ఆరుగాలం కష్టించి పండించిన పంట కండ్లముందే ఎండిపోతుండగా రైతులు కన్నీరు పెడుతున్నారు. చేసిన కష్టం కండ్ల ముందే మట్టిపాలు కావడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. వానకాలం పంటలు చేతికిరాకపోవడంతో కనీసం యాసంగిలో తిండిగింజలైనా పండించుకుందామంటే మొదటికే మోసమొచ్చింది. కాల్వల్లో, బోరుబావుల్లో పుష్కలంగా నీళ్లు ఉన్నాయనే భరోసాతో సంబురంగా సాగు చేయగా, చేతికొచ్చే సమయంలో చి‘వరి’కి పంటలన్నీ ఎండిపోయాయి.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో వరి, మొక్కజొన్న పంటలు సాగునీరు లేకపోవడం, బోరుబావులు ఎండిపోవడంతో దిక్కుతోచని స్థితిలో రైతులు పడిపోయారు. కొందరు రైతులు ఎలాగైనా పంటలను కాపాడుకోవాలని బోర్లు వేయించినా ఫలితం లేకపోయింది. చివరికి అప్పులే మిగిలాయి. ఇక చేసేది లేక చాలా మంది రైతులు పంటలను పశువులకు మేతగా వదిలేశారు. ఇంత జరుగుతున్నా సర్కారు, అధికారులు పంటలను పరిశీలించకపోవడం, కనీసం భరోసా కల్పించకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
– నమస్తే నెట్వర్క్, మార్చి 30
ఇంత గోస పడ్తమనుకోలే..
నవాబ్‌పేట, మార్చి 30 : వరి పంట పండించేందుకు ఇంత గోస పడ్తమని కలలో కూడా అనుకోలే.. ఏమి కరువొచ్చెనేమో.. తలుసుకుంటేనే భయమేస్తోంది. నాటిన మూడెకరాల్లో సగం ఎండి పోయింది.. మిగతా సగం పంటనైనా కాపాడుకుందామని వాటర్ ట్యాంకర్‌తో నీరు పెడుతున్నానంటూ.. నవాబ్‌పేట మండలం కాకర్జాలతండాకు చెందిన గిరిజన రైతు ముడావత్ శంకర్‌నాయక్ తన మనసులోని బాధను వెళ్లగక్కాడు.
ఇందుకు సంబంధించిన వివరాలోకి వెళ్తే.. కాకర్జాల తం డాకు చెందిన శంకర్‌నాయక్ తనకున్న ఎకరాల పొ లంతోపాటు తన పక్క పొలం రైతుతో మాట్లాడుకొని మరో.. రెండు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని వరి నాటు వేశాడు. అతడి సొంత పొలంలో ఉన్న బోరులో పుష్కలంగా నీరు ఉండడంతో మూడెకరాలు సాగు చేశాడు. తీరా చూస్తే తీవ్ర ఎండలకు భూగర్భ జలాలు అడుగంటి అతడి బోరులో నుంచి నీరు రావడం నిలిచిపోయింది. గత 20 రోజుల నుంచి అతడి బోరులో చుక్క నీరు కూడా రావడం లేదు. ఈ క్రమంలోనే ఎకరన్నరలో పంట పూర్తిగా ఎండి పోయింది.
ప్రస్తుతం ఉన్న సగం పంటనైనా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ట్యాంకర్‌ను కిరాయికి తీసుకొన్చి వేరే రైతులతో నీరు అడుక్కొని తన పొలానికి తీసుకెళ్లి నీరు పెడుతున్నాడు. నీరు లేక పోవడం, కరెంట్ లోఓల్టేజీ సమస్యతో ఉన్న సగం కూడా పండుతుందో.. లేక ఎండుతుందో తెలియని పరిస్థితి నెలకొన్నది. ఈ విషయమై రైతు శంకర్‌నాయక్‌ను ‘నమస్తే తెలంగాణ’ పలకరించగా.. తన మనసులోని బాధను వెళ్లగక్కాడు. గత పదేండ్లు పష్కలంగా పంటలు పండించుకున్నాం. అదే ధ్యాసలో మళ్లీ నాటు వేశా, కానీ ఇంత ఘోరమైన పరిస్థితి వస్తదనుకోలే. పంట సాగుకు సుమారుగా రూ.90 వేలు పెట్టుబడి పెట్టా. భూమి యజమానికి కౌలు ఎలా కట్టాలో తెలుస్తలేదు…అంటూ ఎండిపోయిన పంటను, నీరు పడుతున్న ట్యాంకర్‌ను, వట్టి పోయిన తన బోరును చూయిస్తూ కంటతడి పెట్టాడు.
అడుగంటిన భూగర్భ జలాలు
ధన్వాడ, మార్చి 30 : భూగర్భ జాలాలు అడుగంటుతుండడంతో మండలంలోని అనేక గ్రామాల్లో చేతికొచ్చిన వరి పంటలు ఎండుతున్నాయి. దీంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని మంత్రోనిపల్లి గ్రామానికి చెందిన రైతు రాంచంద్రయ్య, చిన్న నర్సిములు తమకున్న మూడు ఎకరాల్లో వరి పంట సాగు చేసుకున్నారు. మరో 15 రోజుల్లో పంట చేతికొస్తుందని సంబురపడిన రైతుల గుండెపై నీళ్లు చల్లినట్లు బోర్లలో నీరు ఇంకిపోవడంతో సదరు రైతులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. పంటకు పెట్టుబడిగా ఎకరాకు రూ.30 వేలు పెట్టడంతోపాటు బోర్లు వేయానికి సుమారు రూ.2లక్షలు ఖర్చు చేసినా చుక్క నీరు పడలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చివరికి కన్నీళ్లే మిగిలాయి..
వడ్డేపల్లి, మార్చి 30 : ఆర్డీఎస్, నెట్టంపాడు కాల్వల పరిధిలో సాగు చేసిన పంటలకు సాగునీరు అందక పంటలు ఎండిపోవడంతో రైతులు కన్నీరు పెడుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో తుమ్మిళ్ల లిఫ్ట్ ఏర్పాటు చేసినప్పటికీ తుంగభ్ర నదిలో నీటి ప్రవాహం ఉన్నంత వరకు నీళ్లు వస్తాయి. రిజర్వాయర్లు నిర్మించి నీటిని అందిస్తామన్నా కాంగ్రెస్ ప్రభుత్వ వాగ్దానం నీటి మూటగానే మారడంతో ఆయా ఆయకట్టు పరిధిలో సాగు నీరందక రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. మండలంలోని రామాపురానికి చెందిన మద్దిలేటి అనే రైతు తన బోరులో నీళ్లు సరిపోతాయని పంట వేసుకున్నాడు. ఆర్డీస్ కాల్వల్లో నీళ్లు లేనందునా భూగర్భ జలాలు తగ్గినందున తన బోరులో నీళ్లు రాలేదు. పంట ఎండ కూడదని మూడు బోర్లు వేసినప్పటికీ చుక్కనీరు రాలేదు. పంటకు పెట్టిన పెట్టుబడి బోర్లు వేసేందుకు చేసిన రూ.లక్ష అప్పు ఎలా తీర్చాలని ఆవేదన చెందుతున్నాడు.
పొలానికి పోవాలన్పిస్తలేదు..
భూత్పూర్, మార్చి 30 : మండలంలోని మద్దిగట్ల గ్రామంలో ఇటీవల వడగండ్ల వానకు వరిపంట పూర్తిగా నష్టపోయింది. గ్రామానికి చెందిన నర్సింహారెడ్డి 13 ఎకరాలు వరి పంట సాగు చేశాడు. వడగండ్ల వానకు గింజలు మొత్తం రాలిపోయి పంట పూర్తిగా దెబ్బతిన్నది. దాదాపు రూ.4లక్షల పెట్టుబడి పెట్టగా చేతికొచ్చిన పంట ఒక్క వానకు పూర్తిగా నష్టపోయినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పంట నష్టపోవడంతో ఆయన పొలం వైపు వెళదామంటే కూడా మనసొప్పడం లేదని అంటున్నాడు.