అమరచింత, జూలై 13 : ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లులు సకాలంలో అందకపోతే ఆందోళన చెందవద్దని అవసరమైతే తన సొంత ఇంటిని అమ్మి మీకు బిల్లులు అందిస్తానని మంత్రి వాకిటి శ్రీహరి ఒక పక్క ప్రజలకు మాటలు చెబుతున్నారు. కానీ ఆయన ప్రాతినిధ్యం వహించే మక్తల్ నియోజకవర్గంలోని అమరచింతం మండలం పాంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మాత్రం తమకు ప్రతి లబ్ధిదారుడు ఇందిరమ్మ ఇంటికి రూ.50వేలు కమీషన్ ఇవ్వాలని, లేకపోతే అధికారులకు చెప్పి మీకు బిల్లులు రాకుండా చేస్తామని లబ్ధిదారులను బెదిరింపులకు గురి చేస్తున్నారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఆ గ్రామ ఉప్పసర్పంచ్ వెన్నెల భర్త మోహన్‌తోపాటు పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ పాంరెడ్డిపల్లి గ్రామంలో మొత్తం తొమ్మిది మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా ముగ్గురు లబ్ధిదారులు ఇంటి నిర్మాణం పూర్తి చేస్తున్నారని చెప్పారు.
వారికి మూడో విడుత బిల్లు వరకు వచ్చిందని, మిగతా బిల్లులు రావాల్సి ఉందని, అలాగే మరో ఆరుగురు బేస్మెంట్, ఆర్సీ, రెంటల్ లెవల్ వరకు అప్పులు చేసి ఇంటి నిర్మాణం చేసుకోగా కాంగ్రెస్ నాయకులు తమకు కమీషన్ ఇవ్వలేదని అధికారులను బెదిరించి బిల్లులు రాకుండా అడ్డుకుంట్టున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇండ్లు లేని పేదలందరికీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుందని, కాంగ్రెస్ నాయకులు ఎవరైనా ఇండ్లు మంజూరు చేసినందుకు డబ్బులు అడిగితే తనకు చెప్పాలని మంత్రి చెబుతుండగా ఇక్కడి కాంగ్రెస్ నాయకులు మాత్రం తమకు రూ.50 వేలు కమీషన్ ఇవ్వకపోతే బిల్లులు రాకుండా అడ్డుకుంటున్నారని, అంతే కాకుండా ఇండ్లు పరిశీలించడానికి వచ్చిన అధికారులను సైతం తమకు సమాచారం ఇవ్వకుండా గ్రామాలకు రావొద్దని మా ముందే బెదిరిస్తున్నారని ఆరోపించారు.
ఈ విషయంలో మంత్రి జోక్యం చేసుకొని లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇంటి బిల్లులు ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. దీనిపై హౌసింగ్ ఏఈ రాజేశ్వరిని ‘నమస్తే తెలంగాణ’ వివరణ కోరగా పాంరెడ్డిపల్లిలో ఇందిరమ్మ ఇండ్లు పరిశీలించడానికి వెళితే గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు ఒకరు గ్రామానికి వచ్చేటప్పుడు మాకు సమాచారం ఇచ్చి రావాలని, మరోసారి వచ్చేటప్పుడు మాకు ముందస్తు సమాచారం ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిపారు. అయితే గ్రామంలో ఇప్పటి వరకు మూడు ఇండ్లు నిర్మాణం పూర్తయ్యాయని వారికి రెండు విడుతల వరకు బిల్లులు చెల్లించామని, మిగిలిన ఆరుగురు లబ్ధిదారులకు రెండో విడుత వరకు ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నారని వారికి తొందరలోనే బిల్లులు వస్తాయని, కాంగ్రెస్ నాయకులు చెప్పినట్లు మాత్రం ఎవరికీ ఇంటి బిల్లులు ఆపలేదని వివరించారు.