పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు కాంగ్రెస్ సర్కారు ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించింది. కానీ ప్రభుత్వం విధించిన కొర్రీలతో లబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారు. సొంత స్థలం ఉన్నా ఇండ్ల కొలతల్లో గీత దాటితే లబ్ధిదారులను అనర్హులుగా ప్రకటిస్తుండడంతో ఆందోళన గురవుతున్నారు. ఇదిలా ఉండగా.. అమ్రాబాద్ మండలం తుర్కపల్లికి చెందిన లబ్ధిదారులకు మొదటి విడుతలో ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేయగా, బేస్మెంట్ వరకు ఇంటి నిర్మాణం చేసుకోగా వీరు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కాదని లిస్టులో నుంచి పేర్లు తీయించగా లబోదిబోమని మొత్తుకుంటున్నారు. ఇలా అర్హత ఉన్నా అడ్డంకులు సృష్టిస్తుండడంతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం మూడడుగులు ముందుకు, ఏడడుగులు వెనక్కిలా మారిపోయింది.
నాగర్‌కర్నూల్, మే 9 : తెలంగాణలో పేదల సొం తింటి కల సాకారం చేసేందుకు ప్రారంభించిన ఇం దిరమ్మ ఇండ్ల నిర్మాణం ముందుకు సాగడం లేదు. వింత సమస్యతో లబ్ధిదారులు అయోమయంలో పడ్డారు. నిరుపేదలు సొంత స్థలం ఉండి నిర్మించుకుంటున్న ఇండ్ల విషయంలో కాంగ్రెస్ ప్ర భుత్వం పెట్టిన కొలతలకు గీత దాటితే అ లాంటి లబ్ధిదారులను అనర్హులుగా ప్రకటిస్తుండడంతో నిరుపేదల్లో ఆందోళన నెలకొన్నది. సరైన అవగాహన లేక ఉన్నంత స్థలంలో ఇండ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు కొలతలతోపాటు మరిన్ని ఆంక్షలు విధించడం తో అర్థం కాని పరిస్థితులు నెలకొంటున్నాయి. లబ్ధిదారులకు ఇంటి నిర్మాణం విషయంలో అధికారులు అవగాహన కల్పించకపోవడంతోనే ఈ సమస్య తలెత్తుతోందని పలువురు బాధితులు ప్రభుత్వంపై విస్మయానికి గురవుతున్నారు. వాస్తవానికి ప్రభుత్వం మొదట్లో చెప్పిన విధంగా సొంత జాగా ఉ న్న పేదవారు 400నుంచి 600చదరపు అడుగుల విస్తీర్ణంలో తమకు నచ్చిన విధంగానే ఇండ్లు నిర్మించుకోవాలని సూచించారు. ఇండ్లు మంజూరైన లబ్ధిదారులకు విడుతల వారీగా రూ.5 లక్షల ఆర్థికసాయం అం దజేస్తామని ప్రభుత్వమే పేర్కొన్న విషయం తెలిసిందే. కాగా కొందరు లబ్ధిదారులు ఈ నిబంధనలను సక్రమంగా తెలుసుకోలేకపోయారు. తొందరపాటులో 600 చదరపు అడుగులకంటే ఎక్కువ స్థలంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టారు. దీంతో నాగర్‌కర్నూ ల్ జిల్లాలో మొదటి విడుతలో ఆరుగురు లబ్ధిదారులకు రూ. లక్ష రూపాయల సాయం అందకుండా పో యాయి.
600చదరపు అడుగుల స్థలం కంటే ఎక్కువ స్థలంలో ఇండ్లను కట్టుకున్న వారు పేదవారు కాదని, వారికి ఇందిరమ్మ ఇంటి పథకం వర్తించదంటూ అధికారులు తేల్చి చెప్పడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. మొదటి విడుతలో జిల్లా వ్యాప్తంగా ఒక్కో మండలానికి ఒక పైలట్ గ్రామాన్ని ఎంపిక చేసి జిల్లాకు 816 ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటికి 145ఇండ్లు బేస్మెంట్లు పూర్తి కాగా, 95 మందికి మాత్రమే రూ.లక్ష సాయం అందింది. ఇందులో నాగర్‌కర్నూల్ జిల్లాలోని నాగర్‌కర్నూల్ మండలం పెద్దాపూర్‌లో ముగ్గురు లబ్ధిదారులు, బల్మూర్ మండలం జినుకుంట గ్రామాల్లో ముగ్గురు లబ్ధిదారులకు మొద టి విడుత సాయం అందలేదు.
అధికారులు అవగాహన కల్పించకపోవడంతోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నారని పలువురు లబ్ధిదారులు ఆం దోళన చెందుతున్నారు. ఈ విషయంపై కిందిస్థాయి అధికారులకు ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొన్నది. ఇటీవల గ్రామాల్లో కలెక్టర్ సంతోష్ ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన సమయంలో బయటపడగా, సరైన అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని సూచించినట్లు సమాచారం. మొదటి విడుతలో సాయం అందని లబ్ధిదారులు ఆవేదనకు గురవుతున్నారు. సొంతస్థలం ఉన్నందునే ఇల్లు కట్టుకుంటున్నామని, ధనవంతులం కాదని వాపోతున్నారు. అవగాహన లేకపోవడంతోనే ఇలాంటి తప్పులు జరుగుతున్నాయని, ప్ర భుత్వం చెప్పిన కొలతలు తమకు అర్థం కాకపోవడంతోనే ఇలా నిర్మాణం చేపట్టామని కొందరు లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కారణాలు చూపి తమకు సాయం చేయకపోవడం అన్యాయమని పలువురు లబ్ధిదారులు పే ర్కొంటున్నారు. ప్రభుత్వం ఈ విషయాన్ని మానవతా ధృక్ఫథంతో న్యాయం చేయాలని ఇం డ్ల లబ్ధిదారులు కోరుతున్నారు.
నాగర్‌కర్నూల్, మే 9 : ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయన్న సంతోషం ఆ గ్రామస్తులకు మూన్నాళ్ల ముచ్చటగానే మారింది. గత జనవరిలో ఆర్డీవో, తాసీల్దార్ కలిసి గ్రామంలోనే గ్రామసభ నిర్వహించి ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని మంజూరు పత్రాలను నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం తుర్కపల్లి గ్రామస్తులకు అందజేశారు. దీంతో గ్రామస్తులు పూరి గుడిసెలు, మట్టి మిద్దెలను కూల్చుకొని ఇందిరమ్మ ఇంటి కోసం బేస్మెంట్ నిర్మించుకున్నారు. తీరా మీకు ఇండ్లు మంజూరు కాలేదని అధికారులు చావుకబురు చల్లగా చెప్పడంతో దిక్కుతోచక స్థితిలో పడిపోయారు. ఇండ్లు మంజూరు కాలేదని గ్రామ పంచాయతీ అధికారి ద్వారా తెలుసుకున్న తుర్కపల్లి గ్రామస్తులు శుక్రవారం నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌ను ముట్టడించి అదనపు కలెక్టర్ అమరేందర్‌తో తమ గోడును వెల్లబోసుకున్నారు. పైలట్ ప్రాజెక్టు కింద తమ గ్రామాన్ని ఎంపిక చేసి తమకే ఇండ్లు రాలేదని అధికారులు చెప్పడం ఏమిటని మండిపడుతున్నారు.