నాగర్‌కర్నూల్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనకు శ్రీకారం చుట్టింది. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో ఈనెల 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు గ్రామస్థాయి సభలు నిర్వహించనున్నది. దీనికోసం ప్రత్యేక అధికారులను నియమించింది. కాగా ఇందులో ఆరు గ్యారెంటీలు అయిన మహాలక్ష్మి పథకం, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం, చేయూత, రైతుభరోసా పథకాలతోపాటుగా రేషన్ కార్డులకు సైతం దరఖాస్తులను స్వీకరించనున్నది. ఈ ప్రక్రియ జిల్లా ఇన్చార్జి మంత్రిగా నియమితులైన, వైద్యఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలో ఉమ్మడి పాలమూరులోని కలెక్టర్లు వైస్ చైర్మన్లుగా కొనసాగనుంది. దీంతో గ్రామాలు, పురపాలికల్లో పది రోజులపాటు సందడి నెలకొననున్నది. ఎన్నికల హామీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ స ర్కారు శ్రీకారం చుడుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో ఈనెల 28వ తేదీ నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించనున్నది. ఇందులో భాగంగా ఆరు గ్యారెంటీల అమలు కోసం గ్రా మాలు, పురపాలికల్లోని వార్డుల వారీగా సభలు నిర్వహించనున్నారు. ఇందులో అర్హులైన పేదల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. దీనికోసం ఇప్పటికే ఆయా గ్రా మాలు, మండల, డివిజన్ స్థాయిలో ప్రత్యేక అధికారులను నియమించింది. ప్రతి బృందంలో తాసీల్దార్ లేదా రెవెన్యూ అధికారి, ఎంపీడీవో లేదా ఆ శాఖ అధికారి, వ్యవసాయ, పౌరసరఫరాలు, వైద్య, విద్య, విద్యుత్, పంచాయతీ, పురపాలిక తదితర శాఖల అధికారులు ఉంటారు. జిల్లా ఇన్చార్జి మంత్రిగా నియమితులైన వైద్యఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆ ధ్వర్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లు వైస్ చైర్మన్లుగా గ్రామ పరిపాలనను పర్యవేక్షిస్తారు.
దీనికోసం డిసెంబర్ 31, జనవరి 1వ తేదీ మినహాయించి ప్రతిరోజూ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 6 గంటల వరకు అధికారులు ప్రజలకు అం దుబాటులో ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నమూనాల ప్రకారం దరఖాస్తులను స్వీకరించి, ర శీదులను ఇస్తారు. సభలపై ముందే టాంటాం నిర్వహించేలా కలెక్టర్లు ఆదేశించడం జరిగింది. సభల వివరాల ను ప్రతిరోజూ ప్రభుత్వానికి ఆన్లైన్ ద్వారా నివేదించా ల్సి ఉంటుంది. ఉమ్మడి పాలమూరులో 19పురపాలికలు, 1,692గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మహిళలకు రూ.2500 అందించే మహాలక్ష్మి పథకానికి 7.21 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇక 5.55లక్షల గ్యాస్ కలెక్షన్లు ఉన్నాయి. అలాగే 9లక్షల మందికిపైగా రైతులు ఉన్నారు. ఇక ఇండ్ల కోసం 9లక్షల మంది ఎదు రుచూస్తున్నారు. చేయూత పథకంలో 4లక్షల మంది పింఛన్‌దారులు లబ్ధిపొందుతున్నారు. ఈ ఆరు గ్యారెంటీలను రాబోయే ఆరు నెలల్లో అమలు చేసేలా ఆయా జిల్లాల అధికారులు చర్యలు తీసుకోనున్నారు. ప్రభు త్వం ఇప్పటికే రెండు గ్యారెంటీలైన ఆర్టీసీ బస్సుల్లో మ హిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తుండగా రోజుకు 80వేల మంది మహిళలు ప్రయాణిస్తున్నారు. ఇక రూ. 10లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డులను 9.50లక్షల మం దికి అందించనున్నారు. ఈ కార్డుల ద్వారా ప్రతి సంవత్సరం 30వేల మంది పేదలు దవాఖానల్లో వివిధ రకాలకు చికిత్సలు తీసుకొంటున్నారు. ఇలా ఆరు గ్యారెంటీల అమలుకు దరఖాస్తులను స్వీకరించడంతోపాటుగా రేషన్ కార్డులకు కూడా ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకోనున్నారు. ఉమ్మడి పాలమూరులో 9.34లక్షల దరఖాస్తులుండగా ఇప్పటికే కొత్తకార్డుల కోసం 20వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. ఇంకా వేలాది మంది ఎదురు చూస్తున్నారు. ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి హామీల అమలు కోసం చేపట్టిన చర్యలతో ప్రజల్లో ఆనందం నెలకొన్నది.
మహాలక్ష్మి పథకం కింద ప్రతినెలా రూ.2,500 ఆర్థిక సాయం
మహాలక్ష్మి పథకం కింద రూ.500కే సిలిండర్ పంపిణీ
గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఇంటి స్థలం, ఇంటి నిర్మాణం కోసం రూ.5లక్షల సాయం
యువ వికాసంలో భాగంగా రూ.5లక్షల విద్యాభరోసా కార్డులు
చేయూత పథకం కింద రూ.4 వేల పింఛన్
వ్యవసాయ పెట్టుబడుల కోసం సంవత్సరానికి రూ.15వేలు అందించే రైతు భరోసాకు అలాగే కొత్తగా రేషన్ కార్డుల మంజూరుకు కూడా దరఖాస్తులు స్వీకరిస్తారు.
సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో నేటి నుంచి గ్రామసభలు నిర్వహిస్తాం. ఇప్పటికే గ్రామ, మండల, డివిజన్‌స్థాయిలో అధికారుల ని యామకం పూర్తైంది. ప్రతిరోజూ గ్రామాలు, మున్సిపాలిటీ వార్డుల్లో జనవరి 6 వరకు సభ లు జరుగుతాయి. అధికారులంతా గ్రామాల్లోనే ఉంటారు. ప్రజలు ఇండ్లు, పింఛన్లు, సిలిండర్, ఉచిత విద్యుత్, రూ.2500 సాయం, రైతుభరోసా, రేషన్‌కార్డుల కోసం గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవాలి. సభల అనంతరం లబ్ధిదారులను గుర్తించి పథకాలను అమలు చేసేలాచర్యలు తీసుకుంటాం.