హైదరాబాద్, మార్చి 13 (నమస్తేతెలంగాణ): ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక పేరిట ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో నిరుద్యోగుల గురించి పట్టించుకోకపోవడం దురదృష్టకరమని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన శుక్రవారం తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల ముందు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ నిరుద్యోగ డిక్లరేషన్ పేరిట ఏటా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్ల్లు దాటినా ఆ ఊసే ఎత్తడంలేదని దుయ్యబట్టారు. ఉద్యోగాలివ్వాలని ఆందోళనకు దిగిన నిరుద్యోగులపై దాష్టీకాన్ని ప్రదర్శించారని విమర్శించారు. నాడు నమ్మి ఓటేసిన పాపానికి నిరుద్యోగుల పుర్రెలు పగులగొడుతున్నారని మండిపడ్డారు. నోటిఫికేషన్లు రేపు మాపు అంటూ పత్రికలకు లీకులిస్తూ మభ్యపెట్టడం తప్ప ఉద్ధరించిందేమీలేదని ధ్వజమెత్తారు. సర్కార్ తీరుతో విసిగిపోయిన కాశీపేట మండలానికి చెందిన హరీశ్ బలవన్మరణానికి పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తంచేశారు.
అసెంబ్లీ సాక్షిగా డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ చిత్తు కాగితంగా మిగిలిపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ పాలనా వైఫల్యంతో ప్రైవేట్ కంపనీలు రాష్ట్రం నుంచి తరలిపోతున్నాయని, యువత ఉపాధికి గండిపడుతున్నదని చెప్పారు. విద్యావిధానాన్ని ప్రక్షాళన చేసేందుకు వేసిన ఆకునూరి మురళి నేతృత్వంలోని విద్యాకమిషన్ అసంబద్ధమైన అంశాలతో నివేదించిందని ఆక్షేపించారు. ఉపాధ్యాయుల వేతనాలను తగ్గించాలని, ఫీజు రీయంబర్స్మెంట్ ఎత్తేయాలని సిఫార్సు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పేద వర్గాలను విద్యకు దూరం చేసే కుట్ర ఆ నివేదికలో స్పష్టంగా కనిపిస్తున్నదని చెప్పారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని, లైసెన్స్డ్ సర్వేయర్లను విధుల్లోకి తీసుకోవాలని, వారి రెమ్యూనరేషన్ పెంచాలని, వెంటనే 20 వేల ఖాళీలతో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను సంప్రదించి నిరుద్యోగులతో కలిసి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.