కల్వకుర్తి, మార్చి 24 : అబద్ధపు మాటలు.. మోసపూరిత ప్రకటనలు.. రేవంత్ సర్కారు రైతులకు నిలు వు పంగనామాలు పెట్టింది. గత 16 నెలలుగా రుణమాఫీ చేస్తామని దేవుళ్లపై ఒట్లు వేసిన ముఖ్యమంత్రి.. తాను వేసిన ఒట్లను గట్టుమీద పెట్టేశాడు. ఇప్పటి వరకు చేసిన రుణమాఫీ అంతంత మా త్రమే.. రాష్ట్ర ప్రభు త్వం.. ఒక్క ప్రకటనతో రుణమాఫీ కథకు ఫుల్‌స్టాఫ్ పెట్టేసింది. రూ.2 లక్షలకుపైగా ఉన్న పంట రుణాలను మాఫీ చేయడం లేదని వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటించడంతో రైతుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఇచ్చిన రుణమాఫీ పథకాన్ని అటకెక్కించిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరును రైతులు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. ప్రభుత్వం మాఫీ చేస్తుందనే ఆశతో రైతులు.. ప్రభుత్వం ఇచ్చిన మాటలు నమ్మి రూ.2 లక్షలకుపైగా ఉన్న డబ్బులను బ్యాంకులకు చెల్లించారు. ఇప్పుడు రూ.2 లక్షలకుపైగా ఉన్న రుణాలను మాఫీ చేయడం లేదని ప్రభుత్వం ప్రకటించడంతో డబ్బులు చెల్లించిన రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నమ్మి ఓట్లు వేస్తే నిలువునా ముంచారని, కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పదని వేదాంత ధోరణిలో రైతులు వాపోతున్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లాలో 3,22,724 మంది రైతులు ఉన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం 1,11,297 మంది రైతులకు సంబంధించి దాదాపు రూ.974 కోట్ల పంట రుణాలు మాఫీ చేసింది. ఇంకా దాదాపు 2,11,427 మంది రైతులకు రుణమాఫీ చేయాల్సి ఉన్నది. ఇందులో చాలా మంది రైతులు రూ.2 లక్షల వ్యవసాయ రుణాలను కలిగి ఉన్న వారే. ప్రభుత్వం ఇప్పటి వరకు మూడో వంతు రైతులకు మాత్రమే రుణమాఫీ చేసిందని రైతులు అంటున్నారు. ప్రతి గ్రామంలో రుణమాఫీ వచ్చినా వారికంటే.. రుణమాఫీ కాని రైతుల సంఖ్య ఎక్కువగా ఉందని గణాకాలను చూస్తే అర్థమవుతున్నది.
రూ.2 లక్షలకుపైగా ఉన్న రుణాలను వ్యక్తిగతంగా, కు టుంబ పరంగా పరిగణనలోకి తీసుకున్నారు. కుటుంబంలో ఒక్కరికే ఇంత రుణం ఉన్నా.. లేదా కుటుంబంలో భార్య, భర్తకు ఇద్దరికీ కలిసి రూ.2 లక్షలకుపైగా ఉన్నా.. రూ.2 లక్షలకుపైగా ఉన్న వారిని జాబితాలో ప్రభుత్వం గుర్తించింది. భార్యకు రూ.1.10 లక్ష, భర్తకు రూ.1.10 రుణం ఉన్నా.. వారి ఖాతాల రుణాలను ఒక్కటిగా మార్చి రూ.2 లక్షలకుపైగా ఉన్న ఖాతాలుగా గుర్తించింది. ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగానే రూ.2 లక్షల నిబంధన తెచ్చిందని అర్థమవుతున్నది. గ్రామాలలో చాలా మంది భార్య, భర్తకు భూములు ఉన్నా యి.
వారు పంట రుణాలను కూడా తీసుకున్నారు. సరాసరిన లెక్కిస్తే.. 50 శాతం మంది భార్యాభర్తలకు భూములు ఉన్నాయి.. రుణాలు ఉన్నాయి.. అందుకే ప్రభుత్వం రుణాల విషయంలో కుటుంబం మొత్తానికి రూ.2 లక్షల వరకే రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది. ఇప్పుడు అదే నిబంధనను అడ్డంపెట్టుకొని పెద్ద మొత్తంలో రుణాలను మాఫీ చేయడం లేదని నిస్సిగ్గుగా ప్రకటించింది. దీంతో రైతు సంఘాల నాయకులు మండిపడుతున్నారు.
ప్రభుత్వం రుణమాఫీ విషయంలో నమ్మించి మోసం చేసింది. ఎన్ని కలకు ముందుకు రైతు డిక్లరేషన్‌లో హామీలు ఇచ్చి అధికారం వచ్చాక రైతులను నిలువునా మోసం చేయడం కాంగ్రెస్ పార్టీకే చెల్లింది. రూ.2 లక్షల వరకైనా రుణమాఫీ చేసిందా? అంటే అదీ లేదు. ఇప్పుడేమో రూ.2 లక్షలకుపైగా ఉన్న రుణాలను మాఫీ చేయమని ప్రభుత్వం ప్రకటించింది. రైతుల విషయంలో ఒక్క మాటనూ నిలుపుకోలేదు. దేవుళ్లపై ఒట్లు వేశారు.. కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో తిరగలేని పరిస్థితి తెచ్చుకున్నారు. హస్తం పార్టీని నమ్మి ఓట్లు వేసిన రైతులు నిలువునా మోసపోయారు. సర్కారు రైతుల విషయమై మరోసారి పునరాలోచించుకోవాలి.
– రాంచంద్రారెడ్డి, రైతు జేఏసీ నాయకుడు, కల్వకుర్తి