వనపర్తి, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): వరి కోత ల ప్రారంభమైనా.. ధాన్యం కొనుగోలుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. యాసంగిలో రైతు లు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధరకు కొంటామని ఎమ్మెల్యేలు ప్రగల్బాలు పలికి కేంద్రాలను ఆర్భాటంగా ప్రారంభించి వెళ్తున్నారే తప్పా.. కేంద్రాల వద్ద కావాల్సిన ఏర్పాట్ల గుర్తించి పట్టించుకున్నా పాపాన పోలేదు.
గన్నీ బ్యాగుల కొరత, తూకాలు వేసేందుకు కనీసం కాంటాలను ఏర్పాటు చేయడంలేదని రైతులు వాపోతున్నారు. కొత్తపల్లిలో 25 రోజుల కిందట వరికోతలు మొదలయ్యాయి. ఈ సెంటరులో ప్రస్తుతం 30లారీల వరి ధాన్యం తూకాలకు సిద్ధంగా ఉన్నది. అయితే, ప్రారంభోత్స వం రోజు కనిపించిన నిర్వాహకులు మళ్లీ ఇటువైపు కన్నెత్తి కూడా చూడలేదు.
ఎమ్మెల్యే వెళ్లిపోయిన వెంటనే కాంటాను కూడా తీసుకెళ్లారు. గ్రామంలో కల్లాలు లేక కొత్తపల్లి నుంచి దుప్పల్లి వరకు రోడ్డుపై దాదాపు కిలోమీటరు పొడవునా ధాన్యం రాసులు పోసుకుని కొనుగోలు చేసే పరిస్థితి లేక రైతులు అవస్థలు పడుతున్నారు. సెంటర్ నిర్వాహకులను అడిగితే సంచులు రాలేదని చెబుతున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇది జిల్లాలోని వరి కొనుగోలు సెంటర్ల పనితీరుకు దర్పణం పడుతుంది.
ఊపందుకున్న కోతలు
యాసంగి సీజన్లో వరికోతలు ప్రారంభమయ్యా యి. ఉగాది పర్వదినం అనంతరం జిల్లాలోని కొత్తకోట, మదనాపురం, అమరచింత, ఆత్మకూరు, పె బ్బేరు, ఘణపురం, గోపాల్పేట మండలాల్లో వరి కోతలు షురూ అయ్యాయి. మిగిలిన మండలాల్లో నూ అక్కడక్కడా మొదలవుతున్నాయి. ఇక వా రం రోజుల్లో జిల్లాలోని 15 మండలాలవారీగా వరికోత ల జోరు ఊపందుకోబోతుంది. ఈ మేరకు జిల్లాలో వరికోతలు మొదలైనప్పటికీ ప్రభుత్వం లక్ష్యానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయడంలో విఫలమవుతున్నది.
వనపర్తిలో అత్యధిక వరి శిస్తు
ఉమ్మడి జిల్లాల పరంగా చూస్తే.. వనపర్తి జిల్లాలో అత్యధిక వరి శిస్తు ఉంది. వానకాలం కంటే యాసంగిలో వరిసాగు పెరిగింది. లక్షా75వేల ఎకరాల్లో యాసంగి వరి శిస్తు జరిగింది. జూరాల, భీమా ప్రాజెక్టుల కాల్వ నీళ్ల వసతి ఉన్నందునా వరి సాగును రైతులు ఎక్కువగా చేస్తున్నారు. రాష్ట్రస్థాయిలో వరి ఎక్కువగా పండించే జిల్లాల సరసన వనపర్తి కూడా ఉంది. ఈ క్రమంలో యాసంగి ధాన్యం కొనుగోళ్ల పరిస్థితి ముందు నుయ్యి.. వెనక గొయ్యి అన్నట్లు ఉంది. దీనిపై జిల్లా అధికార యంత్రాంగం మిల్లర్లు, సెంటర్ల నిర్వాహకులతో సమీక్షలు నిర్వహిస్తున్నా ఆశించిన మేరలో పనులు ముందుకుసాగడం లేదు.
3.40 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యం
జిల్లాలో సాగైన యాసంగి వరి పంటల నుంచి 3.40 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం వస్తుందని జిల్లా వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా 414 కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేయాలని జిల్లా పౌరసరఫరాల శాఖ నిర్ణయించిం ది. అయితే, 10 ఏప్రిల్ నాటికి సగం సెంటర్లను తెరవాలన్న లక్ష్యం నిర్దేశించుకున్నప్పటికీ ఆచరణలో జరగలేదు. ఇప్పటి వరకు జిల్లాలో 100 సెంటర్లు కూడా తెరచుకోలేదంటే.. కొనుగోళ్ల పనితీరు ఎలా ఉందో తెలుస్తుంది.
కొన్ని సెంటర్లు మాత్రమే మొ క్కుబడిగా తెరుచుకోగా, అక్కడ గన్నీ బ్యాగులు, తూ కాలకు అవసరమైన ఏర్పాట్లు లేకుండానే ప్రారంభోత్సవంతో మమ అనిపిస్తున్నారు. అయితే, యాసంగిలో పండిన పంటలో మళ్లీ రైతులు వారి అవసరాల కోసం పంటను మిగుల్చుకోవడం.. ఇతర అవసరాల వాళ్లు తీసుకోగా, ప్రభుత్వానికి 2.50లక్షల క్వింటాళ్ల ధాన్యం సేకరణ చేయాల్సి వస్తుందన్న అం చనాలో జిల్లా ఫౌర సరఫరాల శాఖ ఉంది.
గోడౌన్లు లేవు
కొనుగోలు చేసిన వరి ధాన్యం నిల్వ చేసేందుకు కూడా గోడౌన్ల కొరత స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు 15వేల క్వింటాళ్ల ధాన్యం నిల్వ చేసే మూడు గోడౌన్లను మాత్రమే గుర్తించారు. చిట్యాల, వెల్టూరు, అన్నారం గోడౌన్లలో ఒక్కదానిలో 5వేల మెట్రిక్ టన్నుల వరకు నిల్వ చేసేందుకు వీలుంది. ఈ మూడు గోడౌన్లు తూకాలు కరెక్ట్‌గా జరిగితే ఒక్కరోజుకు కూడా సరిపోయేలా లేవు.
25 రోజులకు పైబడి జిల్లాలో వరి కోతలు జరుగుతున్నాయి. లక్షలాది బస్తాల ధాన్యం కేంద్రాల్లో సిద్ధంగా ఉంది. మదనాపురం మండలం అజ్జకొల్లులో దాదాపు లక్ష బస్తాల ధాన్యం సిద్ధంగా ఉంటే కేవలం 6వేల బస్తాలు మాత్రమే కొనుగోలు చేశారు. ఇంత భారీస్థాయిలో ధాన్యం ఎక్కడ నిల్వ చేయాలో కూడా గందరగోళం నెలకొన్నది. జిల్లాలో యాసంగిలో పండిన ధాన్యానికి సరపడా నిల్వ చేసేందుకు గోడౌన్లు లేని సమస్య అధికార యంత్రాంగానికి తలనొప్పిగా మారింది.
గ్యారెంటీ ఇవ్వని మిల్లర్లు
జిల్లాలో దాదాపు 200 వరకు రైస్ మిల్లులు ఉంటే, యాసంగిలో కొనుగోళ్లకు అర్హత మాత్రం ప్రస్తుతం 15 మిల్లులకే ఉన్నట్లు అధికారులు చెబుతుతున్నారు. అంతకుముందు సీజన్ల వారీగా తీసుకున్న ధాన్యం లెక్కల మేరకు ఈ సీజన్లో సీఎంఆర్ ధాన్యం కేటాయింపులను చేస్తున్నారు. ఈ లెక్కన ఇప్పటివరకు కేవలం కొద్ది మిల్లులకు మాత్రమే ధాన్యం కేటాయించే పరిస్థితులున్నాయి. అయితే, ఈ మిల్లర్లు కూడా ఇప్పటి వరకు బ్యాంకు గ్యారెంటీ ఇవ్వడం లేదు.
ముందు నుంచి చెబుతున్నా ఇప్పటి వరకు దీనిపై మిల్లర్లు కదలడం లేదు. కేవలం పదిశాతం బ్యాంకు గ్యారెంటీ ఇవ్వడానికి కూడా మిల్లర్లు వెనకా.. ముందు అవుతున్నారు. జిల్లాలో సీఎంఆర్ ధాన్యాన్ని అధిక మిల్లుల యజమానులు కొల్లగొట్టారు. సీఎంఆర్‌ను ఎగ్గొట్టీ మూడు, నాలుగు మిల్లులను ఏర్పాటు చేసుకుని కోట్లాది రూపాయల ప్రభు త్వ సొమ్మును అధికారులతో కుమ్మక్కయి స్వాహా చేశారు. గడచిన మూడేళ్లుగా ఈ తతంగం నడుస్తూనే ఉంది. ఇలా ప్రతిసీజన్లోను మిల్లర్ల అవినీతి చర్యలతో కొనుగోళ్ల ప్రక్రియ ఉల్టాపల్టా అవుతున్నది. ఈ సీజన్‌కు సంబంధించి మిల్లర్లు బ్యాంకు గ్యారెంటీలు ఎప్పుడు ఇస్తాన్నది ప్రశ్నార్థకంగా ఉంది.
జిల్లాలకు తరలింపుపై రాని అనుమతులు
జిల్లాలో గోడౌన్ల కొరత, రైస్‌మిల్లర్ల బ్యాంక్ గ్యారెంటీలు సక్రమంగా లేని పరిస్థితిలో ఇక్కడి వరిధాన్యం ఇతర జిల్లాలకు తరలించాలని ఫౌరసరఫరాల శాఖ ప్రతిపాదనలు చేసింది. ఇందుకు 1.60 లక్షల మెట్రిక్ టన్నుల యాసంగి ధాన్యాన్ని ఇతర జిల్లాలకు తరలించాల్సి వస్తుందని, ఇందుకు ఏఏ జిల్లాలకు పంపాలో తెలపాలని ఫౌర సరఫరాల శాఖ కమిషనర్‌కు ప్రతిపాదన పంపారు. దీనిపై ఇంతవరకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. ఈ పరిస్థితిలో వరి కో తలు పెరగడం.. తూకాలు వేయాలని రైతుల నుంచి డిమాండ్ వస్తున్న క్రమంలో ధాన్యం ఎక్కడికి తరలించాలో గందరగోళం ఉంది. ముందస్తు ప్రణాళిక అమలులో అధికార యంత్రాంగం ఏమాత్రం తాత్సార్యం చేసిన రైతాంగం తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉన్నది.
ఎన్ని రోజులు ఆగాలి
నాలుగెకరాల్లో యాసం గి వరి కోత చేశా. 25 రోజుల కిందట సెంట రుకు వచ్చిన. ఎండకు వడ్లు ఒట్టిగా అయినవి. మేం ముగ్గురం అన్న దమ్ములం. మా వడ్లే ఒక లారీ అవుతాయి. తూకం చేస్తారని ఎదురుచూస్తున్నాం. ఎవరూ పట్టించుకోవడం లేదు. ఒకచోట వందల లారీల వడ్లు బొడ్డెలు పోసీనా తూకాలు ఎందుకు చేయడం లేదో అ ర్థమైతలేదు. మా బాధలు ఎవరికి చెప్పు కోవాలే.. రాత్రి..పగలు కష్టం చేసి అమ్ముకు నేందుకు ఇంత ఇబ్బంది పడాల్సి వస్తుంది. సర్కార్ కొనకపోతే రైతులు ఆగమైతరు.
– రాయుడు, కొత్తపల్లి, మదనాపురం మండలం
అన్ని ఏర్పాట్లు చేస్తాం
యాసంగి కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు చేస్తాం. బ్యాంక్ గ్యారెంటీ ఇ చ్చిన మిల్లర్లకు మాత్ర మే సీఎంఆర్ కేటాయి స్తాం. జిల్లాకు సరిపడా ధాన్యం నిల్వ చేసేందు కు ఇప్పటి వరకు మూడు గోడౌన్లు గుర్తించాం. ఇంకాను గుర్తించే పనిలోఉన్నాం. ఇప్పటి వరకు సెంటర్ల నిర్వాహకులు, మిల్లర్లు, ట్రాన్స్పోర్ట్ నిర్వాహకులతో కలెక్టర్ ఆధ్వర్యంలో సమీక్షలు నిర్వహించాం. త్వరలోనే ఫౌరసరఫరాల శాఖ కమిషనరేట్ నుంచి కూడా ఇతర జిల్లాలకు ధాన్యం తరలించే అనుమతులు కూడా వస్తాయి. రైతులకు ఎలాంటి సమస్యను రానివ్వకుండా ధాన్యం కొనుగోళ్లు జరిపిస్తాం.
– వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్, వనపర్తి