వాషింగ్టన్: ప్రపంచదేశాలపై పది శాతం దిగుమతి సుంకాన్ని విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Donald Trump) వెల్లడించారు. 10 శాతం గ్లోబల్ టారిఫ్ జీవోపై సంతకం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ట్రుత్ సోషల్ వేదికగా ఆయన ఈ ప్రకటన చేశారు. ఓవల్ ఆఫీసు నుంచి గ్లోబల్ టారిఫ్‌పై సంతకం చేయడం గర్వంగా ఉందని, అన్ని దేశాలపై పది శాతం సుంకం విధించనున్నామని, తక్షణమే ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని ట్రంప్ అన్నారు. సెక్షన్ 122 కింద గ్లోబల్ టారిఫ్ చట్టాన్ని రూపొందించనున్నట్లు ఇటీవల ట్రంప్ పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటి పన్ను విధానాలన్నీ కేవలం 150 రోజులు మాత్రమే అమలులో ఉండనున్నాయి.
ఫిబ్రవరి 24వ తేదీ నుంచి కొత్త పన్ను విధానం అమలులోకి వస్తుందని శ్వేతసౌధం తన ప్రకటనలో పేర్కొన్నది. వివిధ ప్రపంచదేశాలపై ట్రంప్ సర్కారు భారీగా పన్నులు వసూల్ చేస్తున్న విషయం తెలిసిందే. 1977 ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ ప్రకారం ట్రంప్ సర్కారు ఆ టారిఫ్‌లను వసూల్ చేసింది. ఈ చట్టాన్ని కొట్టివేస్తూ గురువారం అమెరికా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 6-3 తేడాతో న్యాయస్థానం ట్రంప్ సర్కారుకు వ్యతిరేకంగా తీర్పు వెల్లడించింది. ఈ నేపథ్యంలో 10 శాతం గ్లోబల్ టారిఫ్‌లు విధిస్తూ ట్రంప్ ప్రకటన చేశారు.