కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం జూరాల ఆయకట్టు రైతుల పాలిటశాపంగా మారింది. వానకాలం పంటలు అంతంతమాత్రంగా రాగా, కనీసం యాసంగిలోనైనా కలిసొస్తుందనుకున్న కాలం కన్నీళ్లను మిగిల్చింది. జూరాల ప్రధాన ఎడమ కాల్వ కింద వరి పంటలు ప్రమాదంలో పడ్డాయి. ఇంకా రెండు లేదా మూడు తడుల నీటి విడుదల జరిగితే తప్పా పంట చేతికి అందని పరిస్థితి లేదు.
వారబందీ పేరుతో నీటి విడుదల చేస్తున్న ఇరిగేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయడంలేదు. ఇక మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ రైతులు తిరుగుతూ నీటిని విడుదల చేయించాలంటూ ప్రదక్షిణలు చేస్తున్నారు. చివరకు కలెక్టరేట్లోని ప్రజావాణి నుంచి హైదరాబాద్లో నిర్వహించే ప్రజాభవన్ వరకు సాగునీటి విడుదల చేయాలని రైతులు వెళ్లి వినతులు ఇస్తున్నారంటే పరిస్థితులు ఎంతవరకు చేరుకున్నాయో రైతులపట్ల సర్కారుకు ఉన్న శ్రద్ధ ఇట్టే తెలిసిపోతున్నది.
– వనపర్తి, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ)
వనపర్తి జిల్లా పరిధిలోని జూరాల ప్రధాన ఎడమ కాల్వ కింద సాగైన వరి పంటలు ప్రమాదపుటంచున ఉన్నాయి. ఇంకా మూడు తడులు నీటి విడుదల జరిగితే వంద శాతం, రెండు త డులు నీటిని విడుదల చేస్తే 80 శాతం పంటలు చేతికి వచ్చే అవకాశముందని అన్నదాతలు అంచనా వేస్తున్నారు. లేదంటే భారీగా జూరాల ఆయకట్టు కింద వేసిన వరి పంటలే ఎండి పోవడానికి సిద్ధంగా ఉన్నాయి.
ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో నీటిశాతం ఆశాజనకంగా లేదు. ఎగువ నుంచి ఆశించినంత నీరు జూరాలకు రాకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. మంత్రుల బృందం కర్నాట కు వెళ్లినప్పుడు చెప్పిన 4 టీఎంసీల నీటి విడుదలైనా చేసి ఉంటే ఈ దుస్థితి ఉండేది కాదు. కేవలం ప్రచారం కోసం అన్నట్లుగా వెళ్లి వచ్చారే తప్పా నీటివిడుదల చేయిచండంలో పూర్తిగా కాంగ్రెస్ సర్కార్ విఫలమైంది. అరకొరగా ఒక టీఎంసీ నీరు వచ్చిందని చె బుతున్నా ఏమూలకు సరిపోవడం లేదు. ఈ పరిస్థితి వల్లనే ఇప్పుడు జూరాల ఆయకట్టు రైతులు అవస్థలు పడుతున్నారు.
జూరాల ప్రాజెక్టు పరిధిలోని ఎడమ కాల్వ కింద 5వేల ఎకరాల వరి చేలు నీరందక ప్రమాదంలో పడుతున్నాయి. రామన్పాడ్ రిజర్వాయర్ నుంచి విడుదల చేయాల్సిన నీటిని పూర్తిగా నిలిపి వేయడంతో ఆయకట్టు భూములకు నీరందని పరిస్థితి ఏర్పడింది. పె బ్బేరు మండలం వైశాగాపురం, రామాపురం, కొత్తూరు, పామాపురం, రంగాపురం, బున్యాదిపురం పరిధిలోని జూరాల ఆయకట్టు భూములకు నీరందక పోవడంతో చేతికందే దశలో ఇరకాటంలో పడ్డాయి. కనీసం రెండు తడులైనా విడుదల చేస్తే తప్పా ఈ పం టలు చేతికి రావు. ఇందుకు రైతులు చేయని ప్రయత్నమంటూ లే దు. పెద్దరోగమొస్తే.. కనిపించిన దేవుడికి మొక్కినట్లుగా జిల్లాలో ఎక్కడైనా మంత్రులు, ఎమ్మెల్యేలు పర్యటిస్తున్నారంటే రైతులు ప రుగులు తీసి నీటి విడుదల చేయించాలని మొరపెట్టుకున్నారు.
లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన తమ పంట పొలాలు ప్రమాదంలో పడుతున్నాయని తెలిసి రైతులు వినతుల బాట పట్టారు. కలెక్టరేట్లోని ప్రజావాణి నుం చి హైదరాబాద్ ప్రజాభవన్లో నిర్వహించే ప్రజాదర్బార్ వరకు వెళ్లి రైతులు వినతులు చేస్తున్నారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిని కలిసి వినతి పత్రం ఇచ్చిన రైతులు అటు నుంచి రాష్ట్ర కార్యదర్శి శాంతకుమారిని కలిసి సాగునీటి విడుదలకు మొర పెట్టుకుంటున్నారంటే సాగునీటి దీనస్థితి అర్థమవుతుంది.
అయినా.. ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు. పరిస్థితి చేయిదాటి పోతుంటే చూడలేని రైతులు కొన్ని చోట్ల ష్వెటర్స్ను బలవంతంగా తీసి నీటిని తీసుకెళ్తున్నారు. మంగళవారం ప్ర జాభవన్కు వెళ్లి రాష్ట్ర కార్యదర్శిని కలిసి రైతులు రెండు తడుల వర కు నీటిని విడుదల చేయక పోతే తాము తీవ్రంగా నష్టపోతామని మొరపెట్టుకున్నారు. కర్ణాటక అధికారులతో మాట్లాడి నీటి విడుదల చేయిస్తామని కార్యదర్శి చెప్పినా ఇప్పటి వరకు స్థానిక ఇరిగేషన్ అధికారులు స్పందించడం లేదని రైతులు వాపోతున్నారు.
సాగునీటి విడుదలకు మంత్రులు,ఎమ్మెల్యేల దగ్గరకు రైతులు గంపెడాశతో పరుగులు తీస్తున్నారు. తీరా అక్కడికి వెళ్లిన అనంతరం రైతులకు చుక్కెదురవుతుంది. ఎందుకు పంటలు వేశారని, ముందే నీళ్లు రావని అధికారులు చెప్పడం జరిగిందని.. ఇప్పుడు నీళ్లు కావాలంటే ఎక్కడి నుంచి తెచ్చేదంటూ చెబుతున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. రైతుల ఒత్తిడిమేరకు బలవంతంగా ఓ ఫోన్ చేసినా అది ఏమాత్రం ఫలప్రయోగం కావడం లేదు. చివరకు రైతుల కంట పడకుండానే జారుకోవాలనే ప్రయత్నంలో ఎమ్మెల్యేలు, మంత్రులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈనెల రోజులు సాగునీటి తాకిడి ఉందని, రైతులకు ఎలాంటి సమాధానం చెప్పినా ప్రయోజనం ఉండదని గ్రహించిన ప్రజాప్రతినిధులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. రామన్పాడ్ రిజర్వాయర్లో నీటిమట్టం ఆశాజనకంగా ఉందని, కనీసం ఒక్క తడికైనా నీటి విడుదల చేయించండి మహాప్రభో అంటే ఏ ఒక్కరు రైతుల కోసం ప్రయత్నించడం లేదని వాపోతున్నారు.
ఎక్కడికక్కడ జూరాల ఆయకట్టు పొలాలే ఎండిపోయే దశలో ఉండగా ఇరిగేషన్ అధికారుల జాడ మాత్రం కనిపించడం లేదు. ఏఈల నుంచి ఎస్ఈల వరకు హైదరాబాద్ నుంచి ఆపరేషన్ చేస్తున్నారన్న విమర్శలు వెలువడుతున్నాయి. వారంలో రెండు రోజులు ఇక్కడ కనిపించినట్లు చేసినా.. మళ్లీ ఆఫీసు పనంటూ హైదరాబాద్లోనే మకాం పెడుతున్నట్లు రైతులు గోసపడుతున్నారు. ఇంత దయనీయమైన పరిస్థితిలో రైతులు కాకవికలమవుతుంటే క్షేత్రస్థాయిలో పరిశీలన.. పర్యవేక్షణ చేయాల్సిన సాగునీటి అధికారులు రైతులకు కనిపించకుండా తిరగడం విచారకరం. అటు ప్రజా ప్రతినిధులు, ఇటు ఇరిగేషన్ అధికారులు ఎవరికి వారు అన్నట్లుగా వ్యవహరిస్తుండడంతో యాసంగిలో పంటలు సాగు చేసిన రైతులు దిక్కులేనివారైనట్లు కనిపిస్తుంది. మొన్నటిదాకా బోరు, బావుల కిందనే యాసంగి పంటలు ఎండిపోతున్నాయని భావించిన క్రమంలో ఇప్పుడు జూరాల ఆయకట్టు కింద కూడా ఇలాంటి పరిస్థితి రావడం ఆందోళన కల్గిస్తుంది.
నేను 50 ఎకరాల వరకు వరి శిస్తు చేసిన. కాల్వ నీరే ఆధారం. ఒక్క బోరుకానీ, బావి కానీ లేదు. కాల్వ నీళ్లు రాకుంటే మొత్తం ఎండిపోతుంది. ఇంకా మూడు తడులు కావాలి. లేకుంటే నా చేను చేతికి రాదు. రైతుల పరిస్థితిని అధికారులు, ఎమ్మెల్యేలు అర్థం చేసుకోవాలి. ఇంత ఘోరమైన పరిస్థితులుంటే.. మా పొలాలను ఎవరు చూడడం లేదు. కాల్వల కింద పంట పొలాలు ఎలా ఉన్నాయో చూడడానికి ఎవరు రావడం లేదు. చివరకు రైతులనే వాళ్ల దగ్గరకు తిప్పుకుంటున్నారు. ఎంత చెప్పినా చూద్దాం చేద్ధాం అంటున్నారు. కానీ, నీరు రావడం లేదు. రామన్పాడ్ రిజర్వాయర్ నుంచి నీటి విడుదల చేయించి మా పంటలను కాపాడండి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రభుత్వం మా పంటలను కాపాడాలి.
– సత్యారెడ్డి, రంగాపురం, పెబ్బేరు మండలం
నేను 7 ఎకరాలు వరి శిస్తు చే సిన. జూరాల కాల్వ నీరే మాకు ఆ ధారం. వారబందీ అని చెప్పి నీటి విడుదల చేయడం లేదు. చేనంతా చేతికి వచ్చింది. నీరులేక మూడు ఎకరాలు ఎండి పోతుంది. ఇంకా నాలుగు ఎకరాలు అట్లట్ల ఉంది. నీ రు రాకుంటే అది కూడా పోతుంది. ఒక బావి గుంత ఉంది. దాని ద్వారా ఒక ఎకరా పండే అవకాశముంది. ఆరెకరాలు కాల్వ నీరు రాకుంటే సర్కారు పుణ్యామా అని సమర్పయామి అవుతుంది. పె ట్టుబడులు, మా కష్టం అన్ని వృథా అవుతాయి.
– గోకారి, రైతు, రాంపురం, పెబ్బేరు మండలం
కనీసం రెండు తడుల వరకు నీరు రాకుంటే చాలా నష్టపోతం. 20 ఎకరాలు జూరాల కాల్వను నమ్మి వరి నాటాం. ఒక బావి ఉన్నా.. పొలం మొత్తానికి అందదు. అధికారులు, ఎమ్మెల్యే, మంత్రులను అందరికీ మొర పెట్టుకుంటున్నాం. చూస్తాం..చేస్తాం అంటున్నారు కానీ, నీరు మాత్రం రావడం లేదు. ఆశతో సాగు చేసినం. చివరి దశలో ఉన్నాయి. ఎమ్మెల్యేలు, మంత్రులు చొరవ తీసుకుని నీటి విడుదల చేయించాలి. లేకుంటే మా బతుకులు చిత్తలేవిడి అవుతాయి. గతంలో ఎప్పుడు ఇంతటి విపత్కర పరిస్థితిని రైతులు ఎదుర్కొంటున్నారు.
– శివరాజు, రైతు, రంగాపురం, పెబ్బేరు మండలం