వనపర్తి, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ) : పేరుగొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లుంది కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు. అన్నం పెట్టే రైతన్నకు భరోసా ఇవ్వడంలో మీనమేషాలు లెక్కిస్తున్నది. అధికారం చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలోని రైతులకు ఏనాడు పెట్టుబడి సాయం సక్రమంగా ఇచ్చింది లేదు. వానకాలం, యాసంగి సీజన్ల ప్రారంభంలోనే అందించాల్సిన సాయం ఇవ్వకుండా జాప్యం వహించడంతోపాటు సమయానుకూలంగా ఇవ్వడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. అది కూడా కొందరికే అందించి చేతులు దులుపుకోవడం రేవంత్ సర్కారుకు అలవాటుగా మారింది. ప్రస్తుత 2025-26 యాసంగి సీజన్లో వాయిదాల పద్ధతిలో రైతు భరోసాను అమలు చేయడంతో అన్నదాతలు విస్తుపోతున్నారు. మొదటి విడుత అంటూ ఎకరానికి మాత్రమే రూ.6 వేలు జమ చేసింది. ఇక రెండో విడుతలో మరో ఎకరానికి ఇస్తామని ప్రకటించింది. ఇలా విడుతల వారీగా అంటూ కాలయాపనతో ఎగనామం పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
వనపర్తి జిల్లాలో ఈ యాసంగిలో 2,55,284 ఎకరాల్లో వివిధ పంటలను రైతులు సాగు చేశారు. వీటిలో ప్రధానంగా వరి 2,08,071 ఎకరాల్లో సాగు కాగా మొక్కజొన్న, వేరుశనగ, జొన్న, పెసర, కంది తదితర పంటలను కూడా యాసంగిలో వేసుకున్నారు. ఇలా యసంగి సాగు లెక్క ప్రకారం రూ.153కోట్లకు పైగా రైతు భరోసా రావాల్సి ఉంది. అయితే కేవలం ఎకరా చొప్పున ఇప్పటి వరకు రూ.86కోట్ల మాత్రమే రైతుల ఖాతాల్లో జమ అయినట్లు రికార్డులు చెబుతున్నాయి. జిల్లాలో రైతు భరోసా లబ్ధిపొందే రైతులు 2,00,644మంది ఉన్నట్లు అంచనా ఉంది. ఇందులో కేవలం 1,77,987మంది రైతులకు ఎకరా చొప్పున బ్యాంకుల్లో పెట్టుబడి సాయం పడింది. యాసంగి సీజన్ పూర్తి కావస్తున్నా రెండో విడుత డబ్బులపై రైతుల్లో అనుమానం తలెత్తుతుంటే, ఇక మూడో విడుత దేవుడెరుగు అన్నట్లుంది.
జిల్లాలో ఉన్న రైతుల లెక్కను పరిగణలోకి తీసు కుంటే..ఇంకా 22,657మంది రైతులకు ఎకరా చొప్పున కూడా రైతు భరోసా అందని వారున్నారు. వీరికి ఎందుకు రాలేదు..ఎప్పుడు వస్తుంది..అసలు వస్తుందా అన్న భరోసా కూడా లేకుండా పోయింది. జిల్లా వ్యవసాయ కార్యాలయంలో రైతు భరోసా వివరాలు వెల్లడించేందుకు అధికారులు సహితం వెనకాడుతున్నారు. జిల్లాలో మొత్తం 2,00,644మంది రైతులున్నారు. ఈ లెక్కన ఎకరా చొప్పున రైతు భరోసా అందుకున్నది 1,77,987మంది రైతులు. ఈ లెక్కన ఇంకా చాలా మంది మిగిలిపోవడంతో ఎటూ తేలని పరిస్థితి నెలకొన్నది.
రైతుల సంక్షేమ పథకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం గండికొడుతున్నది.అధికారం చేపట్టిన అనంతరం రూ.2 లక్షలోపు రుణాలను మాఫీ చేస్తామని చెప్పి అరకొరగా చేసి చేతులెత్తేసింది. ఇప్పటికి వందలాది మంది రైతులు రుణమాఫీని అందుకోని వారు జిల్లాలో కోకొల్లలుగా ఉన్నారు. కొన్ని బ్యాంకుల్లో ఆధార్ కార్డులు, బ్యాంకు ఖాతా నెంబర్లు సరిగా లేవనే నెపంతో ఎగనామం పెట్టింది. రెండు బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారని, రూ.2 లక్షలు రుణం దాటిందన్న పేర్లతో అనర్హులుగా చేసి తల్లిదండ్రులు, పిల్లల మధ్య తగవును పెట్టింది. ఇక రైతు భరోసా పథకం చూస్తే…గడిచిన రెండున్నరేళ్లుగా ఎలా అమలు జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సింది లేదు. ఒక ఎకరానికి మాత్రమే రైతు భరోసా ఇచ్చి కొత్త విధానానికి తెరలేపింది. గత మార్చి నెలలో ఓ బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి రైతు భరోసా నిధుల విడుదల చేస్తున్నామని గొప్పగా ప్రకటించి…ఎకరా చొప్పున మాత్రమే రైతు భరోసా డబ్బులు వేసి తీరా తుస్సు మనిపించారు.
గత కేసీఆర్ ప్రభుత్వంలో రైతు బంధును ఏకబిగిన ఒకేసారి రైతుల ఖాతాల్లో జమ చేసి అన్నదాతలకు బాసటగా నిలిచారు. ఒకటి కాదు..రెండు…ఏకంగా 13 సార్లు కోట్లాది రూపాయలను చెప్పిన సమయానికి ఠంఛన్‌గా వేసి రైతులను ఆదుకున్నారు. పెట్టుబడి సాయం అంటే..సేద్యానికి ముందు అవసరమైన ఎరువులు..విత్తనాలకు అందేలా రైతుబంధును బీఆర్ఎస్ ప్రభుత్వం అందించింది. ఇలా సీజన్ల
వారీగా రూ.2305 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసింది. ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు పంపిణీ చేస్తున్న తీరును చూసి గతంలో కేసీఆర్ చేసిన సాయాన్ని రైతులు పదే.. పదే గుర్తు చేసుకుంటున్నారు.
గొప్పగా వాగ్ధానాలు చేసి రైతులకు ఆశలు కల్పించిన కాంగ్రెస్ సర్కారు రెండున్నర ఏండ్లలో వ్యవహరించిన తీరుపై రైతుల్లో అసహనం వ్యక్తమవుతున్నది. ఒకవైపు రైతులకు సరిపడా యూరియా ఇవ్వకపోవడం, కొత్త యాప్‌లను అందుబాటులోకి తేవడంతో యూరియా సరఫరాలో తీవ్ర జాప్యం జరుగుతుంది. రైతులకు ఇష్టంలేని యాప్ వ్యవస్థను బలవంతంగా రుద్దడాన్ని అన్నదాతలు ఏమాత్రం సమర్థించడం లేదు. ఇక యాసంగి సీజన్లో ఇప్పటి వరకు కొనుగోళ్ల ఊసే లేదు. అంతా గందరగోళం..అయోమయం అన్నట్లు
కాంగ్రెస్ సర్కారు వ్యవహార శైలి రైతుల విష యంలో బయటపడింది. ఈ క్రమంలో ఇటీవల జిల్లాలోని గొల్లపల్లి-చీర్కపల్లి రిజర్వాయర్ ప్రతిపాదనకు వ్యతిరేకంగా రైతుల డిమా ండ్‌పై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఓ సభను నిర్వహించడం, దీనికి భారీగా రైతులు తరలిరావడం చూస్తే.. ప్రభుత్వ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అర్థమ వుతుంది.
రైతు భరోసా ఇస్తాడన్న నమ్మకం పోయింది. ఇదిగో వచ్చే..అదిగో అంటూ చెప్పడమే తప్పా ఒక్కమాట నిజం లేదు. ఈ సర్కారులో నాలుగు సీజన్లు అవుతుంది. ఒక్క సీజన్ కూడా రైతులకు రాలేదు. నిధులు జమ అయ్యాయంటూ ప్రచార ఆర్భాటమే తప్పా వేయడం లేదు. నేను యాసంగిలో 5ఎకరాల్లో వరి నాటుకున్న. బోరు ఆధారంగానే సాగు చేసుకున్నా. కరెంట్ కనీసం 9గంటలు కూడా సక్రమంగా రావడం లేదు. కేవలం ఎకరాకు మాత్రమే రైతు భరోసా వచ్చింది. 20 రోజులన్నడు.. ఇంకా ఎప్పుడు వస్తుందో అయోమయం.
– బాబురెడ్డి, రైతు, కొత్తకోట, వనపర్తి జిల్లా
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతుభరోసా గందరగోళం ఉంది. ఎన్నికలకు ముందు చెప్పింది సీజన్‌కు రూ.7500 అన్నాడు. మూడు సీజన్లు ఎగనామం పెట్టిండు. ఓట్లు ముందు చూసి అది ఇది అంటూ ఆశలు కల్పించడమే అన్నట్లుంది. ఎకరాకు వేసిండు. ఏం చెప్పిండు…ఏం చేస్తున్నడో ఆయనకే ఎరుక కావాలే. రైతులను మాత్రం బాగా ఇబ్బంది పెడుతున్నడు. ఎకరాకు రూ.6వేలు మాత్రమే వేసిండు. నాకు 5 ఎకరాల పొలం ఉండగా, మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని వరి నాటుకున్న. ఇప్పడైనా వస్తే కోతల ఖర్చులకు వస్తుండే. పాపం పుణ్యం ఆయనకే తెలువాలే. రైతు భరోసా ఏమిస్తరో ఏమో నమ్మకం పోతుంది.
– శేఖర్, రైతు, బుద్ధారం, గోపాల్పేట మండలం
జిల్లాలోని రైతులందరికీ రైతు భరోసా వస్తుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రతి రైతుకు ఎకరా చొప్పున రూ.6వేలు బ్యాంక్ అకౌంట్లో జమ అయ్యాయి. మిగితా వాటిని త్వరలోనే వేసే అవకాశం ఉంది. మరో రెండు, మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు పడతాయి. జిల్లాలోని రైతులందరికీ తప్పనిసరి రైతుభరోసా అందుతుంది. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన మరుక్షణమే రైతు అకౌంట్‌కు నేరుగా జమ అవుతాయి. జిల్లాలో మొత్తం 2,00,644 మంది రైతులున్నారు. ఇప్పటివరకు 1,77,406 మంది రైతులకు ఎకరాకు రూ.6వేల చొప్పున పడ్డాయి.
– ఆంజనేయులు, జిల్లా వ్యవసాయ అధికారి, వనపర్తి