Rythu Bharosha | కొల్లాపూర్, ఫిబ్రవరి 15: అర్హులకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని, సాగుకు పనికిరాని భూములకు రైతు భరోసా అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా చేపట్టిన సర్వే.. అన్నదాతలను ఆందోళనలోకి నెట్టివేస్తున్నది. రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి గత నెలాఖరు వరకూ గడువు విధించడంతో రైతులు అవస్థల పాలయ్యారు. రైతుల అవస్థల సంగతి పక్కన బెడితే ప్రభుత్వం.. రైతు భరోసా భారం తగ్గించుకోవడానికి వ్యవసాయ అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నది. మూడెకరాల లోపు భూములు గల రైతులకు ‘రైతు భరోసా’ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అయినట్లు ప్రభుత్వం చెబుతున్నా చాలామంది రైతులు.. రైతు భరోసా డబ్బులు ఎప్పుడు వస్తాయోనని ఫోన్ దగ్గర పెట్టుకుని టకీ టకీ మని వచ్చే మెసేజ్ల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం మాత్రం రైతులను గందరగోళంలోకి నెట్టేసి అసలు సంగతి దాచి పెడుతోంది. రైతులకు నిజాన్ని నిర్భయంగా వెల్లడించేందుకు ‘నమస్తే తెలంగాణ’ సాగుకు యోగ్యం కాని భూముల సర్వే పై ఆరా తీసింది.
ఉన్నది లేనట్లు..లేనిది ఉన్నట్లు రేవంత్ రెడ్డి సర్కార్ మభ్య పెడుతోంది. రైతులు మాత్రం రైతు భరోసా డబ్బుల కోసం సెల్ ఫోన్లు దగ్గర పెట్టుకుని అంతా భ్రాంతియేనా అంటూ నిట్టూర్పుతో ఎదురుచూస్తున్నారు. పూర్తిస్థాయి మార్గదర్శకాలు లేకుండా రైతు భరోసా భారం నుంచి తప్పించుకునేందుకు సాగుకు యోగ్యం కాని భూముల సర్వేను ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. ఈ సర్వే ఆధారంగా రైతుల భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సర్వేపై అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల పెత్తనం ఉండడంతో చాలా వరకు అధికార పార్టీ నాయకుల సాగుకు యోగ్యం కాని భూముల వివరాలు రికార్డుల్లోకి చేరలేదన్న విమర్శలు ఉన్నాయి. కానీ విపక్ష పార్టీల నాయకులు, పేద రైతులకు చెందిన సాగుకి యోగ్యం కానీ భూముల వివరాలు మాత్రం పక్కగా రికార్డుల్లోకి ఎక్కాయి. నాగర్ కర్నూల్ జిల్లాలో 7,45,684.1 ఎకరాల భూమి ఉంటే.. శుక్రవారంకల్లా 7,771.91 ఎకరాలను సాగు యోగ్యం కానీ భూములుగా గుర్తించి రికార్డులోకి ఎంట్రీ చేశారు.
రాష్ట్రంలో వ్యవసాయ అధికారుల పరిస్థితి ముందు నొయ్యి వెనక గొయ్యిలా ఉంది. సాగుకు యోగ్యం గాని భూముల సర్వేపై ఎటువంటి అధికారిక ఆదేశాలు లేవని సమాచారం. సర్వేలో గందరగోళం, సందేహాలపై రైతుల అడిగే ప్రశ్నలకు వ్యవసాయ అధికారుల వద్ద సమాధానాలు లేవు. ఉదాహరణకు ఒక సర్వే నెంబర్లో ఐదెకరాల భూమి ఉంటే అందులో సాగుకు యోగ్యం కానీ 20 గుంటల భూమిని మాత్రమే రికార్డుల్లో నమోదు చేసేందుకు ఎటువంటి ఆప్షన్ లేదు. నిషేధ జాబితాలోకి ఎక్కించాలంటే సర్వే నెంబర్లోని భూమంతా నమోదు చేయాలి.. లేదంటే పూర్తిగా వదిలేయాలి. తమ బ్యాంకు ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు పడని రైతులు వ్యవసాయశాఖ అధికారుల కార్యాలయాలపై దండయాత్రకు వస్తున్నారు. ఇటీవల కొల్లాపూర్ మండలం చింతలపల్లి గ్రామ రైతు వ్యవసాయ కార్యాలయానికి వచ్చి బెదిరించి వెళ్ళాడు.
వ్యవసాయ అవసరాల కోసం వినియోగించే కళ్లాలు, దొడ్లు కూడా రైతులకు తెలియకుండానే నిషేధ జాబితాలోకి వెళ్లాయి. ప్రతి రైతు గ్రామంలో పశువుల కోసం వాటి మేత కోసం కల్లాలను, దొడ్లను ఏర్పాటు చేసుకుంటారు. ఇప్పటికి కూడా వ్యవసాయ అవసరాల కోసం వినియోగిస్తున్నారు. పంట భూమిలో గుంటా రెండు గుంటల్లో రాయి ఉంటే గతంలో వాటిని తవ్వించే స్థోమత లేక అలాగే వదిలిపెట్టారు. గతంలో కేసీఆర్ సమయంలో వచ్చిన రైతుబంధు డబ్బులతో రాయి తొలగించారు. ఇప్పుడు వాటిని జమా ఖర్చుల్లో భాగంగా రైతు భరోసా నుంచి తప్పించారు. ఇప్పుడు సొంత డబ్బులతో పొలాలలో రాయిని తీసివేసి సాగులోకి తెచ్చుకున్న రైతు భరోసా డబ్బులు పడే అవకాశం లేకుండా ప్రభుత్వం నిషేధిత జాబితాలో పెట్టిందని విమర్శలు ఉన్నాయి.
‘సాగుకు యోగ్యం కానీ భూముల పేరుతో కల్లాలకు, దొడ్లకు రైతు పొలాలలో ఉండే నట్లకు రైతు భరోసా చెల్లించకుండా రైతులను వ్యవసాయం నుంచి దూరం చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేసింది. ఇచ్చే రైతు భరోసా కూడా కొంతమందికి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంది ఇది ప్రజా వ్యతిరేక రైతు వ్యతిరేక ప్రభుత్వం’ అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దూరెడ్డి రఘువర్ధన్ రెడ్డి ఆరోపించారు.