మహబూబ్‌నగర్, జూన్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాల్లో ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుండగా స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచిన ఈవీఎంలను కేంద్రాలకు తరలించి ఓట్లు లెక్కించనున్నారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్లో 14 టేబుళ్లు, నాగర్‌కర్నూల్ పార్లమెంట్లో 14 టేబుళ్లు ఏర్పాటు చేసి కౌంటింగ్ చేపట్టనున్నారు. ఇప్పటికే ఆయా జిల్లాల రిటర్నింగ్ అధికారులు కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. కౌంటింగ్‌లో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చూడాలని ఎన్నికల సంఘం పరిశీలకులు ఆదేశించారు. పార్లమెం ట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు మరికొన్ని గంటల్లో ప్రా రంభం అవుతుండడంతో అంతటా ఉత్కంఠ నెలకొన్న ది. ఇప్పటికే ప్రధాన అభ్యర్థి గెలుస్తాడని చెప్పి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ బెట్టింగ్‌లు జరిగినట్లు సమాచారం. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూ ల్ పార్లమెంట్ స్థానాల్లో ఎవరు పాగా వేస్తారో మంగళవారం మధ్యాహ్నానికే తేలిపోనుంది. కౌంటింగ్ జరుగుతున్న దృష్ట్యా మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రాల్లో పో లీస్ యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. మహబూబ్‌నగర్ పార్లమెంట్‌కు సం బంధించి ఏడు సెగ్మెంట్ల ఓట్లు లెక్కింపు పాలమూరు యూనివర్సిటీలో, నాగర్‌కర్నూల్ పార్లమెంట్‌కు సంబంధించి నాగర్‌కర్నూల్‌లోని వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాముల్లో లెక్కింపు నిర్వహించనున్నారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో లోక్‌సభ ఓట్ల లె క్కింపునకు అధికార యంత్రాంగం పకడ్బందీగా ఏ ర్పాట్లు చేసింది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. అనంతరం 8:30 నుంచి ఈవీఎంల ఓట్ల లెక్కిం పు ప్రారంభమవుతుంది. దీంతో కౌంటింగ్ కేంద్రం వద్ద ఆయా జిల్లాల పోలీసుల ఆధ్వర్యంలో పటిష్ట భద్రతను చేపట్టారు. సోమవారం కౌంటింగ్ ఏర్పాట్లను మహబూబ్‌నగర్ రిటర్నింగ్ అధికారి రవినాయక్, నాగర్‌కర్నూల్ రిటర్నింగ్ అధికారి ఉదయ్‌కుమార్ పరిశీలించారు. మహబూబ్‌నగర్ లోక్‌సభ పరిధిలో మొత్తం 31మంది, నాగర్‌కర్నూల్ బరిలో 19 మంది అభ్యర్థులు పోటీ చేశారు.
ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఆయా లో క్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు వేర్వేరుగా ఓట్ల లెక్కింపును నిర్వహించనున్నారు. కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 282 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి 14 టేబుల్స్ 21 రౌండ్లు, నారాయణపేట 270 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి 14 టేబుల్స్, 20 రౌండ్లు, మహబూబ్‌నగర్ లోని 275 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి 14 టేబుల్స్ 20 రౌండ్ల వారీగా ఓట్లను లెక్కించనున్నారు. జడ్చర్ల 274 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి 14 టేబుల్స్ 20 రౌండ్స్, దేవరకద్ర 289 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి 14 టేబుల్స్ 21 రౌండ్స్, మక్తల్ 284 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి 14 టేబుల్స్ 21 రౌండ్స్, షాద్‌నగర్ 263 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి 14 టేబుల్స్ 19 రౌండ్ల వారీగా ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.
పార్లమెంట్ పరిధిలో జరిగే సెగ్మెంట్ల వారీగా ఉండే కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటిని ఇటు పోలీసుశాఖ అటు రెవెన్యూ యంత్రాంగం ప్రత్యేక కంట్రోల్ రూంల ద్వారా పర్యవేక్షిస్తారు. అంతేకాక కేంద్ర ఎన్నికల సంఘం పోర్టల్‌కు అనుసంధానిస్తారు. కేంద్రంలో ఏ చిన్న తప్పు జరిగినా వెంటనే సరి చేసేందుకు ఏర్పాట్లు చేశారు. రౌండ్ల వారీగా చేపట్టిన ఓట్ల లెక్కింపు ఫలితాలను ఎప్పటికప్పుడే మీడియాకు.. ఎలక్షన్ కమిషన్ పోర్టల్‌లో ఉంచనున్నారు. కౌంటింగ్ కోసం సూపర్వైజర్స్ 140 మంది, కౌంటింగ్ అసిస్టెంట్లు 153, మైక్రోఅబ్జర్వర్లు 145 మంది, రిజర్వులో 20శాతం మంది సిబ్బందిని కేటాయించారు.
ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్‌సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతున్నది. గెలుపోటములపై అప్పుడే అంచనాలు వేసుకుంటున్నారు. రాష్ట్రంలో అధికారం మారడం, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు రావడం.. సీఎం సొంత జిల్లా కావడంతో రెండు పార్లమెంట్ స్థానాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టిదెబ్బ తగలడంతో ఈ పార్లమెంట్ స్థానాలు కూడా ఉంటాయా.. ఊడుతాయా.. అనే చర్చ మొదలైంది. మరోవైపు బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ గెలుపు జోష్ కనిపిస్తున్నది. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సైలెంట్ ఓటింగ్ జరిగిందని ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు అనుకూలంగా మారాయని ఆ పార్టీ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇక బీజేపీ మాత్రం మోదీ హవా స్పష్టంగా కనిపిస్తుందని.. గెలుపు తమదేనంటూ చెబుతున్నారు. మొత్తంపైన రెండు పార్లమెంట్ స్థానాల్లో 50 మంది అభ్యర్థుల భవితవ్యం ఓటర్లు తేల్చనున్నారు.