ఖిల్లాఘణపురం, సెప్టెంబర్ 1 : అదును దాటుతున్నా పంటలకు వేసేందుకు యూరియా అధికారులు ఇవ్వడం లేదంటూ ఓ కౌలు రైతు బిల్డింగ్ పైకి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన వనపర్తి జిల్లాలో చోటు చేసుకున్నది. వివరాలిలా.. ఖిల్లాఘణపురం సింగిల్విండో కార్యాలయానికి సోమవారం 600 బస్తాల యూరియా రాగా.. రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పోలీసులు అన్నదాతలను క్యూలో నిల్చోబెట్టారు. అదే సమయంలో మండల కేంద్రానికి చెందిన కౌలు రైతు చెన్నకేశవులు యూరియా కోసం అక్కడికి వచ్చాడు.
అక్కడ అంత మందిని చూసి యూరియా అందుతుందో? లేదో? అని అసహనానికి గురయ్యాడు. సింగిల్విండో కార్యాలయ భవనంపైకి వెళ్లి కింది దూకి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. పోలీసులు అతడికి నచ్చజెప్పి కిందికి దించారు. తర్వాత అక్కడున్న విలేకరులతో కౌలు రైతు తన బాధను వెల్లగక్కాడు. ఐదు ఎకరాలలో వరి నాట్లు నాటానని, యూరియా కోసం సింగిల్విండో, ఫర్టిలైజర్ దుకాణాల చుట్టూ వారం రోజులుగా తిరుగుతున్నా ఇవ్వడం లేదని వాపోయాడు.
సాగు చేసిన పంట నాశనమవుతుంటే ది గులుతో ఏం చేయాలో తోచ క ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్లు తెలిపాడు. అయితే మధ్యాహ్నం తర్వాత సదరు కౌలు రైతు మాట మార్చా డు. తాను సింగిల్విండో కార్యాలయ భవనపైకి ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్లలేదని.. పైన మా మేస్త్రీలు ఉన్నారేమో అని చూడడానికి వెళ్లానని చెప్పాడు. కాగా ఇతడిని ఎవరు భయపెట్టారో.. అందుకే మాట మార్చాడంటూ పలువురు రైతులు మాట్లాడుకున్నారు.