నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 18 : ఏదుల రిజర్వాయర్ నుంచి డిండి ప్రాజెక్టుకు కాంగ్రెస్ సర్కారు నీటిని తరలించి ఉమ్మడి పాలమూరు జిల్లాకు అన్యాయం చేయొద్దని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత నాగం జనార్దన్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. ఏదుల జలాశయం నుంచి డిండి లిఫ్ట్‌కు ప్రతిరోజూ అర టీఎంసీ నీటి చొప్పున ప్రతిరోజూ పీఆర్ఎల్ఐఎస్ ప్రాజెక్టు నుంచి మొత్తం 30 నుంచి 40టీఎంసీల నీటిని తీసుకోవడం ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసిన పూర్వ మహబూబ్‌నగర్ జిల్లా రైతుల చట్టబద్దమైన హక్కును కోల్పోతుందన్నారు. (సున్నపురాళ్ల తండా నుంచి కొల్లాపూర్ సమీపంలోని కుడికిళ్ల వరకు 3.5 కిలోమీటర్ల కాల్వ తప్పా) శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 2టీఎంసీల వరద నీటిని తీసుకునే 4లిఫ్ట్‌లతో కూడిన కన్వేయర్ వ్యవస్థ, నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన, ఉదండాపూర్ వద్ద ఉన్న రిజర్వాయర్లను కలుపుతూ కాల్వలు, సొరంగాలు, పంపింగ్ స్టేషన్లతో 12,30,000 ఎకరాలకు సాగునీరు అందించడానికి పూర్వ మహబూబ్‌నగర్ జిల్లాలో 7వేల ఎకరాలు, రంగారెడ్డి జిల్లాలో 5వేలు, నల్లగొండ జిల్లాలో 30వేల ఎకరాలకు సాగునీరు అందించడానికి కేసీఆర్ సర్కారు పనులు చేపట్టిందన్నారు.
నల్లగొండ జిల్లాలోని దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లోని 3,041ఎకరాలకు శ్రీశైలం ప్రాజెక్టు ముందరి తీరం నుంచి నీటిని తీసుకురావడానికి డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని(డీఎల్ఐఎస్) ప్రతిపాదించిన విషయాన్ని లేఖలో నాగం జతపర్చారు. ఇక్కడి రైతుల సమస్యలను గుర్తించి ఏదుల రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకునే ప్రతిపాదనను విరమించుకోవాలని, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల రైతుల ప్రయోజనాలను కాపాడాలని అభ్యర్థించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా కరువు పీడిత జిల్లా అని, 36లక్షల ఎకరాల సాగుభూమిని కలిగి ఉన్నా ఇప్పటికీ జూరాల ప్రాజెక్టు, కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల నుంచి 7-8లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందిస్తున్నారని పేర్కొన్నారు.
నల్లగొండ జిల్లాలో 24.7లక్షల ఎకరాల సాగుభూమి ఉండగా, అక్కడికి అన్ని ప్రాజెక్టుల నుంచి నీటిపారుదల సౌకర్యం ఉందని గుర్తుచేశారు. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ, ఏఎంఆర్పీ, మూసీ ప్రాజెక్టు, గోదావరి నది నుంచి వచ్చే కాల్వలు సుమారు 17లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాయన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగం దేవరకొండ, మునుగోడు, నల్లగొండలోని ఇతర ప్రాంతాల్లో సుమారు 5నుంచి 6లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి ప్రతిపాదించబడిందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలోని ఏదుల రిజర్వాయర్ నుంచి నీటిని డిండికి తీసుకెళ్తే మహబూబ్‌నగర్-రంగారెడ్డి జిల్లాల ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. దీంతోపాటు వట్టెం, కర్వెన, ఉదండాపూర్ రిజర్వాయర్ల లిఫ్ట్‌ల నుంచి నీటిని లిఫ్ట్ చేయడానికి నీరు అందుబాటులో ఉండదన్నారు. ఏదుల నుంచి డిండి ప్రాజెక్టుకు నీటిని తరలించే విషయమై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నల్లగొండ జిల్లాకు చెందిన వెంకట్‌రెడ్డికి సైతం నాగం లేఖ ద్వారా ఇక్కడి ప్రజలకు జరుగుతున్న అన్యాయం గురించి వివరించారు.