నాగర్‌కర్నూల్, జూన్ 25 : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వారు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలతోపాటు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వ్యతిరేకత ప్రారంభమైందని, ఇందులో భాగంగానే పలువురు నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరుతున్నారని మర్రి పేర్కొన్నారు.
గురువారం నాగర్‌కర్నూల్ మండలం పెద్దముద్దునూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీకి చెందిన 50 మందికిపైగా నాయకులు, కార్యకర్తలు నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మర్రి పార్టీలో చేరిన మోత్కూరి నాగయ్య, మోత్కూరి అయోధ్య, పుల్జాల మహేశ్, నల్లగంటి మహేశ్, మోత్కూరి శివ, బుసిపాగ బాలకృష్ణ, బీ నాగరాజు, రాములు, నిరంజన్లతోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలకు గులాబీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మర్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు మోసపోయామని సొంత పార్టీ కార్యకర్తలే చెబుతున్నారంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుందన్నారు.
అమలు కాని హామీలను ఇచ్చి గద్దెనెక్కి ప్రజలను, రైతులు, పార్టీ కార్యకర్తలను పట్టించుకోవడం లేదని, దీంతో ఆ పార్టీలో ఉండి కూడా వృథానేనని గుర్తించిన కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీలో అందరికీ సమనాయ్యం జరుగుతుందని గుర్తించామని కాంగ్రెస్ కార్యకర్తలు బహిరంగంగా చెబుతున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లకే ఇంత వ్యతిరేకత వస్తుందంటే ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నది ఏమిటో ప్రజలకు అర్థమవుతుందని వివరించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ చిక్కొండ్ర శ్రీశైలం, కిశోర్‌గౌడ్, కురుమూర్తి, తలారి వెంకటయ్య, మోత్కూరి నాగార్జున తదితరులు పాల్గొన్నారు.