అలంపూర్ చౌరస్తా, నవంబర్ 3: అకాల వర్షాల కారణంగా పండించిన పంట దిగుబడి లేక అల్లాడుతుంటే వచ్చిన పంటను కూడా అమ్ముకుందామంటే ప్రభుత్వ నింబంధనల కారణంగా తాము రోడ్డున పడుతున్నా మని పత్తి రైతులు ఆగ్రహించారు. సోమవారం ఉండవెల్లి మండలం జాతీయ రహదారికి అనుకొని ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక కాటన్ మిల్లులో సీసీఐ అధికారులు ఎకరాకు 7క్వింటాళ్లకు మించి పత్తిని కొనేది లేదని చెప్పడంతో ట్రాక్టర్లలో పత్తిని తీసుకొచ్చిన రైతులు ఆగ్రహించారు. దీంతో రైతులంతా కలిసి జాతీయ రహదారిపై రైతులకు న్యాయం చేయాలంటూ బైఠాయించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఎకరాకు రూ.60వేల నుంచి 80 వేల వరకు పెట్టుబడులు పెట్టి పంటను సాగు చేశాం. అయితే ప్రస్తుతం భారీ వర్షాల కారణంగా సరైన దిగుబడి లేక పంటలు చాలా వరకు దెబ్బతిన్నాయి.
రూ.లక్షల్లో అప్పులు చేసి పొలాలు కౌలుకు తీసుకుని పంటలు పండించిన దిగుబడులు లేక రైతులు అల్లాడుతుంటే ప్రభుత్వం, అధికారులు కనికరం చూపలేదని ఆగ్రహించారు. మొన్నటి వరకు ఎకరాకు 12 క్వింటాళ్లు కొన్న అధికారులు నేడు ఎకరాకు ఏడు క్వింటాళ్లు మాత్రమే కొంటాం అనడం ఎంత వరకు న్యాయమన్నారు. పొల్లాలో దిగి అధికారులు మా లాగా రైతు పని చేస్తే మా బాధలు తెలుస్తాయన్నారు. పొలంపై బ్యాంక్‌లో, బయట వ్యక్తులతో అప్పులు చేశామని అప్పులు తీర్చాలంటూ అప్పులు వాళ్లు, ఎరువుల వారు వేధిస్తున్నారని, అన్ని బాధలు భరిస్తూ వచ్చిన పంటను అమ్ముకుందామంటే ఎకరాకు ఏడు క్వింటాళ్లు మాత్రమే కొంటామని చెబుతున్నారని ఏడు ఎకరాలు కొనుగోలు చేస్తే మిగతా పంటను ఎవరికి అమ్ముకోవాలని ప్రశ్నించారు.
రైతుకు మద్దతు ధర కల్పించి దళారుల వ్యవస్థను నిర్మూలిస్తామన్న ప్రభుత్వ మాటలు ఏమయ్యాయని, మిగతా పంటను దళారులకే అమ్ముకోవాలంటూ జాతీయ రహదారిపై అధికారుల తీరుపై రైతులు మండిపడ్డారు. జాతీయ రైతులు గంటపాటు బైఠాయించడంతో సూమారు ఐదు కిలోమీటర్ల దూరం వరకు వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న సీఐ రవిబాబు, ఎస్సైలు ఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పిన రైతులు ససేమీరా అన్నారు. మాకు న్యాయం జరిగేంత వరకే ఇక్కడి నుంచి లేచేది లేదని రైతులు భీష్మించారు. దీంతో సీఐ రవిబాబు కలెక్టర్, అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యను తెలపడంతో ఈ ఒక్క రోజు మాత్రమే ఎకరాకు 12 క్వింటాళ్లు కొంటామని చెప్పడంతో రైతులు శాంతించారు. దీంతో పోలీసులు జాతీయ రహదారిపై నెలకొన్న ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.