గద్వాల, అక్టోబర్ 12 : వానకాలంలో రైతులు పండించిన వరి ధాన్యం దళారులకు అమ్మి నష్టపోకూడదని ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నది. రైతులు పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవడానికి చర్యలు చేపట్టింది. ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఈ వానకాలం రైతులు పండించిన పంటకు క్వింటాకు రూ. 500 బోనస్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
వాస్తవంగా 2024 యాసంగి సీజన్లోనే రైతులు పండించిన పంటకు బోనస్ ఇవ్వాల్సి ఉండగా ప్రభుత్వం ఇవ్వకుండా మొండి చేయి చూపించింది. 2025 యాసంగికి సంబంధించి ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో బోనస్ జమచేయక పోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఈ వానకాలం సీజన్‌కు సంబంధించి ఈ నెల మూడో వారంలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి ఆదేశాలు ఇవ్వడంతో ఆ దిశగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
జిల్లాలో సాగు నీరు పుష్కలంగా ఉండడంతో రైతులు పత్తి తర్వాత వరి పంటను ఎక్కువ మొత్తంలో సాగు చేస్తారు. గత వానకాలం సీజన్లో వర్షాలు సక్రమంగా కురువక పోవడంతో జిల్లాలో వరి సాగు తక్కువ మొత్తంలోనే రైతులు సాగు చేశారు. గత వానకాలం సీజన్లో జిల్లాలో 86,119 ఎకరాల్లో రైతులు వరి పంట సాగు చేశారు. ఈ వానకాలం సీజన్లో వర్షాలు సమృద్ధిగా కురువడంతో రైతులు 96,857 ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. అధికారుల అంచనా ప్రకారం సన్నరకం 2,59,776 మెట్రిక్ టన్నులు, దొడ్డురకం 3120 మెట్రిక్ టన్నుల మొత్తం 2,62,397 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు లెక్కలు చెబుతున్నాయి.
వానకాలం అం చనా దిగుబడిలో 75శాతం అంటే 1,96,798 మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల నుంచి సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తం దిగుబడిలో 25 శాతం స్థానిక అవసరాలకు పోను మిగిలిన ధాన్యం మొత్తం సేకరించడానికి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. వానకాలం సీజన్‌కు సంబంధించి వరిధాన్యానికి కేంద్రం మద్దతు ధరను ఏ-గ్రేడ్ రకానికి రూ.2,369, సాధారణ రకానికి క్వింటాళ్లకు రూ.2,300 కొనుగోలు చేయాలని నిర్ణయించింది. దీంతో పాటు తెలంగాణ ప్రభుత్వం సన్నాలకు క్విం టాకు రూ.500 బోనస్ ప్రకటించడంతో రైతులకు ఇది ఊరట నిచ్చింది.
రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం 88 కేంద్రాలు ఏర్పాటు చేయనుండగా డీఆర్డీఏ ఆధ్వర్యంలోని ఐకేపీ కేంద్రాల ద్వారా 70, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 13, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో 5 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సీజన్లో మొత్తం 65లక్షల గన్నీ బ్యాగులు అవసరం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం జిల్లాలో 8లక్షల గన్ని బ్యాగులు అందుబాటులో ఉన్నాయి.