అలంపూర్, మే 15 : ఉండవల్లి మండలంలోని ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో పనిచేస్తున్న ఉపాధి కూలీలకు మూడు నెలలుగా పే స్లిప్పులు ఇవ్వడం లేద ని బుధవారం వ్యవసాయ కార్మికసంఘం ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఎండాకాలంలో నిబంధనల మేరకు ఉపాధి కూలీలకు పని ప్రదేశంలో నీడ, మంచినీళ్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీ వంటి ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదని కూలీలు ఆరోపించారు. పనులను పర్యవేక్షించాల్సిన మండలస్థాయి అధికారులు సైతం పట్టీపట్టనట్లు వ్యవహరించారని వ్యవసాయ కార్మికసంఘం జిల్లా కార్యదర్శి దేవదాసు, రాష్ట ఉపాధ్యక్షుడు ఆంజనేయులు ధ్వజమెత్తారు.
అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా మూడు నెలలుగా కూలీలకు పే స్లిప్పులివ్వడంలో జా ప్యం జరిగిందన్నారు. వంద రోజుల వేతనాలు ఇవ్వకపోతే కూలీల కుటుంబాలు ఏవిధంగా బతుకుతాయని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా రోజుకు రూ..300 చెల్లించాలని.. పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా కూలి రేటును రూ.600 వరకు పెం చాలని డిమాండ్ చేశారు. ప్రతి కుటుంబానికి వంద రో జుల పని దినాలు కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నదన్నారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఉపాధి కూలీలు, వ్యవసాయ కార్మికసంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.