‘మా పార్టీలోకి రా.. నీకు మంచి భవిష్యత్ ఉంటది.. ముడా చైర్మన్, మార్కెట్ చైర్మన్, గ్రంథాలయ చైర్మన్లను చేస్తా’.. అంటూ ఓ ముఖ్య నేత..
పార్టీ మారితే మీ డివిజన్లో ఫండ్స్ ఇస్తా.. సంపాదించుకో.. ఇప్పుడు సంపాదించకుంటే ఇంకెప్పుడు సంపాదిస్తావ్.. మా ఎమ్మెల్యేతో మాట్లాడి అన్ని సెట్ చేస్తా’ అంటూ మరో చోట నేత..
రారా బై.. వేపూర్‌లో ఇసుక మస్తుంది.. ఒక టిప్పర్‌కు రూ.10 వేలు వస్తాయి.. లీడర్లతో మాట్లాడి నేను అన్ని చూసుకుంటా.. ఆ పార్టీలో ఉండి ఏం లాభం ఈ పార్టీలోకి రా’.. అంటూ ఓ సీఐ..
మహబూబ్‌నగర్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రస్థాయిలో మీకు మంచి గుర్తింపు ఇస్తాం.. అంటూ ఒకరికి.. నీ దందాలన్నీ చేసుకో పోలీసులకు చెప్పి సహకరిస్తాం.. అంటూ మరికొందరికి అధికార పార్టీ నేతలు ఆఫర్లు ఇస్తున్నారు. ఇదంతా మహబూబ్‌నగర్ కార్పొరేషన్లో ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. గత కొన్నాళ్ల నుంచి బీఆర్ఎస్కు చెందిన 16 మంది కార్పొరేటర్లకు ముఖ్య నేతలతోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫోన్లు చేసి బేరసారాలకు దిగడం సంచలనాత్మకంగా మారింది. ఇదిలా ఉండగా అధికార పార్టీ అండదండలతో ఓ సీఐ ఏకంగా ఓ కార్పొరేటర్‌ను పిలిచి.. ‘ఆ పార్టీలో ఉండి ఏం లాభం.. హన్వాడ మం డలం వేపూరులో ఇసుక దందా చేసుకో.. అన్నీ నేను దగ్గరుండి సెట్ చేస్తా.. నేను మాట్లాడతా’.. అంటూ బం పర్ ఆఫర్ ఇచ్చారు. పార్టీలోకి రాకపోతే ఫండ్స్ ఇవ్వమని.. పోలీసులతో చెప్పి కేసులు నమోదు చేయిస్తామ ని బెదిరింపులకు కూడా దిగుతున్నారు. ఈ వ్యవహారం రాజకీయ దుమారం లేపుతోంది. ఈ వ్యవహారాన్ని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో అధికార కాంగ్రెస్ పార్టీ నేతల బం డారాన్ని బయటపెట్టారు. మా కార్పొరేటర్లను బెదిరిస్తే బెదరమని.. మా జోలికొస్తే మేము ఏం చేయాలో అది చేసి చూపిస్తామని అల్టిమేటం ఇచ్చారు. ఈ వ్యవహారం అధికార కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌కు ఇటీవల ఎన్నికలు జరగగా 60 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ కేవలం 28 డివిజన్లను కైవసం చేసుకున్నది. మ్యాజిక్ ఫిగర్‌కు నాలుగు స్థానాలు తక్కువ పడగా.. ఇటు ఎంఐఎం అటు ఇండిపెండెంట్లను కలుపుకొని మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను కైవసం చేసుకున్నది. ఇదిలా ఉండగా మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల ఎంపిక ఆ పార్టీలో చిచ్చు రేపింది. మేయర్ పదవి ఆశిస్తున్న కొందరు డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఆ పార్టీ నేతలు పోలీసులకు పట్టించి నిర్బంధించారు. అధిష్టానం సీల్డ్ కవర్ ఇవ్వకుండానే తమకు ఇష్టం వచ్చిన వాళ్లను మేయర్ డిప్యూటీ మేయర్ పదవులకు ఎంపిక చేశారు. కాంగ్రెస్ పార్టీలో కార్పొరేటర్లు నివురు గప్పిన నిప్పులా ఎడమొహం.. పెడమొహంలా ఉన్నారు. కార్పొరేషన్ పీఠం ఎక్కి రెండు నెలలు కాకముందే ఆ పార్టీలో విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. కొంతమంది కార్పొరేటర్లు పక్కచూపులు చూస్తున్నారు. ము ఖ్యనేతకు ఆయన అనుచరుడైన మరో నేతను బాహాటంగా ధిక్కరిస్తున్నారు. ఇటీవల జరిగిన తొలి సమావేశంలో ప్రొటోకాల్‌కు విరుద్ధంగా కాంగ్రెస్‌కు చెందిన డిప్యూటీ మేయర్ వ్య వహరించడంతో బీ ఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విరుకుపడి కౌన్సిల్ సమావేశాన్ని బై కాట్ చేశారు. అయితే ఈ విషయంలో అధికార పార్టీ చెందిన కార్పొరేటర్ ఎవరు కూ డా సపోర్ట్ చేయకపోవడంతో ఖం గుతిన్నారు. ఈ వ్యవహారంతో ఉక్కిరిబిక్కిరి అయినా ముఖ్యనేతతో పాటు మరో ఇద్దరు నేతలు బిగ్ స్కెచ్ వేశారు. దీంతో విపక్షాలను చీ ల్చాలని.. కొందరు తమ వైపునకు తిప్పుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు.
మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలో బీఆర్ఎస్కు చెందిన కార్పొరేటర్లకు సాక్షాత్తు ఎమ్మెల్యే శ్రీనివాస్‌రెడ్డి ఫోన్లు చేసి బేరసారాలకు దిగుతున్నారని పార్టీ నేతలు బయటపెట్టారు. ఓ కార్పొరేటర్‌కు ఫోన్ చేసి ‘నీకు పదవులు ఇస్తాం.. మంచి భవిష్యత్ ఉంది’.. అంటూ ప్రలోభాలకు దిగారు. మహబూబ్‌నగర్ కార్పొరేషన్లో అన్నీ ఉన్న విపక్షాలకు చెందిన కార్పొరేటర్లను ఎందుకు కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తున్నారూ..? అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది? అనేది చర్చనీయాంశంగా మారింది. మెజారిటీ సభ్యులు ఉన్నప్పటికీ.. బీజేపీకి చెందిన 8 మంది సభ్యులు అధికార పార్టీ సభ్యులు పోయినా.. బీఆర్ఎస్ను టార్గెట్ చేయడం వెనుక పెద్ద స్కెచ్ ఉందని అర్థమవుతోంది. ఎమ్మెల్యే అండదండలతో అందలమెక్కిన మేయర్, డిప్యూటీ మేయర్లు సొంత పార్టీ కార్పొరేటర్లనే నమ్మడం లేదన్నది ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు డీసీసీ అధ్యక్షుడు.. మేయర్ పదవి ఆశించిన ఆనంద్‌గౌడ్ ఒక్కటి కావడం.. పార్టీలో మరో బలమైన వర్గంగా ఏర్పడడం కూడా ఎమ్మెల్యే వర్గానికి షాక్‌నిస్తోంది. ఇటీవల జరిగిన సర్వాయి పాపన్నగౌడ్ జయంతి ఉత్సవాల్లో రెండు వర్గాలు పోటాపోటీగా నిర్వహించాయి. అయితే ఎమ్మెల్యే వర్గం వెళ్లినప్పుడు ఆ నాయకులు ఎవరూ లేకపోవడంతో ఆయన కంగుతున్నారు. అంతకుముందు డీసీసీ అధ్యక్షుడు మిగతా వారంతా అట్టహాసంగా జరిపితే.. మంది మార్బలంతో వెళ్లిన ఎమ్మెల్యే వర్గానికి చుక్కెదురైంది.
కాంగ్రెస్ పార్టీలో పదవులు దక్కని చాలామంది నేతలు అసంతృప్తితో ఉన్నారు. ఆ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన మైనార్టీ వర్గానికి ఒక్క పదవి కూడా ఇవ్వకపోవడం.. పాత కాంగ్రెస్ నాయకులకు పట్టించుకోకపోవడంతో చాలా మంది నిరుత్సాహంగా ఉన్నారు. దీంతో మహబూబ్‌నగర్ కార్పొరేషన్లో అసంతృప్తి వర్గానికి చెందిన కార్పొరేటర్లు ఎక్కువగా ఉండడంతో.. జరగబోయే సమావేశాలు అన్ని కూడా సవాల్‌గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లను టార్గెట్ చేయడం వెనుక పెద్ద స్కెచ్ ఉన్నది. బీఆర్ఎస్కు చెందిన కార్పొరేటర్లకు ఫండ్స్ ఇవ్వమని.. కేసులు పెడతామని.. బెదిరింపులకు దిగుతున్నారు. పార్టీ మారుతి పదవులు ఇస్తామని ఆశ చూపిస్తున్నారు. తమకంటూ ఒక వర్గంగా తయారు చేసుకోవాలని ఎమ్మెల్యే భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ప్రధాన విపక్షమైన బీఆర్ఎస్ను చీల్చాలని.. డబ్బులు, పదవులు, పనులు.. పోలీస్ యంత్రాంగాన్ని అడ్డంపెట్టి ఆశ చూపే ప్రయత్నం జరుగుతున్నది. ఇచ్చిన అధికారాన్ని నిలబెట్టుకోలేక ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక అభివృద్ధి పక్కనపెట్టి ఇతర పార్టీ కార్పొరేటర్లకు గాలం వేయడంపై ప్రజలు మండిపడుతున్నారు. సొంత పార్టీ నేతలను గాలికి వదిలేసి ఇతర పార్టీ నేతలకు అందలమెక్కిస్తామని అనడంపై గుర్రుగా ఉన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ఉంటే సీఎంకు పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తున్న ఎమ్మెల్యే యెన్నంను దూరం పెడుతున్నారని అనుకుంటున్నా తరుణంలోనే ప్రభుత్వ విప్ పదవి ఇవ్వడం.. మహబూబ్‌నగర్‌లో కూడా కార్పొరేటర్లు ధిక్కరిస్తే ఏదో ఒక పదవి ఇస్తారని అనుకుంటున్నారు. అందుకే విపక్ష కార్పొరేటర్లను టార్గెట్ చేస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌లోని తమ పార్టీ కార్పొరేటర్లకు ఎమ్మెల్యే ఇతర నేతలు ప్రలోభాలకు దిగుతున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పెద్ద బాంబే పేల్చారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని.. మీరు ఉండేది ఇంకా రెండేన్లే భయపడితే బెదిరేది లేదని.. బ్లాక్ మెయిల్‌కు మా కార్పొరేటర్లు లొంగరని తేల్చిచెప్పారు. ఎవరు ఎలా ప్రలోభాలకు దిగారు? ఏమేం ఆఫర్లు ఇచ్చారు..? ఏఏ పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారు? మొత్తం బయటపెట్టారు. ఈ పరిణామాలతో కాంగ్రెస్ పార్టీని ఓ కుదుపు కుదిపింది. అభివృద్ధి మంత్రంగా జపిస్తూ అధికార పార్టీ నేతలు చెబుతున్నవన్నీ వట్టి మాటలే అని తేలింది. ఇక మున్ముందు మరిన్ని అరాచకాలను బయటపెడతానని హెచ్చరికలు అధికార పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.