కల్వకుర్తి, డిసెంబర్ 30 : కల్వకుర్తి మున్సిపాలిటీలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులు మరోసారి ఆందోళనకు దిగారు. ఈనెల 30 వరకు ఇండ్లను లబ్ధిదారులకు అందజేస్తామని ఎమ్మెల్యే ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సోమవారం ఇండ్ల సముదాయానికి లబ్ధిదారులు చీపుర్లు, బకెట్లతో చేరుకొని టెంట్ వేసుకొని ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం ఇళ్లు లేని నిర్భాగ్యుల కోసం మున్సిపాలిటీలో సర్వే నెంబర్ 99 ప్రభుత్వ భూమిలో 240 ఇండ్లు నిర్మించిందని తెలిపారు.
తర్వాత కలెక్టర్ ఆధ్వర్యంలో లక్కీడ్రా నిర్వహించి అర్హులను ఎంపిక చేశారని వివరించారు. అంతలోనే ప్రభుత్వం మారడంతో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ సర్కారు వాటిని అందించకుండా కాలయాపన చేస్తోందన్నారు. ఏడాది కాలంగా అధికారులు, ప్రజాప్రతినిధులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులను కలిసినప్పుడు అప్పుడు.. ఇప్పుడు.. అంటూ కాలం వెళ్లదీస్తున్నారని దుయ్యబట్టారు.
గత నెలలో ఎమ్మెల్యేను అడిగితే డిసెంబర్ 30వ తేదీ వరకు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. వెంటనే అందజేస్తే ఇండ్లను శుభ్రం చేసుకునేందుకు చాటలు, చీపుర్లు, బకెట్లతో వచ్చామని లబ్ధిదారులు తెలిపారు. ఎమ్మెల్యే తమకు మాట ఇచ్చి మోసం చేశారని వాపోయారు. ఎమ్మెల్యే వచ్చి వెంటనే తమకు ఇండ్లు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకొన్న ఎస్సై మాధవరెడ్డి అక్కడికి చేరుకొని ధర్నా విరమింపజేయాలని వారికి నచ్చజెప్పే యత్నం చేశారు. తమకు ఇండ్లు ఇచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుకూర్చున్నారు. మమ్మల్ని జైలుకు తరలించినా సరే ధర్నా విరమించేది లేదని తేల్చిచెప్పారు. దీంతో అతను అక్కడి నుంచి వెనుదిరిగారు.