Deer | బిజినపల్లి, ఏప్రిల్ 2 : దారి తప్పిన ఓ జింక పశువుల మందలో ప్రత్యక్షమైంది. ఈ సంఘటన బిజినేపల్లి మండలం వట్టెం గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అటవీ ప్రాంతం నుంచి వట్టెం గ్రామంలోకి ప్రవేశించిన జింక.. స్థానికంగా ఉన్న పశువుల మందలో ప్రత్యక్షమైంది. అక్కడ్నుంచి గ్రామంలోని బస్టాండ్ వరకు జింక పరుగెత్తుకుంటూ వచ్చింది. గమనించిన స్థానికులు జింకను పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు.
వట్టెం గ్రామానికి చేరుకున్న పోలీసులు.. జింకను స్వాధీనం చేసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఆ జింకను ఫారెస్టు అధికారులకు అప్పగించారు. ఫారెస్ట్ హోంగార్డు నవీన్, వాచర్ బాలరాజులు పోలీస్ స్టేషన్‌కు చేరుకొని జింకను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గంగారం రిజర్వ్ ఫారెస్ట్‌లో జింకను వదిలినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు.