నాగర్‌కర్నూల్, జూలై 6 : నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో మొక్కజొన్న కొనుగోలులో జరిగిన అవినీతిపై బహిరంగ సవాల్ విసిరిన బీఆర్ఎస్ నాయకులు సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అవినీతికి పాల్పడిన మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు కానీ, ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ బహిరంగ చర్చకు రాకపోవడంతో బీఆర్ఎస్ నాయకులు అంబేద్కర్ విగ్రహం ఎదుట కూర్చొని ధర్నా చేశారు. అన్ని ఆధారాలతో మీరు అవినీతికి పాల్పడ్డారని నిరూపించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని, మీరు చర్చకు రాకపోతే అవినీతి పాల్పడినట్లుగా ఒప్పుకున్నట్లేనని ఆరోపించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
గంటపాటు ధర్నా చేపట్టిన బీఆర్ఎస్ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసి మార్కెట్ అధికారికి వినతి పత్రం ఇచ్చేందుకు వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. అంతకుముందు జరిగిన ధర్నాలో పలువురు నాయకులు మాట్లాడుతూ చర్చకు మేము వచ్చామని, మీరెక్కడ ఉన్నారో, ఎందుకు రావడంలేదో రైతులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యేకు వ్యవసాయంపై ఏమాత్రం అవగాహన లేదని, వ్యవసాయ రంగంపై సమీక్ష నిర్వహించేందుకు ఎమ్మెల్యేకు గానీ, కాంగ్రెస్ నాయకత్వానికి కానీ లేకుండా సమయం లేకుండా పోయిందని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో రైతురాజ్యం నడిపిస్తే నేడు రైతుల పాలిట రాక్షస రాజ్యం నడుస్తుందని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ కరోనా కష్టకాలంలోనూ కల్లాల్లోన ధాన్యాన్ని కొనుగోలు చేయిస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు అష్టకష్టాలుపడి మార్కెట్‌కు ధాన్యాన్ని తెచ్చినా, అధికారుల కాళ్లు మొక్కే పరిస్థితులు దాపురించాయని మండిపడ్డారు.
గడిచిన యాసంగిలో నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో లక్షా 4వేల 263 ఎకరాల విస్తీర్ణంలో మొక్కజొన్న సాగు చేసినట్లు వ్యవసాయాధికారులు రిపోర్టు ఇచ్చారన్నారు. ఈ లెక్కన నియోజకవర్గంలో సాధారణంగా ఎకరానికి 40 క్వింటాళ్ల మొక్కజొన్న దిగుబడి వచ్చిందన్నారు. వ్యవసాయాధికారుల లెక్కల ప్రకారం ఇప్పటికీ 40 లక్షల క్వింటాళ్ల మొక్కజొన్న దిగుబడి వచ్చిందని, రైతు పండించిన పంటను అమ్ముకునేందుకు సైతం గన్నీ బ్యాగులను ఏర్పాటు చేసుకోవడంలో అంచనా వేయడంలో స్థానిక ఎమ్మెల్యే, అధికారులు విఫలమయ్యారన్నారు. అధికారిక లెక్కల ప్రకారం సుమారు 80 లక్షల గన్నీ బ్యాగులు అవసరం కాగా కేవలం 20 లక్షల బస్తాలను మాత్రమే రైతులకు సరఫరా చేశారన్నారన్నారు. మిగతా బస్తాలు సరఫరా చేయడం చేతగాక కొరత ఏర్పరిచి రైతులను ఇబ్బందుల పాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
దీనినే ఆసరా చేసుకున్న మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు ఎమ్మెల్యే అండదండలతో బ్లాక్ మార్కెట్లో బస్తాలను సరఫరా చేసే దందా ప్రారంభించారన్నారు. ఈ లెక్కన బస్తా వెనుక రూ.5 నుంచి 15 అదనంగా వసూలు చేస్తూ అనుచరులతో దందా నడిపించాడన్నారు. రైతులకు బస్తాకు రూ. 22.11 ఇస్తామని ఒక్క రూపాయి ఇవ్వలేద ని, ఈ డబ్బులు ఎవరి జేబుల్లో వేసుకున్నారో ఎమ్మెల్యే, చైర్మన్ సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. పీఏసీసీఎస్ నుంచి మొక్కజొన్న కొనుగోళ్లు చేస్తే ఎమ్మెల్యే ఆదేశానుసారం మార్కెట్ చైర్మన్ తనకి సంబంధం లేకున్నా తల దూర్చి చాలా వరకు అవినీతికి పాల్పడ్డారన్నా రు. పీఏసీసీఎస్ వారు తూరం వేసిన రైతుల మొక్కజొన్నలను లారీకి ఎత్తడానికి హమాలీకి ఒక సంచికి రూ.26 ఇవ్వలేనని అధికారికంగా చెప్పారన్నారు. అదేవిధంగా ప్రభుత్వం నుంచి పీఏసీసీఎస్ వారికి రవాణాకి గానీ, హమాలీకి గానీ ఎటువంటి డబ్బులు అదనంగా వసూళ్లు చేయడానికి వీలు లేదని పీఏసీసీఎస్ సీఈవో అధికారికంగా తెలియజేశారన్నారు. రాష్ట్రంలో ఆర్ఆర్ టాక్స్ నడుస్తుంటే నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో రమణారావు(ఆర్), రాజేశ్‌రెడ్డి(ఆర్)ల ఆర్ఆర్ ట్యాక్స్ వసూళ్లు చేయబడుతుందని విమర్శించారు.
నాగర్‌కర్నూల్ మండలం పెద్దముద్దునూర్ గ్రామంలో అదే గ్రామవాసి అయిన మార్కెట్ కమిటీ చైర్మన్ నిండా ముంచాడని విమర్శించారు. మండలంలోని ఇతర గ్రామాల్లో ఏర్పాటు చేసిన పీఏసీసీఎస్ కేంద్రాల్లో రమణారావు, వారి అనుచరులు తలదూర్చి రైతుల నుంచి హమాలీ, ట్రాన్స్‌ఫోర్ట్ చార్జీల పేరు 1 సంచికి రూ.35 నుంచి 50 వరకు అదనంగా ఆర్ఆర్ టాక్స్ ద్వారా సుమారు రూ.50 లక్షల వరకు అవినీతికి పాల్పడ్డారన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ ఫిర్యాదు చేసినా స్పందించ లేదని, అవినీతికి పాల్పడినట్లుగా నిరూపిస్తే నేలకు ముక్కు రాస్తానన్న రమణారావు చర్చ కు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఆర్ఆర్ ట్యాక్స్ రూపంలో వసూళ్ల దందాపై కలెక్టర్ స్పందించి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
వసూలు చేసిన డబ్బులను తిరిగి రైతులకు ఇప్పించాలని కోరారు. అనంతరం రమణారావు రైతుల నుంచి అక్రమంగా వసూలు చేసిన డబ్బుల విషయంలో విచారణ జరిపి రైతులకు ఇప్పించాలని కోరుతూ కలెక్టర్ వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ చిక్కొండ్ర శ్రీశైలం, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు జోగు ప్రదీప్, కొండకింద మాధవరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నల్లగంటి వెంకటయ్య, మహేశ్‌రెడ్డి, మాధవరెడ్డి, కౌన్సిలర్ పాండు, అర్జునయ్య, చారి, నగేష్చారి, ము న్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బాబురావు, ఆనం ద్, శంకర్, రాజు, రవీందర్‌రెడ్డి, అర్థం రవి, భాస్కర్‌గౌడ్, ఆలూరి నరేందర్, కరణ్‌లాల్, అమరేందర్‌రెడ్డి, చిన్నారెడ్డి, నాగార్జున, విష్ణుసాగర్, రాజుగౌడ్, కిశోర్‌గౌడ్, వంశీగౌడ్ తదితరులు పాల్గొన్నారు.