మహబూబ్నగర్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) నిబంధనలను వ్యతిరేకిస్తూ జిన్నింగ్ మిల్లుల యాజమాన్యం సమ్మె బాట పట్టాయి. ఐదు జిల్లాల్లో కొనుగోళ్లు నిలిపివేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కిసాన్ కపాస్ యాప్లో స్లాట్ బుక్ చేసుకున్న కర్షకులు పెద్ద ఎత్తున జిన్నింగ్ మిల్లులకు పత్తితో తరలి రావడంతో కొనే వారు లేక ఇబ్బందులు పడ్డారు. తెల్లబంగారానికి సరైన ధర రాకపోవడంతో దిగాలు చెదుతున్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనీ సీసీఐ రోజుకో నిబంధన పెడుతుండడంతో రైతులకు కష్టాలు తప్పడం లేదు. తేమశాతం మించితే ఏకంగా క్వింటాకు రూ.వెయ్యి తగ్గిస్తుండడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. అయినా అమ్ముదామని వచ్చినా.. ఎకరాకు ఏడు క్వింటాళ్లు మాత్రమే కొంటామని నిబంధన విధించడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
అన్ని నిబంధనలను ఒప్పుకొని స్లాట్ బుక్ చేసుకొని వచ్చిన రైతులకు ఇప్పుడు మిల్లుల సమ్మె కంటి మీద కునుకులేకుండా చేస్తున్నది. ఫలితంగా పొలాల నుంచి పత్తిని తెచ్చిన వాహనాలు బారులు తీరాయి. దీంతో సహనం నశించిన రైతులు సోమవారం రాస్తారోకోకు దిగారు. మాగనూరు వద్ద రాయిచూర్ హైవేపై అన్నదాతలు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. వీరికి మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి మద్దతు తెలిపి రైతులతో కలిసి రోడ్డుపై నాలుగున్నర గంటలు బైఠాయించారు. మిల్లర్లు సమ్మె చేస్తుండడంతో పత్తిని కొనుగోలు చేయకపోవడంతో ఏమి చేయాలో తోచక జోగుళాంబ గద్వాల కలెక్టరేట్ వద్దకు పత్తితో రైతులు తరలివచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులకు తిప్పలు తప్పడం లేదని వాపోయారు. అయిజ-గద్వాల రోడ్డుపై ధర్నాకు దిగారు.
బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కుర్వ పల్లయ్య వీరికి మద్దతు తెలిపారు. ఉండవల్లి మండలంలోని శ్రీ వరసిద్ధి వినాయక కాటన్ మిల్లు ఎదుట రైతు సంఘం గద్వాల జిల్లా అధ్యక్షుడు ఈదన్న అధ్వర్యంలో రై తులు బైఠాయించారు. మహబూబ్నగర్ రూరల్ మం డలం ఒబ్లాయిపల్లి శివారులో మిల్లు వద్ద పత్తిలోడ్తో వచ్చిన వాహనాలు క్యూ కట్టాయి. మిగితా జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. ఎక్కడికక్కడ కొనుగోలు నిలిచిపోవడంతో రైతుల వేదన వర్ణణాతీతం. అయినా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని కన్నెర్ర చేస్తున్నారు. మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ కేంద్రంతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తారని అనుకుంటే పత్తా లేకుండా పోయారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సీఎం సొంత జిల్లాలోనే రైతులను పట్టించుకునే పరిస్థితి లేదని వాపోయారు.
ఐదు జిల్లాల్లో ఈ ఏడాది రైతులు గణనీయంగా పత్తిని పండించారు. అయితే వర్ష ప్రభావంతో పంట దెబ్బతిని చాలాచోట్ల అనుకున్న స్థాయిలో దిగుబడి రాలేదు. వచ్చిన దిగుబడిని ఎలాగోలా అమ్ముకునే వెసులుబాటు లేక ఇబ్బందులు పడుతున్నారు. 12 శాతం మించని తేమ ఉన్న పత్తిని సీసీఐ గరిష్ఠ ధర ఇచ్చి కొనుగోలు చేస్తున్నది. తేమశాతం మించితే రూ.వెయ్యి వరకు క్విం టాకు కోత విధిస్తోంది. అదే ప్రైవేట్లో అయితే క్వింటాకు రూ.2 వేలు నష్టపోవాల్సి వస్తుందని భావించిన రైతు లు సీసీఐకే వస్తున్నారు.
అయితే సిబ్బంది జిన్ని ంగ్ మిల్లుల యజమానులతో కుమ్మక్కై తేమశాతాన్ని పెంచి చూ యించి రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు కూలీల కొరతతో పంట పొలాల్లోనే వదిలేసే పరిస్థితి తలెత్తింది. వ్యయ ప్రయాసాలకోర్చి పత్తిని అమ్మేందుకు ట్రాక్టర్లలో తీసుకొస్తే కొనుగోలు చేయకపోవడంతో వెయిటింగ్ చార్జీలు తడిసి మోపడవుతున్నాయి.
ఈ ఏడాది పత్తి కొనుగోలు చేయడానికి జిన్నింగ్ మిల్లుల సీసీఐ నుంచి టెండర్లు ఆహ్వానించింది. కొన్ని మిల్లులకు మాత్రమే అనుమతి లభించింది. అవి కూడా రైతులకు అనువుగా లేని వాటికి కొనుగోళ్ల బాధ్యత అప్పగించారు. కొనుగోలు చేసిన దూదిని బెళ్లుగా మార్చి ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు వ్యాపారస్తులకు కమీషన్ రూపేనా అప్ప చెబుతోంది. అయితే సీసీఏ నిబంధనలు మాత్రం 12 శాతంలోపు తేమ ఉన్న పత్తిని మాత్ర మే కొనాలని.. ఎక్కువ ఉంటే ధర తగ్గించాలని.. ఎకరాకు 7 క్వింటాళ్లు మాత్రమే తీసుకోవాలని… కిసాన్ కపాస్ యాప్లో స్లాట్ బుక్ చేస్తున్న రైతులవి మాత్రమే కొనాలని నిబంధనలు ఉన్నాయి.
సీసీఐ ఇచ్చే కమీషన్ ఆధారంగా నడిచే మిల్లులు అనేక నిబంధనలతో నష్టాల పాలవుతున్నామని.. మిల్లుల యజమానులు సమ్మెకు దిగారు. మరోవైపు రేపు, ఎల్లుండి స్లాట్ బుక్ చేసుకున్న రైతులు మిల్లుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. కొనుగోలు జరగవని తెలిసిన అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు.