Dharani | ధరణి.. రైతులకు మనోధైర్యాన్నిచ్చింది. భూ పంచాయితీలకు చెక్ పెట్టింది.. సులువుగా స్లాట్ బుకింగ్ చేసుకునే అవకాశం.. వేగంగా, పారదర్శకంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ.. నిమిషాల్లో భూ పట్టాల మార్పిడి.. త్వరగా మ్యుటేషన్లు.. ఆ తర్వాత రైతుబంధు సాయం అందించేలా చర్యలు.. ఇలా ఈ పోర్టల్ ఒక్కటే అయినా అన్ని సమస్యలకూ పరిష్కారం చూపింది. దళారీ వ్యవస్థను కనుమరుగు చేసింది.. అవినీతి అధికారులకు కళ్లెం వేసింది.. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన ఈ అద్భుత పథకంతో కర్షకులకు భరోసా పెరిగింది. నిర్ణీత ఫీజు మాత్రమే తీసుకొని అధికారులు సేవలందిస్తున్నారు. ప్రతి సెంట్ మొదలు.. వందల ఎకరాల వరకు ఆన్లైన్లోనే భూ వివరాలు లభ్యమవుతున్నాయి. ఇప్పటికే నాగర్‌కర్నూల్ జిల్లాలో 67,052 భూ బదలాయింపులు జరిగాయి. లంచం లేకుండా చేసిన ధరణి.. సీఎం దార్శనికత ఫలితమే అంటూ కర్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నాగర్‌కర్నూల్, జూన్ 15 : ధరణి పోర్టల్‌తో రెవెన్యూ శాఖలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి ప్రభుత్వం రైతులకు భూమిపై భరోసా కల్పించింది. నాడు గందరగోళంగా ఉన్న భూరికార్డు లు.. కొత్త రిజిస్ట్రేషన్ వ్యవస్థను అనుసంధానం చేయడంతో పారదర్శకత పెరిగిం ది. దీంతో భూ వివాదాలను కనీస స్థాయి కి తీసుకురావడమే కాకుండా రైతుకు భూభరోసా కల్పించింది. అవినీతికి అడ్డుకట్ట పడగా.. దళారీ వ్యవస్థకు చెక్‌పడింది. ధరణిపై నమ్మకం పెరిగిన కర్షకులు ధరణి తొలగించాలనే ప్రతిపక్షాలపై దుమ్మెత్తి పోస్తున్నారు. ధరణి కొనసాగితేనే రైతుబంధు, రైతుబీమాతో నేరుగా సాయం అందుతుందన్న నమ్మకం కర్షకుడికి కలిగింది. ధరణి తొలగించాలనే ప్రతిపక్షాల ఎత్తుగడలను, కుట్రలను కర్షకులే వ్యతిరేకిస్తున్నారు. ధరణితోనే తమ భూములకు భరోసా కలగడంతోపాటు ధైర్యం ఇచ్చిందని నమ్ముతున్నారు.
తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ సారథ్యంలో రైతుల ఇబ్బందులను గుర్తించి తీసుకొచ్చిన ధరణితో ధైర్యంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఏండ్ల తరబడిగా ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించింది. లక్షల మంది రైతులకు ధరణి ఎంతో ఆధారమవుతోంది. ఒక్కసారి ధరణి పోర్టల్‌కు తమ భూమి ఎక్కిందంటే ఎక్కడి నుంచైనా వివరాలు తెలుసుకునే వీలును పోర్టల్‌లో పొందు పరిచారు. దీంతో నాగర్‌కర్నూల్ జిల్లాలో ధరణి పోర్టల్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 3,25,540 ఖాతాలకు డిజిటల్ సంతకంతో పట్టాదారు పాసుపుస్తకాలను జారీ చేశారు. వీరందరూ రైతుబంధు పథకానికి అర్హులయ్యారు. విదేశాలలో ఉన్న వారికి సైతం ధరణిలో డిజిటల్ పట్టాదారు పాసు పుస్తకాలను అందజేశారు. వీరికి కూడా రైతుబంధుకు అందించేందుకు చర్యలు చేపట్టింది. ఇలా రోజుకు జిల్లా వ్యాప్తంగా సుమారు 200లకుపైగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.
దళారుల బెడద తప్పింది..
గతంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే భూమి కొనుగోలు చేసిన దానిక న్నా ఎక్కువ కష్టపడాల్సి వచ్చేది. పైరవీకారులు, అధికారుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అడిగినంత డబ్బులు ఇయ్యకుంటే ఫైల్ అటకెక్కేది. వీటినన్నింటినీ గమనించిన సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చారు. దళారులను ఆశ్రయించకుండా మీసేవలో స్లాట్ బుక్ చేసుకొని.. ఎంచుకున్న తేదీన తాసీల్దార్ కార్యాలయానికి వెళ్తే పనైతున్నది. మా నాయన చనిపోతే విరాసత్ చేసుకునేందుకు స్లాట్ బుక్ చేసుకున్నా. తాసీల్దార్ కార్యాలయంలో అరగంటలోనే మా పేర్లమీదకు భూమి మారింది. ధరణిపై ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష నాయకులను గంగలో కలపాలి.
– మల్లయ్య, రైతు, ఎంగంపల్లి, తాడూరు మండలం
తొందరగా పనైతుంది..
ధరణితో తొందర పనైతుంది. 30 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. దళారులు లేరు కాబట్టి ఎవరికీ పైసలియ్యాల్సిన పనిలేదు. గతంలో రిజిస్ట్రేషన్లు చేపించినప్పుడు మధ్యవర్తులు డబ్బులు తీసుకునేటోళ్లు. పాస్బుక్కు కూడా తొందరగనే ఇంటికొస్తుంది. బ్యాంకులో లోన్లు తీసుకోవాలన్నా గంటలోపు పని అయితున్నది.
– రాజు, నల్లవెల్లి, నాగర్‌కర్నూల్ మండలం
సులభతర ప్రక్రియ
ధరణి పోర్టల్ వల్ల రైతులకు లాభమే. చాలా తొందరగా రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. ప్రతి ఒక్కరికీ అర్థమవుతున్నది. రైతులు ఎలాంటి ఆందోళన చెందొద్దు. ఇది చాలా సులభతర ప్రక్రియ. ధరణి సరళతర విధానంలో రూపొందించబడింది. ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకుంటే ఒకట్రెండు రోజుల్లో రిజిస్ట్రేషన్ సమయం వస్తుంది. ఇచ్చిన తేదీ ప్రకారం తాసీల్దార్ కార్యాలయానికి వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది.
– భాస్కర్, తాసీల్దార్, నాగర్‌కర్నూల్
భూ సమస్యలు దూరం
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరణితో భూ సమస్యలు తీరుతున్నాయి. గతంలో ధరణి వంటి సదుపాయాలు లేక శాన ఇబ్బందులకు గురయ్యేటోళ్లం. రోజులు, నెలల తరబడి తాసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరగేటోళ్లం. పట్వారీలు మా చెప్పులు అరిగేలా ఆఫీసుల సుట్టూ తిప్పించుకునేటోళ్లు. అయినా సమస్యలు తీరేవి కాదు. ధరణితో భూ సమస్యలు త్వరగా పరిష్కారమవుతున్నాయి. సీఎం కేసీఆర్ సార్‌కు ధన్యవాదాలు.
-చందూలాల్, ఊడ్గులకుంట తండా, బిజినేపల్లి మండలం
ధరణితో భూమిపై భరోసా
ధరణితో భూమిపై రైతులకు భరోసా కలుగుతున్నది. ఇదివరకు నిత్యం భూ సమస్యలు ఉండేవి. రిజిస్ట్రేషన్లు చాలా ఆలస్యమయ్యేవి. ధరణి వచ్చాక అరగంటలోనే రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. గతంలో చేతిరాతతో పట్టా పాసుపుస్తకాలు ఉండేవి. అప్పటి పట్వారీలు భూములను తారుమారు చేసి మమ్మల్ని ఇబ్బందులకు గురిచేసేటోళ్లు. ఎన్నో అవకతవకలకు పాల్పడేవారు. ధరణి వచ్చినంక రైతుల సమస్యలు పరిష్కారమైతున్నయి.
– మహెమూద్ఖాన్, గంగారం
రిజిస్ట్రేషన్ వివరాలిలా..
ఇప్పటివరకు రిజిస్టేషన్లు : 67,052
విరాసత్ చేసినవి : 13,358
మ్యుటేషన్ చేసినవి : 12,185
దానపూర్వకంగా విరాసత్ చేసినవి : 18,241
నిర్ధిష్ట భూ విషయాలతో డిజిటల్ సంతకం చేసినవి : 17,056
నిషేధిత జాబితా నుంచి తొలగించినవి : 27,530
కోర్టు తీర్పుతో డిజిటల్ సంతకం చేసినవి : 870
విదేశాల్లోని పట్టాదారులకు డిజిటల్ సంతకం చేసినవి : 38
‘ధరణి’ మంచి ఆలోచన
ధరణి చాలా మంచి ఆలోచన. ప్రభుత్వం ఎంతో ముందుచూపు తో ఈ ఆన్లైన్ విధానా న్ని తీసుకొచ్చింది. గం టలో పని అయిపోతున్నది. ఎనకటికి పట్వా రీ, గిర్దావర్ల ఎంట పడేటోళ్లం. ఇప్పుడు తాసీల్దార్ ఆఫీస్లనే అరగంటల పనైపోతుంది. శానా సంతోషంగా ఉంది.
– ఎల్లయ్య, మంతటి, నాగర్‌కర్నూల్ మండలం
ధరణితో రైతులకు భరోసా
గతంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఎన్నో ఇబ్బందులుండేవి. రెవె న్యూ అధికారులు వేల ల్లో డబ్బులు వసూలు చేసేవారు. ధరణి వచ్చినంక అవినీతికి చోటులేకుండా, రైతుకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అప్పటికప్పుడే రిజిస్ట్రేషన్లు చేస్తున్నరు. ఎవరికీ రూపాయి కూడా చెల్లించకుండా మీసేవలో స్లాట్ బుక్ చేసుకుంటే చాలు. మరుసటి రోజున రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కు పోతే గంటలోపే మాపేర్ల మీద పట్టా అవుతున్నది. వారం రోజుల్లో కొరియర్ల పట్టాబుక్కు ఇంటికొస్తుంది. ధరణి పోర్టల్‌ను అమలు చేసిన కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.
– చంద్రయ్య, చర్ల ఇటిక్యాల, తాడూరు మండలం
అరగంటలోనే రిజిస్ట్రేషన్
ధరణి పోర్టల్ వచ్చాక భూమి కొన్నా, అమ్మినా అరగంటలోనే రిజిస్ట్రేషన్ అవుతున్నది. గతంలో రిజిస్ట్రేషన్ కోసం పట్వారీల చుట్టూ తిరిగేటోళ్లం. వాళ్లేమో ఇప్పుడు.. అప్పుడంటూ దినాల తరబడి సాగదీస్తుండేవారు. ధరణిలో రిజిస్ట్రేషన్ అయ్యాక కొద్ది రోజుల్లోనే పట్టాదారు పాసుపుస్తకం ఇంటికే వస్తోంది. గతంలో రిజిస్ట్రేషన్ తర్వాత పట్టాదారు పాసుపుస్తకాలు వచ్చినా పట్వారీల వద్ద పెట్టుకొని లంచం ఇస్తేనే చేతికి పాసుబుక్కు ఇచ్చేవారు.
– బండారి బీరయ్య, ఎటిధర్పల్లి, తాడూరు