మహబూబ్‌నగర్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పచ్చని పొలాలను చరబట్టి ఫార్మా కంపెనీ పేరుతో రైతుల నుంచి భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ కుటీల నీతిపై రైతులు తిరగబడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గంలో కలెక్టర్‌తోపాటు కాడ స్పెషల్ ఆఫీసర్‌పై దాడి చేశారు. అడ్డొచ్చిన అధికారులపై రాళ్ల వర్షం కురిపిస్తూ వాహనాలను ధ్వంసం చేశారు. గ్రామస్తులు ఆగ్రహావేశాలకు ఉన్నతాధికారులు భయం తో పారిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని బొంరాస్‌పేట, దుద్యాల మండలాల్లో ఫార్మా కంపెనీలను ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ సమీపంలోని ఆమనగల్, కడ్తాల్, ఇబ్రహీంపట్నం సమీపం లో ఫార్మాసిటీ కోసం భూములు గుర్తించారు. ఇక్కడ అంతా ప్రభుత్వ భూములే ఉండడంతో రైతులు, ప్రజల నుంచి పెద్దగా వ్యతిరేకత రాలేదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఫార్మాసిటీ అక్కడి నుంచి మార్చింది. కొడంగల్ నియోజకవర్గం నుంచి గెలిచి ముఖ్యమంత్రి అయిన రేవంత్ తన నియోజకవర్గం లో ఈ ఫార్మాసిటీని ఏర్పాటుకు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ఇప్పుడిప్పుడే కరువు కాటకాలనుంచి బయటపడుతున్న కొడంగల్ నియోజకవర్గం పచ్చని పంటపొలాలతో కళకళలాడుతున్నది. కాయకష్టం చేసి బతుకుతున్న సన్న, చిన్నకారు రైతులే ఎక్కువ ఉన్నారు. వారి పొలాలే టార్గెట్‌గా ఈ ఫార్మాసిటీ కోసం సేకరించాల్సి రావడంతో ఆ కుటుంబాలు వీధినపడే పరిస్థితి ఏర్పడింది. దీన్ని జీర్ణించుకోలేని రైతులంతా ఫార్మాసిటీని గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. తమ ప్రాణా లు పోయినా పర్వాలేదంటూ దీన్ని ఏర్పాటు చేయవద్దని కోరుతున్నారు. సీఎం నియోజకవర్గం కావడంతో అధికార యంత్రాంగం హల్చల్ చేస్తోంది. పైగా కాంగ్రెస్ నేతలు కూడా భూములు ఇవ్వండి అంటూ దబాయిస్తున్నారు. ఇవ్వకపోతే ప్రభుత్వమే గుంజుకుంటుందని బెదిరిస్తున్నారు. వందలాది కు టుంబాలు రోడ్డున పడే పరిస్థితి రావడంతో వారం తా ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఫార్మా కంపెనీ పెట్టనీయమని భీష్మించు కూర్చున్నారు. అయితే సీఎం కార్యాలయం నుంచి ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభించి రైతులను ఒ ప్పించి భూములు తీసుకోవాలని ఆదేశాలొచ్చాయి.
తమ ప్రాణాలు పోయినా ఫార్మా కంపెనీలకు భూములు ఇవ్వమని రైతులు ఏకమయ్యారు. ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో సర్కారు చేస్తున్న కుటిలయత్నాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సోమవారం కలెక్టర్ ప్రతిక్ జైన్.. కాడ స్పెషల్ ఆఫీసర్ వెంకట్‌రెడ్డి, దుద్యాల, కొడంగల్ తాసీల్దార్లు మరి కొంతమంది అధికారులు గ్రామానికి వెళ్లారు. రైతులకు నచ్చజెప్పడానికి ప్రయత్నించగా వారంతా ససేమిరా అన్నారు. ప్రభుత్వం ఇక్కడ ఫార్మాసిటీ ఏర్పాటు చేయడానికి అన్ని రకాలుగా సంసిద్ధమైందని తెలపడంతో ఆగ్రహించిన గ్రామస్తులు కలెక్టర్లు వెంటపడి తరిమారు. అప్పటికే ప్రశాంతంగా ఉన్న లగచర్ల గ్రా మం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఇదివరకు ఆఫీసర్లు కలెక్టర్ ప్రతిక్ జైన్‌ను గ్రామస్తుల నుంచి కా పాడి కారులో ఎక్కించారు. అయినా వెంటబడి కా రు డ్రైవర్‌పై దాడికి దిగారు. కారులో కలెక్టర్ కూ ర్చున్న చోట ఓ మహిళ దగ్గరికి వెళ్లి రెండు చేతులతో అద్దంపై కొట్టింది. లోపల ఉన్న కలెక్టర్ కిందికి వంగి వాహనాన్ని స్పీడ్‌గా పోనిచ్చారు. వెంట ఉన్న ఎ స్కార్ట్ వాహనంపై రాళ్లతో దాడి చేయడంతో కారు అద్దాలు పగిలిపోయాయి.
కాగా అక్కడే ఉన్న కాడ స్పెషల్ ఆఫీసర్ వెంకట్‌రెడ్డి ఎంత చెబుతున్నా వినకపోవడంతో ఆయనపై దాడికి దిగారు. దీంతో ఆయన గ్రామస్తులు దాడి నుంచి తప్పించుకోవడానికి పొ లాల వెంట పరిగెత్తారు. ప్రజలు అంతటితో ఆగకుండా ప్రభుత్వ అధికారుల వాహనాలను చెప్పు లు, రాళ్లు, కర్రలతో ధ్వంసం చేశారు.
కలెక్టర్ ఇతర అధికారులపై రైతులు తిరగబడడం తో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసు బలగాలను లగచర్లలో రంగంలో దించారు. గ్రామం మొత్తాన్ని జల్లెడ పడుతున్నారు. పోలీసుల రాకతో గ్రామస్తులంతా ఇండ్లల్లోకి వెళ్లి దాక్కున్నారు. అనుమానితులను రాత్రికిరాత్రే పోలీసులు అదుపులోకి తీసుకుంటారని ప్రచారం జరగడడంతో చాలామం ది గ్రామం వదిలి పారిపోయారు. కాగా దాడి జరుగుతున్న టైంలో కాంగ్రెస్ నేతలంతా సమాధానం చెప్పుకోలేక అక్కడ నుంచి పారిపోయారు. ప్రస్తుతం వికారాబాద్ జిల్లా పోలీసు ఎస్పీ ఆధ్వర్యంలో గ్రా మంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.
కొడంగల్ పరిధిలో ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీ కోసం గిరిజనుల భూములు లాక్కునేందుకు ప్రయత్నం జరుగుతున్నది. బొంరాస్‌పేట, దుద్యాల మండలంలో ఎక్కువ మంది లంబాడాలు నివసిస్తున్నారు. ఇప్పుడిప్పుడే వాళ్లంతా తమకాళ్లపై తాము నిలబడి వ్యవసాయాన్ని నమ్ముకొని వందలాది కుటుంబాలు జీవిస్తున్నాయి. వీరంతా చిన్న, సన్నకారు రైతులే. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కాలం కలిసి రావడంతో వలస పోయిన వారంతా తిరిగి వచ్చారు. వ్యవసాయాన్ని నమ్ముకొని నాలుగు ముద్దలు నోట్లో పెట్టుకునే టైంలో ఫార్మాసిటీ పేరుతో ఈ రైతుల భూములు లాక్కునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నది. ఈ నేపథ్యంలో ఫార్మాసిటీకి తమ భూములు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. అందుకే వాళ్లంతా తెగించి తిరగబడ్డారు. ప్రస్తుతం ఏం జరుగుతుందోనన్న ఆందోళన గ్రామస్తుల్లో నెలకొంది. రెండు మండలాల్లోని గ్రామాలు భయం గుప్పిట్లో ఉండిపోయాయి. తాము ఓటు వేసిన నాయకుడు సీఎం అయ్యాడని ఆనందపడాలో.. పెద్దల కోసం గద్దలా తమ భూమిని లాక్కుంటున్నాడని బాధపడాలో తెలియని పరిస్థితి నెలకొన్నది.