కవి అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ గేయాన్ని కీరవాణి సంగీత దర్శకత్వంలో రికార్డింగ్ చేస్తుండడంతో కవులు, కళాకారుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. రాష్ట్ర గీతానికి వెస్టర్న్ బాణీలు అవసరమా..? అని ప్రశ్నిస్తున్నారు. అలాగే చిహ్నంలోని కాకతీయ కళాతోరణం, చార్మినార్ గుర్తుల తొలగింపునకు రేవంత్ కుట్ర పన్నుతుండడంపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆగ్రహావేశాలుపెల్లుబికుతున్నాయి. చారిత్రక గుర్తులు తొలగించడం ప్రభుత్వ అనాలోచిత నిర్ణయమన్నారు. చిహ్నా’భిన్నం చేయాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు.
కాకతీయ తోరణం, తెలంగాణ సింబల్ మార్పు, టీఎస్‌ను టీజీగా మార్చారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని హిందూ సంస్కృతికి దర్పణమైన దేవతామూర్తి రూపంలో కాకుండా మరోలా మార్చాలని.. జయజయహే తెలంగాణ గీతాన్ని కీరవాణి చేత వెస్టర్న్ సంగీతంలోకి మార్చాలన్న ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి రావడం దురదృష్టకరం. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి పౌరుడి ఆకాంక్షే ఈ తెలంగాణ. ఆనాడు కేసీఆర్ ఉద్యమస్ఫూర్తి, ప్రొఫెసర్ జయశంకర్ మేధాశక్తి తెలంగాణ ప్రజలను ఆలోచింపజేసింది. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో తెలంగాణను సాధించుకున్నాం. గత పదేండ్లల్లో పెండింగ్ ప్రాజెక్ట్‌లను పూర్తి చేసుకొని వలసలను నివారించినం. బీడుభూములను సాగులోకి తెచ్చి ఆహార ధాన్యాల ఉత్పత్తిలో తెలంగాణను దేశంలోనే మొదటిస్థానంలో నిలిపి ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది.
– గుడిపల్లి నర్సింహారెడ్డి, కవి, నాగర్‌కర్నూల్
తెలంగాణ ఆవిర్భావ వేడుకల వేళ తెలంగాణ కవులు, కళాకారులను రేవంత్ సర్కార్ అవమానించింది. ప్రభుత్వం చర్యలు తెలంగాణ ఉనికిని ప్రమాదంలోకి నెట్టేలా ఉన్నాయి. బీఆర్ఎస్ హయాంలో కవులు, కళాకారులకు స్వర్ణయుగమని చెప్పవచ్చు. నేడు ఆ పరిస్థితి లేదు. అందుకు ఉదాహరణ కీరవాణితో తెలంగాణ రాష్ట్ర గీతానికి స్వరాలు సమకూర్చడమే. మొగులయ్య చెత్తబుట్ట పట్టుకొని పనికి వెళ్లే పరిస్థితిని తీసుకొచ్చింది కూడా ఈ ప్రభుత్వమే. ఇప్పటికైనా తెలంగాణ కవులు, కళాకారులకు గుర్తింపు ఇవ్వడంతోపాటు రాష్ర్టానికి తలమానికమైన చిహ్నాలను తొలగించొద్దు.
– రాందాసు, కవిరత్న బిరుదు గ్రహీత, కొల్లాపూర్
కేసీఆర్ సర్కారు ప్రవేశపెట్టిన తెలంగాణ లోగోలో కాకతీయ తోరణం, చార్మినార్ చిహ్నాలను కాంగ్రెస్ ప్రభుత్వం మార్చడం మంచి నిర్ణయం కాదు. అందెశ్రీ రాసిన రాష్ట్ర గీతాన్ని తీసుకోవడం శుభదాయకమే. దానికి కీరవాణి సంగీతం సమకూర్చడం తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నది. ఇక్కడున్న కవులు, కళాకారులు, సంగీత దర్శకులందరినీ అవమానించినట్లే. లోగోలు, గీతాలను మార్చే దానికంటే ప్రజల బతుకులను మార్చడంపై దృష్టి పెడితే బాగుండు. లోగోలను మార్చినంత మాత్రాన ప్రజల బతుకులు మారవు. జనాలకు అవసమైన కనీస సౌకర్యాలు, విద్య, వైద్య, ఆరోగ్య విషయంలో చిత్తశుద్ధితో వ్యవహరించినప్పుడే ప్రజామార్పు సాధ్యమవుతుంది.
– ఎదిరేపల్లి కాశన్న, కవి, నాగర్‌కర్నూల్