కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన రెండు పడక గదులు ఇండ్లులేని లబ్ధిదారులకు కేటాయించడంలో అధికార యంత్రాంగం విఫలమైంది. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని మౌలాలిగుట్ట ప్రాంతంలో సుమారు రూ.32 కోట్లతో 28 బ్లాకులుగా 588 ఇండ్లను నిర్మించారు. బీఆర్ఎస్ హయాంలోనే కొందరు లబ్ధిదారులకు ఇండ్లు కేటాయిస్తూ అందుకు సంబంధించిన పట్టాలు కూడా అందించింది. మరొకొందరి పేర్లు ప్రకటించారు. కానీ నేటికీ లబ్ధిదారులకు అప్పగించకపోవడంతో భవనాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. రాత్రి వేళల్లో కొందరు ఆకతాయిలు తాళాలు పగలగొట్టి విద్యుత్ సామగ్రి, ఇతర వస్తువులను దొంగిలిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఇళ్లు నిర్మించినా రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు సౌకర్యం కల్పించలేదు. సౌకర్యాలు కల్పిస్తే ప్రతి ఒక్కరూ ఇక్కడ నివాసం ఉండే అవకాశం ఉంది. గూడు లేని నిరుపేదలు అద్దె భారం మోయలేక నానా పాట్లు పడుతున్నారు. మౌళిక సౌకర్యాలు త్వరగా కల్పిస్తే ప్రతి నెలా చెల్లించే అద్దె భారం తప్పనున్నది. అయితే ఇళ్లు పంపిణీ చేసినా తమను పట్టించుకోవటం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా పాలన ప్రభుత్వం త్వరగా పనులు పూర్తి చేసిన నిరుపేదలను ఆదుకోవాలని, రెండు పడక గదుల ఇళ్ల లబ్ధిదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
నిరుపేదల సొంతింటి కల నెరవేర్చేందుకు పాలమూరు నలువైపులా దివిటిపల్లి, క్రిస్టియన్‌పల్లి, సక్కనిరాయి, ఏనుగొండ ప్రాంతాల్లో రెండు పడ క గదుల ఇళ్లు నిర్మించాం. వాటిలో మూడు ది క్కులా పంపిణీ పూర్తి చేయగా.. మౌలాలీగుట్ట వద్ద నిర్మించిన ఇండ్ల పట్టాలు కొందరికి పంపిణీ చే శాం. ఇంకొందరికి ఇవ్వాల్సి ఉండే. నెల రోజుల్లో నీళ్లిచ్చి.. రోడ్లు వేసి, మౌలిక సదుపాయాలు కల్పించి గృహప్రవేశాలు చేయించే అవకాశం ఉన్నా.. గతేడాది ఏ స్థితిలో ఉన్నాయో..? అదే స్థాయిలో ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిర్మించిన డబుల్ ఇండ్లను వెంటనే లబ్ధిదారులకు కేటాయించి గృహ ప్రవేశాలు చేయించాలి. వీళ్లు నిర్లక్ష్యం చేయడంతో నిరుపేదలపై భారం పడుతోంది.
– శ్రీనివాస్‌గౌడ్, మాజీ మంత్రి
‘అంగట్లో అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని’ అన్న చందంగా తయారైంది.. మహబూబ్‌నగర్ జిల్లాలో డబుల్ బెడ్రూం ఇండ్ల పరిస్థితి. గూడులేని నిరుపేదలకు ఓ సౌధం ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించింది. అయితే ప్రభుత్వం మారడంతో డబుల్ ఇండ్లు దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. బీఆర్ఎస్ హయాంలోనే అన్ని హంగులతో భవన నిర్మాణాలు పూర్తయినా.. నేటికీ చాలా వరకు లబ్ధిదారులకు కేటాయించలేదు. ప్రజాపాలన సర్కారు కొలువు దీరి ఏడాది పూర్తయినా నేటికీ గృహప్రవేశాలు మాత్రం చేయలేదు.
– మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ, డిసెంబర్ 30