వెల్దండ, అక్టోబర్ 10 : పండుగ పూట పస్తులుండాల్సిందేనా..? అంటూ నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామ పాడి రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని విజయ డెయిరీ పాలశీతలీకరణ కేంద్రం (బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్) వద్ద నిరసన తెలియజేశారు. నాలుగు నెలలుగా పా ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, రాత్రనకా.. పగలనకా.. కష్టపడి పని చేసి పాలు పోస్తే బిల్లులు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆవులకు, గేదెలకు పశుగ్రాసం కొనలేక అప్పులపాలవుతున్నామని వాపోయారు. దసరా పండుగ పూట కొత్త బట్టలు కొనలేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. కనీసం పాల డెయిరీ కేంద్రంలో నిల్వ ఉన్న రూ.2 లక్షలను ఇప్పించాలని బీఎంసీయూ అధికారి కృష్ణయ్యను కోరారు. స్పందించిన ఆయన ఉన్నతాధికారులతో మాట్లాడుతానని చెప్పడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో రైతులు రాఘవరెడ్డి, వెంకట్రెడ్డి, జంగయ్య, పర్వతాలు, అయ్యన్న, యాదగిరి, రాంరెడ్డి, రంగయ్య పాల్గొన్నారు.