బాలానగర్, మే 5 : రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజ లు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని నేరళ్లపల్లిలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 25మంది కార్యకర్తలు లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారికి మాజీ మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడు తూ.. ఆరు గ్యారెంటీలు అంటూ ఊదరగొట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. కాంగ్రెస్ నేతలు ఇచ్చే హామీలు పత్రికలకు పరిమితం కావడం తప్పా ప్రజలకు అందవని విమర్శించారు.
కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలబడిందని, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబీమా వంటి పథకాలు ప్రజల హృదయాల్లో నిలిచిపోయాయని అన్నారు. మోసంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు ఒరిగిందేమీ లేదని, రానున్న రోజుల్లో బీఆర్ఎస్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో శ్రీనివాసరావు, వెంకటాచారి, చెన్నారెడ్డి, గణేశ్గౌడ్, మంజ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.