గద్వాల, మార్చి 13: సాగునీటి సరఫరా సమర్థవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. గు రువారం కేటిదొడ్డి మండలంలోని కొండాపురం లో నీటి కొరతతో ఎండిపోతున్న పంటలను కలెక్టర్ క్షేత్రస్థాయిలో వ్యవసాయ, నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రైతులతో మాట్లాడి వారి పొలాల్లో పర్యటించి పంటల పరిస్థితిని తెలుసుకున్నారు.
వరిపంటలు నీటి కొరత కారణంగా తీవ్రంగా ప్రభావితమవుతున్నట్లు గుర్తించారు. ర్యా లంపాడ్ ప్రధాన ఎడమ కాల్వ 104 ప్యాకేజీ పరిధిలోని కొండాపురం, గువ్వలదిన్నె, మైలగడ్డ వద్ద కాల్వ ప్రవాహాన్ని, నీటిసరఫరా పరిస్థితిని కలెక్టర్ పరిశీలించారు. కాల్వలో నీటి విడుదల, పంపిణీ విధానం, ఆయకట్టు పరిధిలోని ప్రాంతాలకు నీరు చేరుతున్న తీరును తెలుసుకునేందుకు అక్కడి పంపింగ్ స్టేషన్లు, పంపిణీ వ్యవస్థను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం కలెక్టర్ అధికారులతో మా ట్లాడి రైతుల అభ్యర్థన మేరకు తక్షణమే సాగునీటిని కాల్వల్లోకి విడుదల చేయాలని నీటి పారుదలశాఖ అధికారులను ఆదేశించారు.
కాల్వ ద్వారా సరఫరా అవుతున్న నీరు ఆయకట్టు చివరి ప్రాంతాలకు అందేలా సమతుల్యతను పాటించాలని సూచించారు. కాల్వ ద్వారా నీరు ఆయకట్టు చివరి ప్రాంతాలకు చేరకుండా ఎగువ ప్రాంతాల్లోని రైతులు మోటర్లు, పంప్సెట్లు ఉపయోగించి నీటిని వినియోగిస్తున్న పరిస్థితిని కలెక్టర్ పరిశీలించారు. ఇలా కాకుండా కాల్వల వెంట నీరు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాల ని సూచించారు. ప్రభుత్వం రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, రైతుల పంటలను కాపాడేందుకు అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. తక్షణమే అవసరమైన చర్యలు తీసుకొని సాగునీటి సరఫరా పద్ధతులు మెరుగు పరిచేందుకు తగిన చర్యలు చేపడుతామని కలెక్టర్ రైతులకు భరోసా కల్పించారు. కలెక్టర్ వెంట ఇరిగేషన్ ఈఈ రహీముద్దీన్, అధికారులు సక్రియానాయక్, సంగీతలక్ష్మి, రమేశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.