బిజినేపల్లి, జూలై 17 : రైతులకు నకిలీ ఎరువులు, విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్య లు తీసుకుంటామని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. విశ్వసనీయ సమాచారం మండలంలోని మహదేవునిపేట గ్రామంలో వ్యవసాయాధికారులైన కల్యాణి, మధు తనిఖీలు నిర్వహించి 111 బస్తాల నకిలీ డీఏపీని పట్టుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్‌తోపాటు, ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్‌లతో కలిసి సందర్శించి పరిశీలించారు.
ఈ తనిఖీల్లో గ్రామానికి చెందిన ఏడుగురు రైతుల వద్ద నిల్వ ఉంచిన 111 బస్తాల అనుమానాస్పద డీఏపీ ఎరువులను స్వాధీ నం చేసుకొని సీజ్ చేశారు. అప్పటికే మరో 39 బస్తాలను రైతులు తమ పొలాల్లో చల్లుకోగా వాటిని సంబంధించిన ఖాళీ సంచులను సైతం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నకిలీ ఎరువులు రైతుల చేతికి ఎలా చేరాయి, ఏ మార్గం గుండా వారి వద్దకు చేరాయనే విషయాలపై ఆరా తీశారు.
ప్రధానంగా గ్రామంలోని రాజు, బాలయ్య, రాము లు, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, రాములు, మన్యపురెడ్డి, జైపాల్‌రెడ్డి అనే రైతులు కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చిన కొందరు వ్యక్తులు మార్కెట్ ధరకంటే తక్కువగా రూ.1600-1700లకు ఒక బస్తా చొప్పున విక్రయించినట్లు వ్యవసాయాధికారులు కలెక్టర్‌కు తెలిపారు. వెంటనే ఈ ఎరువులను పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌కు తరలించి నివేదికల అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. స్వాధీనం చేసుకున్న నకిలీ డీఏపీ ఎరువుల బస్తాలను బిజినేపల్లి రైతు వేదికలో భద్రపరచాలని కలెక్టర్ వ్యవసాయాధికారులను ఆదేశించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ రైతులను మోసం చేసిన వారిని ఉపేక్షించేది లేదని హె చ్చరించారు.
ఈ కేసులో ఉన్న ప్రతి ఒక్కరిని గుర్తించి న్యాయపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారక మందులు కొనుగోలు చేసే సమయంలో రైతులు తప్పనిసరీగా ప్రతి వస్తువుకు బిల్లు తీసుకోవాలన్నారు. మార్కెట్ ధరకంటే తక్కువ వస్తుందని నమ్మి గుర్తు తెలియని వ్యక్తుల వద్ద ఎలాంటి విత్తనాలు, ఎరువులు కొనవద్దని, అనుమానాస్పదంగా ఎరువులు, విత్తనాలు విక్రయిస్తున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని రైతులను సూచించారు. వారి వెంట డీఎస్పీ శ్రీనివాసు లు, సీఐ అశోక్‌రెడ్డి, డిప్యూటీ తాసీల్దార్ రవికుమార్, ఎస్సై షంషోద్ధీన్ ఉన్నారు. అలాగే తిమ్మాజిపేట మండలంలోనూ ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.