గోపాల్పేట/రేవల్లి/ఖిల్లాఘణపురం, డిసెంబర్ 8 : తెలంగాణ సాధించి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తే.. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రాష్ర్టాన్ని ఆగం పట్టించిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం ఆయన గోపాల్పేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కర్రోళ్ల స్వప్న ప్రచారంలో పాల్గొన్నారు. అలాగే రేవల్లి మండల కేంద్రంతోపాటు కొంకలపల్లి, బండరావిపాకుల, ఖిల్లాఘణపురం మండలం సూరాయపల్లి, ఉప్పరపల్లి, సోలీపూర్, అప్పారెడ్డిపల్లి, సల్కలాపూర్ బీఆర్ఎస్ మద్దతు సర్పంచ్ అభ్యర్థులు కమలమ్మ, బాలరాజు, పద్మశ్రీ, వీరయ్య, గిరమ్మ తరపున మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధికి కళ్లముందే కనిపిస్తుందని తెలిపారు.
కాంగ్రెస్ మాటలకు ప్రజలు మరోమారు మోసపోద్దని, ఆ పార్టీ నాయకులు ఓటు అడిగేందుకు వస్తే ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీయాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటేస్తే కేసీఆర్‌కు ఓటు వేసినట్లు అన్నారు. చెత్త తరలించేందుకు జీపీలకు గత ప్రభుత్వం ట్రాక్టర్ ఇస్తే, నేటి సర్కారుకు ట్రాక్టర్లో డీజిల్పోసే స్థోమత లేదని విమర్శించారు. భగీరథ ద్వారా ఇంటింటికీ సురక్షితమైన నల్లా నీళ్లు సరఫరా చేయించామన్నారు. నేడు రైతన్న ఒక యూరియా బస్తా కోసం పడరాని పాట్లు పడుతున్నారని మండిపడ్డారు. కరెంట్ కోతలతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారని మండిపడ్డారు. రైతుభరోసా ఎగ్గొట్టారని, రుణమాఫీ అసంపూర్తి అయ్యిందని, రైతు బీమా రావడం లేదని, సన్న వడ్ల బోనస్ ఇవ్వడం లేదని.. నిరుద్యోగ యువతకు 2 లక్షల ఉద్యోగాలు లేవని.. ఇవన్ని కాంగ్రెస్ మోసాలన్నారు. అమలుకాని హామీలు ఇచ్చి వాటిని అమలు చేయలేక నానా తంటాలు పడుతున్నదని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ మద్దతుతో బరిలో ఉన్న సర్పంచుల అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
మాట ఇస్తే మడమ తిప్పకుండా చెప్పింది చేసి చూపిస్తానని ఆయనన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల్లా బోగస్ మాటలు ఇచ్చి దాటవేసే మనిషిని తాను కాదన్నారు. సంక్షోభంలో ఉన్న రైతులను రాజును చేసిన ఘనత కేసీఆర్‌దే అని కొనియాడారు. కాంగ్రెస్ వచ్చి రెండేళ్లు పూర్తయినా ఒక్క అభివృద్ధి పని జరగలేదన్నారు. మాయమాటలు చెప్పి ఓట్లు దండుకున్న ఆ పార్టీ నాయకులను నిలదీయాలన్నారు. కార్యక్రమాల్లో వనపర్తి పార్టీ పట్టణ, గోపాల్పేట మండల, గ్రామ అధ్యక్షులు రమేశ్‌గౌడ్, బాల్‌రాజు, రాజేశ్‌గౌడ్, బీఆర్ఎస్ నాయకులు చంద్రశేఖర్, కొత్త రామారావు, పద్మ, శ్రీనివాసులు, మతీన్, మన్యం, నాయక్, గోపాల్, కాశీనాథ్, నాగరాజు, సత్యనారాయణ, రామస్వామి, మహేశ్, రేవల్లి నాయకులు భీమయ్య, శ్రీశైలం, మధుసూదన్‌రెడ్డి, శివరాంరెడ్డి, శ్రీరాములు, నాగరాజు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.