She Team | మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, సెప్టెంబర్ 19 : విద్యార్థినులు, మహిళల వెంట పడుతున్న ఆకతాయిల్లో మైనర్లు, యువకులే అధికంగా ఉంటున్నారు. ఇటీవల షీ టీంలు నమోదు చేసిన కేసులకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే ఈ విషయాలు తేటతెల్లమయ్యాయి. కుటుంబపెద్దలు పిల్లలను పట్టించుకోకపోవడం, సినిమాలు, సామాజిక మాధ్యమాలు మైనర్లు, యువతపై స్పష్టమైన ప్రభావం చూపిస్తున్నట్లు అధికారుల గణాంకాల్లో తేలింది. అయితే బాధితుల్లో చాలామంది ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాకపోవడంతో కౌన్సెలింగ్‌తో సరిపెడుతున్నారు. జిల్లాలో షీ టీంల పనితీరు పెరిగింది. తనిఖీలు విస్తృతంగా పెరిగాయి. ప్రజల్లో అవగాహన పెరగడంతో షీటీంలను సంప్రదిస్తున్నారు. అయితే పట్టుబడుతున్న వారిలో యుక్త వయస్సు వారే ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తున్న విషయం.
మైనర్లు వారికంటే ఎక్కువ వయస్సు ఉన్న యువతులు, మహిళల వెంట పడటం, అసభ్య పదజాలంతో ధూషించడం, అసభ్యకరంగా ప్రవర్తించడం వంటి విషయాలు షీ టీంలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కళాశాలలు, పాఠశాలలకు వెళ్లే సమయంలో పోకిరీలు విద్యార్థినుల వెంటపడి చేతులు పట్టుకోవడం, ఫోన్ నెంబర్లు ఇచ్చేందుకు ప్రయత్నించడం, వెనుకాలే వెళ్తూ సూటిపోటి మాటలు మాట్లాడడం చేస్తున్నారు. వీరి వేధింపుల బారిన పడుతున్న వారిలో విద్యార్థినులతోపాటు ఎక్కువ వయస్సు ఉన్న మహిళలు కూడా ఉంటున్నారు. ఎవరైనా వేధించినా, రోడ్డుపై వెళ్లేటప్పుడు అవహేలనగా మాట్లాడినా, ఉద్దేశపూర్వకంగా వెంబడించినా వెంటనే 100, జిల్లా షీ టీం నెంబర్ 8712659365 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ఎస్పీ తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.
షీ టీంలు ఆకతాయిల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాయి. మహబూబ్‌నగర్, జడ్చర్ల ప్రాంతాల్లో ఈ బృందాలు విస్తృతంగా పనిచేస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలల వద్ద గతంలో ఆకతాయిల కారణంగా విద్యార్థినులు ఇబ్బంది పడేవారు. కానీ షీ టీం సభ్యులు నిత్యం ఆ ప్రాంతంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించడంతో వారి బెడద తప్పింది. ఈక్రమంలో ముందుగా షీ టీం సభ్యులు ఆకతాయిల చేష్టలను వీడియో రూపంలో బంధిస్తున్నారు. అనంతరం వారిని ఆదుపులోకి తీసుకుంటున్నారు. ఫలితంగా పోలీసులు పట్టుకున్న తర్వాత తాము అలాంటి పనులు చేయలేదని చెప్పి తప్పించుకోవడానికి వీలు లేకుండా చేస్తున్నారు.
షీ టీంలు పట్టుకున్న ఆకతాయిల్లో చాలామంది మళ్లీ అలాంటి పనులు చేయడం లేదని అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు పట్టుబడిన వారిలో 16-26 ఏండ్లలోపు వయస్సు వారే ఎక్కువగా ఉండటం గమనార్హం. షీ టీం సభ్యులు ఆకతాయిలను పట్టుకున్న వెంటనే వారి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులను పోలీస్ స్టేషన్‌కు పిలిపిస్తున్నారు. మహిళా పీఎస్‌లో కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. బాధితులు ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తే సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేస్తున్నారు. అయితే చాలామంది ఫిర్యాదు చేయడానికి ముందుకు రాకపోవడంతో కౌన్సెలింగ్ ఇచ్చి పంపిస్తున్నారు. కుటుంబసభ్యులకు చట్టాలతోపాటు జైలుకు వెళ్తే కలిగే నష్టాలను అధికారులు వివరిస్తున్నారు. నాలుగున్నరేండ్లలో 30 కేసులు మాత్రమే నమోదు కాగా 166 మందికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.
తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు తమ పిల్లల నడవడికపై దృష్టి సారించాలి. ఇప్పటికే కళాశాలలు, పాఠశాలలు, జనసంచార ప్రాంతాల్లో నిత్యం నిఘా ఉంచాం. జిల్లాలో షీ టీంల పనితీరు మెరుగు పర్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. విద్యార్థినులు, మహిళలను వేధింపులకు గురిచేసే ఆకతాయిలపై కఠిన చర్యలను తీసుకుంటున్నాం. బాధితులు ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తే కేసులు కూడా నమోదు చేస్తున్నాం. లేదంటే వారికి కౌన్సెలింగ్ చేసి పంపిస్తున్నాం. యువత సినిమాలు, సామాజిక మాధ్యమాల ద్వారా మంచి విషయాలు నేర్చుకోవాలే తప్పా ఇలా ఇబ్బందికర విషయాలు నేర్చుకోవడం కారణంగా వారి విలువైన జీవితాలను నష్టపోతారు.
– నరసింహ, ఎస్పీ, మహబూబ్‌నగర్