భూ పంచాయితీలకు చెక్ పెడుతూ నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తున్న ధరణిపై కాంగ్రెస్ నేతలు అక్కసు వెల్లగక్కారు. తాము అధికారంలోకి వస్తే పోర్టల్‌ను బంగాళాఖాతంలో విసిరేస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుండడం రైతులను ఆందోళనకు గురి చేస్తున్నది. మళ్లీ పటేళ్లు, పట్వారీ వ్యవస్థకు బీజం వేసేందుకే వారి తాపత్రయమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ వ్యాఖ్యలు నమ్మి ఆ పార్టీకి ఓటేస్తే నట్టేట ముంచుడు ఖాయమని హెచ్చరిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి బాగుందని, నిమిషాల్లో రిజిస్ట్రేషన్లు పూర్తవుతున్నాయని సంతోషం వెలిబుచ్చుతున్నారు.
రైతుల శ్రేయస్సు కోసం సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణిని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రద్దు చేసి భూమాత పోర్టల్ తీసుకొస్తానని చెబుతున్నది. ధరణి పోర్టల్‌ను తీసేస్తే మళ్లీ దళారులు రాజ్యమేలుతారు. ప్రతి గ్రామంలో మధ్యవర్తులు పుట్టుకొచ్చి భూములకు సంబంధించిన పనులకు ఇష్టారీతిన డబ్బులు దండుకొనే పరిస్థితి ఏర్పడుతుంది. పటేల్, పట్వారీల కాలం నాటి పరిస్థితులు వస్తాయి. భూములు గోల్మాల్ అవుతాయి. ధరణి వ్యవస్థ ఉన్నందుకే మా భూములు భద్రంగా ఉన్నాయి. ఎలాంటి పైరవీలకు తావు లేకుండా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. కాంగ్రెసోళ్లు భూమాత పోర్టల్‌లో మళ్లీ అన్ని కాలమ్స్ పెడతామంటున్నారు. అలా చేస్తే దళారులు, పెత్తందారులు, అధికారులు ఏం చెబితే అదే చేయాల్సి వస్తుంది. ధరణి తీసేస్తే అవినీతి, అక్రమాలు జరుగుతయ్. ఒకరి భూమి మరొకరు ఆక్రమించుకొని రికార్డులను మార్చుతరు. రేవంత్‌కు రైతుల బాధలు పట్టవు. కాంగ్రెస్‌ను నమ్ముకొంటే రైతులు ఆగం అయితరు. సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి. ముచ్చటగా మూడోసారి కేసీఆరే సీఎం కావాలి.
నాకు ఐదెకరాలు ఉన్నది. మా కుటుంబానికి వ్యవసాయమే ఆధారం. ధరణి రాకముందు పొలం ఎవరి పేర పట్టా ఉందో తెలియకపోయేది. గతంలో భూమి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మ్యుటేషన్ కోసం తాసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగేవాళ్లం. నాయకుడినో, పైరవీకారుడినో పట్టుకొని ఆఫీస్‌కు పోతే పనయ్యేది. పైసలు ఖర్చయ్యేటివి. ధరణి వచ్చినంక ఎవరి భూమి ఎంత ఉందో ఆన్లైన్లో ఇట్టే తెలిసిపోతున్నది. నేను ఆర్నెళ్ల కిందట ఎకరం పొలం కొన్నాను. స్లాట్ బుక్ చేసుకొని ఆఫీస్‌కు పోతే పది నిమిషాల్లో రిజిస్ట్రేషన్ అయ్యింది. మూడు రోజుల్లోనే నేరుగా ఇంటికే పాస్‌పుస్తకం వచ్చింది. పైరవీకారులు లేకుండా రూపాయి ఖర్చు లేకుండా భూమి నా పేర మారింది. ధరణి ద్వారా దళారీలు లేకుండానే రైతుబంధు అందుతుంది. ధరణి తీసేస్తే రైతులు నట్టేట మునిగినట్టే.. మళ్లీ పైరవీకారులొస్తారు. భూములకు రక్షణ ఉండదు. కాంగ్రెస్ రాకూడదు.. వస్తే రైతులకు మళ్లీ కష్టాలు మొదలైతయి. అందుకే సీఎం కేసీఆర్‌కే రైతులంతా మద్దతుగా నిలవాలి.
– రఘు, రైతు, నాగసాల గ్రామం, జడ్చర్ల మండలం
రైతు తన భూమిని కౌలుకిస్తే అనుభవదారు కాలంలో కౌలు రైతు పేరు వచ్చేది. పన్నెండేండ్లు కౌలు చేస్తే ఆయనకు హక్కులు వచ్చి భూమిని పట్టా చేయించుకునే అవకాశం ఉండేది. కానీ ధరణి వచ్చాక అనుభవదారు కాలం తీసేశారు. దీంతో పట్టాదారు పొలాన్ని కౌలుదారు, వేరేవాళ్లు పట్టా చేసుకోనిక్కె రాదు. పట్టాదారు వ్యాపార, ఉద్యోగాల కోసం దూర ప్రాంతాల్లో ఉన్నా.. వారి భూమి భద్రంగా ఉంటున్నది. ఇది వచ్చాక భూ తగాదాలు కనిపిస్తలేవు. బ్యాంకు లోన్ తీసుకోవవడానికి సులువైంది. కాంగ్రెస్ నేతలు పట్వారీ వ్యవస్థను తీసుకొస్తామని చెబుతున్నారు. మళ్లా పాత పద్ధతి వస్తే రైతుల గోసలు వర్ణణాతీతం. గతంలో భూములకు సంబంధించి పాస్‌బుక్‌లు, పహాణీలు కావాలని రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగినా లాభం లేకపోయేది. డబ్బులు తీసుకొని కూడా ఇబ్బందులు పెట్టేవారు. ధరణి వచ్చాక నేరుగా మీ సేవా కేంద్రాల్లో పహాణీలు తీసుకుంటున్నాం. రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే పాసుబుక్కును పొందుతున్నాం. ధరణి రాక ముందు రిజిస్ట్రేషన్ ఒకసారి.. మ్యూటేషన్ మరోసారి జరిగేది. దీంతో శానా ఇబ్బందులు పడ్డాం. ధరణీ రద్దు చేస్తే రైతుల భూములు ఉన్నయో, పోయినయో తెలియని పరిస్థితి ఉంటుంది. రేవంత్‌రెడ్డికి రైతుల గురించి మాట్లాడే అర్హత లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పని చేస్తుంది.
కాంగ్రెసోళ్లు ధరణి పోర్టల్‌ను రద్దు చేసి రైతులను దోచుకోవాలని చూస్తున్నారు. భూమాత వస్తే రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిందే. పటేల్, పట్వారీ వ్యవస్థతో భూములు తారమారయ్యే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి తొలగిస్తామనడం అవగాహన రాహిత్యం. ధరణితోనే రైతులకు మేలు జరుగుతుంది. భూమాతతో రైతులు పాతాళానికి పడిపోవడం ఖాయం. కాంగ్రెస్ పాలనలో రైతులు పడ్డ కష్టాలు అన్నీఇన్నీ కావు. గ్యారెంటీ స్కీంల పేరిట ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ కుయుక్తులు పన్నుతున్నది. ఈ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. ఎనుకటి లెక్క చేతితో రాసే పట్టాలైతే అవకతకలు జరుగుతయి. రైతులు ఆగమవుతరు. పటేల్, పట్వారీ వ్యవస్థ ఉన్నప్పుడు ఎవరి భూములు ఎవరికి రాశారో తెలియదు. కాస్తులో ఒకరు, పట్టాలో ఒకరు ఉండడంతో గొడవలు జరిగేవి. ధరణి వచ్చాక అటువంటి సమస్యలేవీ లేవు. రెవెన్యూ రికార్డులు భద్రంగా ఉన్నాయి.ఒక వ్యక్తికి ఒకే పాస్ పుస్తకం ఇచ్చారు. ధరణిని రద్దు చేస్తే మళ్లీ పాత రోజులు వస్తాయి. గొడవలు పెరుగుతాయి. అందుకే రైతులెవ్వరూ కాంగ్రెసోళ్ల వైపు చూడరు. మళ్లా కేసీఆర్‌నే సీఎం జేసుకోవాలని చూస్తున్నరు.
ధరణి పోతే మళ్లీ పాత రోజులు వస్తాయి. అలాంటి గోసలు మాకొద్దు. ఎన్నో ప్రయాసాలకోర్చి తమ భూముల భద్రత కోసం సీఎం కేసీఆర్ తెచ్చిన ధరణిని తొలగిస్తామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ధరణిని తొలగించాలన్న ఆలోచన వచ్చిన కాంగ్రెస్‌ను ఎన్నికల్లో పాతాళానికి తొక్కేస్తాం. ధరణితో ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. భూములకు భద్రత పెరిగింది. నిమిషాల్లో రిజిస్ట్రేషన్లు అయితున్నాయి. స్లాట్ బుక్ తప్పా ఎవరికీ నయాపైసా ఇవ్వాల్సిన అవసరం లేదు. అదే రోజు ప్రొసీడింగ్ చేతికొస్తుంది. పోస్ట్‌లో పాస్‌పుస్తకం నేరుగా ఇంటికి వస్తుంది. ధరణి రైతుల పాలిట వరం. పటేల్, పట్వారీ వ్యవస్థ నెలకొల్పి భూ రికార్డులను తారుమారు చేసే సంస్కృతి కాంగ్రెస్ పార్టీది. వారి మాటలు నమ్మితే మొదటికే మోసం వస్తుంది. పైసలిస్తే రికార్డులు మాయమయ్యే రోజులు వస్తాయి. ఎట్టి పరిస్థితిలో ధరణిని తొలగించొద్దు. ఇది చాలా బాగుంది. పూటకో మాట మాట్లాడే వారిని గ్రామాల దరిదాపుల్లోకి కూడా రానీయొద్దు.
రైతుల భూములు గోల్మాల్ చేసేందుకు కాంగ్రెస్ నేతలు ధరణిని తీసేసి భూ మాత తీసుకొస్తామని చెబుతున్నారు. మా భూములు ఇప్పుడు ధరణిలో భద్రంగా ఉన్నాయి. రైతులకు ఏ అవసరమున్నా వెంటనే మీ సేవకు వెళ్లి రెండు నిమిషాల్లో తీసుకుంటున్నాం. రైతుల మధ్య కోట్లాటలు పెట్టి.. దళారీ రాజ్యం తీసుకొచ్చే భూమాత మాకొద్దు. అది భూమేతగా మారుతుంది. పట్టా పాస్బుక్కుల కోసం రెవెన్యూ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసేంత ఓపిక లేదు. మా సీఎం కేసీఆర్ సారు తెచ్చిన ధరణినే మాకు ముద్దు. రికార్డులు తారుమారు చేసి రైతుల భూములకు రక్షణ లేకుండా చేయాలని చూస్తున్న రేవంత్‌రెడ్డికి డిపాజిట్లు కూడా రాకుండా చేయాలి. కాంగ్రెస్ హయాంలో ఏ చిన్న పత్రం కావాలన్నా దళారులను ఆశ్రయించి డబ్బులు పెట్టి తిరిగి, తిరిగి వేసారే వాళ్లం. ధరణిని తీసేస్తే రైతులందరం పార్టీలకతీతంగా ఉద్యమిస్తాం. రైతుల సంక్షేమం కోరే సీఎం కేసీఆర్ వెంటే ఉంటాం. ధరణితోనే రైతులకు రక్ష.