హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): తరగతికి ఒక గది ఉండాలి. అవసరమైన మేరకు టీచర్లుండాలి. అయితే ఈ మాటలు కేవలం నినాదానికే పరిమితమయ్యాయి. వాస్తవాలు ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. రాష్ట్రంలో 16% ప్రాథమిక బడులు సింగిల్ క్లాస్రూమ్తోనే నడుస్తున్నాయి. రాష్ట్రంలో 15,919 ప్రాథమిక బడులుంటే ఏకంగా 2,554 సర్కార్ బడులు ఒకే తరగతి గదితో నడుస్తున్నాయి. ఒకే గదిలో అన్ని తరగతుల విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. 2025 యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేసన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్ యూడైస్ నివేదికలో ఈ వివరాలు బహిర్గతమయ్యాయి. రాష్ట్రంలో 24,692 సర్కార్ బడులుంటే 2,582 (16%) బడులు సింగిల్ క్లాస్ రూమ్తో నడుస్తున్నాయి. వీటిలో అత్యధికంగా 2,554 ప్రాథమిక పాఠశాలలే. అంటే 1-5 తరగతులను ఒకే గదిలో కుక్కి పాఠాలు చెబుతున్నారన్న మాట. 21 ప్రాథమికోన్నత పాఠశాలలు కూడా సింగిల్ క్లాస్ రూమ్తోనే నడుస్తున్నాయి. 21 బడుల్లో 1 నుంచి 7 తరగతులను ఒకే రూమ్లో నడుపుతున్నారు. 6 ఉన్నత పాఠశాలలు, ఒక జూనియర్ కాలేజీ కూడా సింగిల్ రూమ్తో నడుస్తున్నాయి. రాష్ట్రంలో 46% సర్కార్ స్కూళ్లు మూడు లేదా ఐదు గదులతోనే నడుస్తున్నాయి. ఇవన్నీ విద్యాహక్కు చట్టం అమల్లోకి వచ్చాక నెలకొల్పినవే. ఇది వరకు రాష్ట్రంలో సింగిల్ టీచర్ స్కూళ్లుండేవి. కానిప్పుడు సింగిల్ క్లాస్ రూమ్ బడులున్నట్టు ఈ నివేదిక వెల్లడించింది.
36% బడుల్లో సింగిల్ టీచరే..
రాష్ట్రంలో 36% సర్కార్ బడులు సింగిల్టీచర్ స్కూళ్లతోనే నడుస్తున్నాయి. ఇవన్నీ ప్రాథమిక పాఠశాలలే. ఇవే కాకుండా 1,920 బడుల్లో ఒక్కరంటే ఒక్క టీచర్ కూడాలేడు. ఇవి జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్లు. అటూ సింగిల్ టీచర్, ఇటూ సింగిల్ క్లాస్రూమ్లతో రాష్ట్రంలో ప్రాథమిక విద్య రానురాను నిర్వీర్యమవుతున్నది. బడుల్లో విద్యార్థుల నమోదు పడిపోతున్నది. ఈ విద్యాసంవత్సరం రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్ బడుల్లో విద్యార్థుల సంఖ్య 16.80లక్షలు మాత్రమే. వీటిలో 30 మంది లోపు విద్యార్థులున్న బడులు 9,737గా ఉంది. అంటే 30% బడుల్లో విద్యార్థుల సంఖ్య 30లోపే ఉండటం గమనార్హం. 24వేలకు పైగా బడుల్లో 500కు పైగా విద్యార్థులున్న సర్కార్ బడులు కేవలం14 మాత్రమే. 301-500లోపు విద్యార్థులున్న బడులు కేవలం 175 మంది మాత్రమే. మొత్తంగా రాష్ట్రంలో సర్కార్ బడులు సంక్షోభం దిశగా సాగుతున్నాయి.