గద్వాల, ఏప్రిల్ 4 : యాసంగి సీజన్లో రైతులు సాగు చేసిన పంటలకు వారబంధి పద్ధతిలో ఏప్రిల్ 15వ తేదీ వరకు పూర్తి స్థాయిలో సాగునీరు అందిస్తామని అధికారులు, ప్రభుత్వం చెప్పింది. ఈ మాటలు నమ్మిన రైతులు యాసంగిలో జోగుళాంబ గద్వాల జిల్లాలో వాణిజ్య పంటలతో పాటు వరి సాగు చేశారు. అయితే ఎగువ నుంచి వచ్చే నీరు పూర్తి స్థాయిలో రాకపోవడంతో ప్రాజెక్టుల్లోని నీరు అడుగంటిపోవడంతో.. సాగు చేసిన చివరి పంటలకు సాగునీళ్లు అందని పరిస్థితి తలెత్తింది.
దీంతో పంట కళ్ల ముందే ఎండిపోతుంటే తల్లడిల్లిపోతున్నారు. తమ పంట పొలాలకు సాగునీరు అందించి పంటలు కాపాడాలని రైతులు కలెక్టరేట్ వద్ద ఆందోళనలు చేసినా.. ప్రజా ప్రతినిధులను వేడుకున్నా ఫలితం లేకుండాపోయింది. కర్ణాటక ప్రభుత్వాన్ని మన జిల్లా మంత్రితోపాటు ఎమ్మెల్యేలు కలిసి పంటలకు సాగునీరు ఇవ్వాలని కోరగా అందుకు వారు సానుకూలంగా స్పందించినప్పటికీ అనుకున్న స్థాయిలో నీళ్లు విడుదల చేయడం లేదని రైతులు వాపోతున్నారు.
కాగా అధికారులు ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న అరకొర నీటిని విడుదల చేస్తూ పంటలకు పూర్తి స్థాయిలో నీరు ఇస్తున్నామని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. గద్వాల మండలం కొత్తపల్లి, బీరెల్లి, లత్తిపురం తదితర గ్రామాల్లో సుమారు 950 ఎకరాలకుపైగా వరి పంటను సాగు చేశారు. అయితే అధికారులు కాల్వకు వదిలే నీరు తక్కువ స్థాయిలో వదలడంతో చివరి పంటలకు సాగునీరు అందక పోవడంతో సాగు చేసిన పంటల్లో సగభాగం పంటలు ఎండిపోయాయి. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఎండిన పంట పొలాలను సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక పంపాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ఏప్రిల్ 15 వరకు రైతులు సాగు చేసిన పంటలను ఎండనివ్వకుండా పూర్తి స్థాయిలో పంటలకు నీరు అందిస్తామని అధికారులు చెప్పడంతో వారి మాటలు నమ్మిన రైతులు జూరాల ప్రాజెక్ట్ కుడి కాల్వ కింద వరిని సాగు చేశారు. కర్ణాటక ప్రభుత్వం 4 టీఎంసీలు విడుదల చేస్తానని చెప్పి ఒక టీఎంసీ నీటిని మాత్రమే విడుదల చేయడంతో ఇచ్చిన మాట ప్రకారం అధికారులు నీటిని విడుదల చేయలేకపోతున్నారు. అయితే మొదట వారబంధి పద్ధతిలో వారానికి నాలుగు రోజులు నీటిని విడుదల చేసిన సమయంలో రైతులకు ఎంటువంటి ఇబ్బంది లేదు.
ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గిపోవడంతో అధికారులు దానిని మూడ్రోజులకు కుదించారు. తర్వాత రెండ్రోజులకోసారి.. నీటిని విడుదల చేయడం మొదలు పెట్టారు. అయితే వదిలే నీరు కాల్వలకే సరిపోవడంతో చివరి ఆయకట్టు వరకు నీరు వెళ్లకపోవడంతో పంటలు ఎండి పోయాయి. ప్రస్తుతం వారానికి ఒకటిన్నర రోజు మాత్రమే నీటిని విడుదల చేస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. దీంతో పంట పొలాలకు నీరు అందడం లేదని రైతులు వాపోతున్నారు.
నీళ్లొచ్చిన సమయంలో ఒక రైతు ఎకరాకు 3 గంటలే నీరు పారించుకోవాలన్న నిబంధనలు పెట్టు కోవడం వల్ల ఎకరా వరకు పంటకు నీళ్లు అందుతాయి. కానీ ఎక్కువ ఎకరాలు సాగు చేసిన రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. పంట చేతికొచ్చిన సమయంలో ఎండిపోతుండడంతో పెట్టిన పెట్టుబడి అంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుండడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. మరో రెండు తడుల వరకు సాగునీరు అం దిస్తే తమ పంటలు పండుతాయని, ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.