వంగూరు, ఏప్రిల్ 8 : కృష్ణమ్మను నమ్ముకొని పంటలను సాగు చేసిన రైతులకు చుక్కెదురైంది. ఎంజీఎల్ఐ ద్వారా వచ్చే నీటితో డిండి ప్రాజెక్టు నీటితో కళకళలాడేది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం యాసంగిలో డిండిలో నీటిని నిల్వ చేయడంతో డిండి వెనుక భాగం వంగూరు మండలంలోని పలు గ్రామాల రైతులు వరిని సాగు చేసేవారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రుల కారణంగా యాసంగిలో సైతం డిండి నుంచి సాగునీటిని విడుదల చేస్తుండడంతో మండలంలోని పలు గ్రామాల్లో వరి సాగు చేసిన రైతుల పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది.
డిండి ప్రాజెక్టు బ్యాక్ వాటర్..
మండలంలోని గాజర గ్రామ రైతులు డిండి ప్రాజెక్టు వెనుక భాగంలో ఆ నీటిని నమ్ముకుని వరిని సాగు చేశారు. ఇంకా 15 నుంచి 20 రోజులు నీరు అందితే పంట చేతికొచ్చేది. పంట చూస్తే పచ్చగా కనిస్తున్నప్పటికీ లోపల మొత్తం ఎండిపోయి నెర్రెలు బారుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాజర గ్రామానికి చెందిన కొమ్ము వెంకటేశ్ తనకున్న 6 ఎకరాలతోపాటు మరో 6 ఎకరాలను కౌలుకు తీసుకొని 12 ఎకరాల్లో వరిని సాగు చేశాడు.
పంట చేతికొచ్చే సమయంలో ప్రాజెక్టులో నీరు దిగువకు పోతుండడంతో పంటకు నీరందని పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా చింతకుంట హుస్సేన్ అనే రైతు తన సోదరులు కలిసి మరో 5 ఎకరాల్లో పంటను సాగు చేశారు. పంట పొట్ట దశలో ఉండగా తీవ్రమైన నీటి ఎద్దడి ఏర్పడింది. దీంతో పొలం కింది భాగంలో నీరు నిల్వ ఉండే ప్రాంతంలో జేసీబీ సహాయంతో బావి రూపంలో తవ్వి ఊరే నీటితో పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. చాలా మంది రైతులు ఇదే పద్ధతిని అవలంబిస్తున్నప్పటికీ రోజుకు రెండు, మూడు మడులు మాత్రమే పారుతుండడంతో మిగతా మడులకు నీరు అందకపోవడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది.
బతుకులు ఆగం
మూసాపేట, ఏప్రిల్ 8 : రైతులు సాగు కష్టాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. పంటలు చేతికందే దశలో సాగునీరు అందరక పంటలు ఎండిపోతున్నాయి. పచ్చని పంటలతో కళకళలాడే పల్లెలు నేడు ఎండుతున్న పంటలతో రైతుల కన్నీటితో తడుస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ యేడు భూగర్భ జలాలు ఒక్క సారిగా అడుగంటి పోవడంతో బోరుబావులన్నీ ఒట్టిపోయాయి. దీంతో పంటలకు సాగునీరు అందక ఎండుతున్నాయి. లక్షలకు లక్షలు పెట్టుబడి పెట్టిన రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయి.
మూసాపేట మండలంలోని దాసరిపల్లి అనుబంధ గ్రామం అయిన చెన్నంపల్లి గ్రామానికి చెందిన రైతు సంజీవరెడ్డికి నాలుగు బోర్లు ఉన్నాయి. రెండు బోర్ల కింద నాగున్నర ఎకరాలు వరి పంటసాగు చేశాడు. ఆ పంట కోత దశలో ఉన్నప్పుడు గతంలో వడగండ్ల వానతో వడ్లు మొత్తం మడిలోనే రాలిపోయాయి. అదేరైతు మరో రెండు బోరుబావులపై ఆధారపడి మరోచోట అతనికి చెందిన ఎకరంతోపాటు మరో ఎకరం భూమి కౌలుకు తీసుకొని మొత్తం రెండెకరాలు వరి పంటసాగు చేసినట్లు తెలిపాడు.
కానీ ఆ రెండు బోరుబావులు ఒక్కసారిగా భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో సాగునీరు అందక వరి చేను మొత్తం ఎండుమొఖం పట్టింది. దీంతో చేసేదేమి లేక రైతు ఆ పంటను గొర్రెల మేతకు వదిలేశాడు. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడు కూడా ఊహించలేదని, ప్రభుత్వం వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలతో పాటు ఎండిన పంటలకు సైతం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతు సంజీవరెడ్డి ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
డిండిని నమ్ముకొని పంటను సాగు చేశా..
కృష్ణమ్మతో నిండుగా ఉండే డిండి ప్రాజెక్టును నమ్ముకొని రూ.3 లక్షల పెట్టుబడితో 12 ఎకరాల్లో వరి పంటను సాగు చేశాను. పంట ఈని గింజలు గట్టిపడే సమయంలో తీవ్రమైన నీటి కొరత ఏర్పడింది. ప్రాజెక్టులో నీరు కిందికి పోతున్నాయి. నీరు అందక చేతికి వచ్చిన పంట ఎండిపోతుంటే చూసి తట్టుకోలేకపోతున్నాం. మరో 20 రోజులు నీరు పారితే పంట చేతికొచ్చేది. బీఆర్ఎస్ పాలనలో పంటలు సమృద్ధిగా పండేవి. కాంగ్రెస్ పాలన రైతులకు శాపంగా మారింది.
– కొమ్ము వెంకటేశ్, రైతు, గాజర, వంగూరు మండలం
పంటచేతికొస్తుందన్న నమ్మకం లేదు..
కేసీఆర్ ఉన్నప్పుడు పంటలు మంచిగా పండేవి. నీళ్ల సమస్య వచ్చేది కాదు. అప్పటిలాగే ఉంటుందనకొని మేము వరిని సాగు చేశాం. కాంగ్రెస్ పాలన వచ్చినంక ఏమైందో ఏమో.. కానీ ఏదీ సక్కగ లేదు. నీళ్లు నల్లగొండ వాళ్లు తీసుకుపోతుండ్రు. దీంతో ప్రాజెక్టు ఎగువ నీటిని నమ్ముకొని వేసిన మా పంటలు ఎండిపోతున్నాయి. ఏం చేయాలో తోచక గుంతలు తీసి ఆ ఊరే నీటితో మడులను తడుపుకుంటు న్నాం అన్ని మడులకు నీరు అందడం లేదు. పంట చేతికొస్తుందన్న నమ్మకం కూడా లేదు.
– హుస్సేన్, రైతు, గాజర, వంగూరు మండలం
నాడు కళ నేడు వ్యథ
పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా.. పలురకాల పూల సోయగాలతో కేసీఆర్ ప్రభుత్వంలో కళకళలాడిన పల్లెప్రకృతి వనాలు.. నేడు ఆలనా.. పాలన కరువై కళావిహీనంగా దర్శనమిస్తున్నాయి. మొక్కలు ఎండిపోయినా.. పలు చోట్ల ధ్వంసమైనా.. వనాల రక్షణకు ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ తొలగిపోయినా.. అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాగర్కర్నూల్ జిల్లా నందివడ్డెమాన్, మహబూబ్నగర్ జిల్లా వాడ్యాలలో ప్రకృతి వనాల్లో చెట్లు ఎండిపోయాయి. మొక్కలు ప్రాణాలు కోల్పోతున్నా.. కంచెలు కూలిపోతున్నా పంచాయతీ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటం బృహత్ వనాల దుస్థితికి అద్దం పడుతున్నది. మొక్కలు రీప్లేస్మెంట్ చేయకపోవడంతో వనంలో ఎటు చూసినా ఎండిన మొక్కలే దర్శనమిస్తున్నాయి. దీంతో వనాలన్నీ ఇంత గడ్డు
పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.
– మహబూబ్నగర్/నాగర్కర్నూల్ ఫొటోగ్రాఫర్లు