మహబూబ్‌నగర్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మొంథా ఉమ్మడి జిల్లాను వణికించింది.. తుఫాను దాటికి దాదాపు 30 మండలాల్లో పంట నష్టం సంభవించింది. అత్యధికంగా నాగర్‌కర్నూల్ జిల్లాలోని 20 మండలాల్లో దాదాపు 33 వేలకుపైగా ఎకరాల్లో వివిధ రకాల పంటలు దెబ్బతిన్న ట్లు అధికారిక నివేదికలు చెబుతున్నాయి. అలాగే మహబూబ్‌నగర్ జిల్లాలోనూ పది మండలాల్లో సుమారు వెయ్యి ఎకరాల వరకు నష్టం వాటిల్లినట్లు లెక్కలు తేల్చారు. చేతికొచ్చిన వరి పంట భారీ వర్షాల ధాటికి నేలకొరిగింది. ఈసారి వర్షాలు సమృద్ధిగా కు రిసి పంటలు బాగా పండాయని అన్నదాతలు మురిసిపోతున్న తరుణంలో మొంథా రూపంలో వచ్చిన తుఫాన్ మొత్తం ఊడ్చేసిందని లబోదిబో మంటున్నారు. సైక్లోన్ శాంతించి రెండ్రోజుల అయ్యాక పంట పొలాలను పరిశీలించిన రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు పంట బీమా చెల్లించి ఆదుకోవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో ఇటీవల మొంథా తుఫాన్‌తో భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం ముందస్తుగానే ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా నాగర్‌కర్నూల్ జిల్లాలో తుఫాన్ బీభత్సం అత్యధికంగా కనిపించింది. 33,559 ఎకరాల్లో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయ శాఖ తేల్చింది. అయితే అనధికారిక లెక్కల ప్రకారం ఈ నష్టం మరింతగా ఉందని అంటున్నారు.
తుఫాన్ ప్రభావంతో ఈ జిల్లాలో సుమారు 19 వేల ఎకరాల్లో పత్తికి తీవ్ర నష్టం వాటిల్లింది. వారం, పది రోజుల్లో పంట చేతికి వస్తుందని ఆశించిన దశలో వర్ష బీభత్సం సృష్టించి మొత్తం నాశనం చేసిందని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. మరో 10 వేల ఎకరాలకుపైగా వరి దెబ్బతిన్నట్లు అధికారుల అంచనా.. అలాగే వేరుశనగ, మిగతా పంటలు కూడా అక్కడక్కడా నష్టపోయినట్లు నాగర్‌కర్నూల్ జిల్లా వ్యవసాయ శాఖాధికారులు ఉన్నతాధికారులకు నివేదించారు. సుమారు 14 వేల మంది రైతులు నష్టపోయారని అంచనా..
పాలమూరు జిల్లాలోనూ తుఫాన్ రైతులను కుదేలు చేసింది. రెండ్రోజులపాటు తుఫాను ప్రభావంతో సుమారు పది మండలాల్లో భారీగా పంట నష్టం సంభవించింది. వెయ్యి ఎకరాల్లో పంట నష్టపోయినట్లు అధికారులు తేల్చారు. సుమారు 800 మంది రైతులకు సంబంధించి వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయని నివేదికలు చెబుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలో దెబ్బతిన్న పంటల వివరాలను వ్యవసాయ శాఖ నివేదించింది. అయితే అధికారులు నివేదించిన దానికంటే అధికంగా నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. మరోవైపు వర్షాల ధాటికి అనేక చోట్ల వాగులు, వంకలు పొంగడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రహదారులు తీవ్రస్థాయిలో దెబ్బతిన్నాయి. ఈ అంచనాలను కూడా చేసే పనిలో ఉన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం తుఫాన్ బాధిత ప్రాంతాల్లో నష్టపరిహారం ఇచ్చే అవకాశం ఉండడంతో ప్రభుత్వం నివేదికలు తెప్పించుకొని కేంద్రానికి పంపిస్తుందని అధికారులు వెల్లడించారు.