Trump Tariffs | ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు విధించిన టారిఫ్‌లు చెల్లవని ఆ దేశ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చినప్పటికీ డొనాల్డ్ ట్రంప్ ఏ మాత్రం తగ్గలేదు. ప్రపంచ దేశాలపై మళ్లీ 10 శాతం సుంకాలను విధించారు. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపారు. ఈ మేరకు సంబంధిత ఉత్తర్వులపై ట్రంప్ సంతకాలు చేశారు. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా తన ట్రూత్ ఖాతా ద్వారా వెల్లడించారు.
ప్రపంచ దేశాలపై సుంకాలకు సంబంధించి అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సైతం ట్రంప్ తప్పుబట్టారు. అత్యంత ఆమోదయోగ్యమైన పద్ధతిలో మేం విధించిన టారిఫ్‌లను సుప్రీంకోర్టులో కొందరు వ్యతిరేకించారని.. న్యాయమూర్తులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇందుకు వారు సిగ్గుపడాలి అంటూ విరుచుకుపడ్డారు. ఇది చాలా హాస్యా్స్పదకరమైన తీర్పు అని అన్నారు. ఇక టారిఫ్‌లకు సంబంధించిన సర్దుబాటు ప్రక్రియ మొదలైందని వెల్లడించారు. గతంలో తీసుకున్న దానికంటే ఎక్కువ వసూలు చేసేందుకు సాధ్యమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దేశ ఆదాయాన్ని పెంచేందుకు మరింత శక్తివంతమైన మార్గలెన్నో తమకు అందుబాటులో ఉన్నాయని.. ఇకపై మరిన్ని టారిఫ్‌లను విధించగలనని చెప్పారు. ఈ క్రమంలోనే 10 శాతం టారిఫ్‌లు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.

Trump Truth Tariffs
భారత్ – అమెరికా వాణిజ్య ఒప్పందం (India US Trade Deal )పైనా ట్రంప్ స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రభావం ఈ ట్రేడ్ డీల్‌పై ఉండదని .. ఒప్పందంలో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. భారత్ సుంకాలు చెల్లిస్తుందని తెలిపారు. మోదీ గొప్ప జెంటిల్‌మ్యాన్.. తన వ్యతిరేకుల కంటే కూడా చాలా తెలివైన వ్యక్తి. కానీ మనల్ని ఆయన మోసం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అందుకే ఈ వాణిజ్య ఒప్పందం చేసుకున్నామని పేర్కొన్నారు. దీని ప్రకారం అమెరికాకు భారత్ టారిఫ్‌లు చెల్లిస్తుందని… కానీ ఇండియాకు అమెరికా చెల్లించదని తేల్చిచెప్పారు.
కాగా, ఈ 10 శాతం టారిఫ్‌లను ఇండియా కూడా చెల్లించాల్సిందేనని వైట్ హౌస్ అధికారులు స్పష్టం చేశారు. 1977 నాటి IEEPA చట్టం ప్రకారం ట్రంప్ ఇప్పటిదాకా పలు దేశాలపై విధించిన టారిఫ్‌లు సుప్రీంకోర్టు తీర్పుతో రద్దయ్యాయని.. వాటి స్థానంలో ట్రంప్ తాజాగా విధించిన టారిఫ్‌లు అమలులోకి రానున్నాయి. 1974 నాటి వర్తక చట్టంలోని 122 సెక్షన్ ప్రకారం ట్రంప్ ఈ టారిఫ్‌లు విధించారు. ఈ నిర్ణయానికి 150 రోజుల్లోపు కాంగ్రెస్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. లేదంటే ఈ టారిఫ్‌లు కూడా 150 రోజుల తర్వాత రద్దవుతాయి.