల వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం గ్రామాల్లో సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
గడిచిన ఏడాదిన్నరలో నియోజకవర్గంలోని ఏ గ్రామంలోకి వెళ్లిన ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నట్లు తన దృష్టికి తెస్తున్నారని తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకపోవడంపై ప్రజలు నిలదీస్తున్నారని పేర్కొన్నారు. ప్రధానంగా రైతు రుణమాఫీ, రైతు భరోసా అందక పోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో తిరిగి అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజా సమస్యలను విస్మరించిన ప్రభుత్వానికి అధికారంలోకి వచ్చి రెండేళ్లు కూడా గడవకముందే భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఆయన వెంట ఊట్కూర్ మాజీ ఎంపీపీ వెంకట్రామ రెడ్డి, మక్తల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నరసింహ గౌడ్, నరసింహులు గౌడ్, రామలింగం గౌడ్, నాయకులు పాల్గొన్నారు.