మహమ్మాదాబాద్, మార్చి 27: బోరు బావుల్లో నీరు పాతాళానికి వెళ్లడంతో వరి పంటలకు శాపంగా మారింది. ఎన్నడు లేనంత విధంగా వరి పంటలు ఎండు ముఖం పడుతున్నాయి. మండలంలో రైతులు ఎన్నో ఆశలు పెట్టుకొని వరి సాగు చేస్తే భూగర్భ జలాల్లో నీటిమట్టం తగ్గడంతో పంటలు ఎండి రైతులకు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. లక్షల్లో పెట్టుబడి పెట్టి చేతికి వచ్చే దశలో పంట ఎండిపోవడంతో రైతులు పంటలను కాపాడుకోవడానికి భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. రైతులు ధైర్యం చేసి బోర్లు వేస్తున్న కూడా వాటిలో కూడా నీరు అంతంత మాత్రమే వస్తుంది.
కొన్ని బోర్లు పూర్తిగా రాకపోవడంతో రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. మహమ్మాదాబాద్ మండలంలో 5,500 ఎకరాలు వరి పంట సాగు చేయగా దాదాపు 140 ఎకరాలు బోర్లలో నీళ్లు తాగి వరి పంటలు ఎండి పోయాయి. కంచనపల్లి గ్రామానికి చెందిన పోతుల శ్రీనివాసు నాలుగు ఎకరాలు వరి పంట వేయడంతో బోర్ లో నీటి మట్టం తగ్గిపోవడంతో రెండు లక్షలు పెట్టి మరో మూడు బోర్లు వేశాడు. వాటిలో కూడా నీరు అంతంత మాత్రమే రావడంతో సగం పంట ఎండిపోయింది. అదే గ్రామానికి చెందిన రాంపురం శ్రీనివాస్ రెండు ఎకరాల వరి పంట చేతికొచ్చే దశలో ఎండిపోయింది. ప్రభుత్వం ఆదుకొని రైతులకు నష్టపరిహారం అందించాలని కోరుతున్నారు.