ఖిల్లాఘణపురం, జూన్ 26 : మండలంలోని రుక్కన్నపల్లికి చెందిన వార్డు మెంబర్, కాంగ్రెస్ నాయకుడు రవినాయక్తోపాటు మరికొంత మంది కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సమక్షంలో గురువారం జిల్లా కేంద్రంలోని ఆయన స్వగృహంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ముందుగా పార్టీలో చేరిన వారికి మాజీ మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రైతులు, మహిళలు, వృద్ధులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నమ్మి కేసీఆర్ ఇచ్చిన సంక్షేమ పథకాలను రెట్టింపు చేసి ఇస్తామని చెబితే నమ్మి మోసపోయామన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి అహర్నిశలు కృషి చేస్తే సంక్షేమ పథకాలు రైతు భరోసా, రుణమాఫీ, రైతుబీమా, బోనస్, మహిళలకు రూ.2500, వృద్ధులకు రూ.4వేలు ఆసరా పింఛన్లు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు కల్పించడంలో ఘోరంగా విఫలమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అహంకారం పెరిగి పని చేసిన నాయకులను నిర్లక్ష్యం చేస్తుందని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల పదవీకాలం ముగిసినా నేటికి ఎన్నికలు నిర్వహించకపోవడంతో నిధులు లేక గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందన్నారు. అందుకే బడుగు, బలహీన, మైనార్టీ వర్గాల సంక్షేమ కోసం కృషి చేసిన బీఆర్ఎస్ పార్టీలో తాము చేరామని, మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి నాయకత్వంలో మా మండలాన్ని, గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామని తెలిపారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ పార్టీలో కొత్త, పాత అనే తేడా లేకుండా బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపిచేందుకు కృషి చేయాలని అన్నారు. పార్టీలో చేరిన వారిలో కె.బాలునాయ క్, కె.రాములునాయక్, పి.సంతునాయక్, ఎం.రేఖ్యానాయక్ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కృష్ణనాయక్, పార్టీ మండలాధ్యక్షుడు రాళ్లకృష్ణయ్య, మాజీ సర్పంచులు నార్యనాయక్, పిన్యా నాయక్, శ్రీను నాయక్, మన్యంగౌడ్, పెంకుల ఆంజనేయులు, గోత్ర కృష్ణ, చిట్యాల రాము, నందిమల్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు.