వనపర్తి, అక్టోబర్ 11 : కంపచెట్లతో నిండి నెర్రలుబారిన నేలలతో నిరుపయోగంగా మారిన చెరువులను మిషన్ కాకతీయ ద్వారా సీఎం కేసీఆర్ చెరువులను పునరుజ్జీవం పోశారు. కంపచెట్లు, పూడికతీత పనులను చేపట్టి ప్రతినీటి బొట్టును ఒడిసిపట్టేలా చర్యలు చేపట్టారు. దీంతో చెరువు కింది ఆయకట్టు రైతులకు సాగునీటి భరోసానిచ్చారు. అంతేకాకుండా భూగర్భజలాలు సైతం పెరిగి సాగు, తాగునీటి చింతను తీర్చారు. అలాగే పట్టణాల్లో మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చి ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించారు. జిల్జిల్ జిగేల్ మనేలా ఎల్ఈడీ లైట్లు, వివిధ ఆకృతుల్లో మొక్కల పెంపంక, వాకింగ్ ట్రాక్, ప్రజలు సేద తీరేందుకు బెంచీల ఏర్పాటు, బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు ప్రత్యేక ఘాట్ వంటి సౌకర్యాలు కల్పించారు.
దీంతో పట్టణానికే మినీట్యాంక్‌బండ్‌లుగా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వనపర్తి పట్టణంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పట్టణ నలువైపులా అన్యాక్రాంతమవుతున్న చెరువుల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారు. వాటిని మినీ ట్యాంక్ బండ్లుగా తీర్చిదిద్దడమే కాక ఎల్లవేళలా నిండుకుండలా ఉండేలా ప్రణాళికలను రూపొందించారు. గోపాల్పేట రోడ్డు మార్గంలో నల్లచెరువు, కొత్తకోట రోడ్డు మార్గంలోని అమ్మచెరువు, పానగల్ రోడ్డు మార్గంలోని తాళ్ల చెరువు, పెబ్బేరు మార్గంలో మర్రికుంట, లక్ష్మీకుంటలను మినీ ట్యాంక్బండ్లుగా తీర్చిదిద్దారు. పట్టణంలోని నలువైపులా ప్రజలకు ఆహ్లాదకరమైన వాతతావరణంతోపాటు ఆయా ప్రాంతాలు ప్రత్యేక శోభను అలకరించుకున్నాయి. దాదాపుగా వీటిన్నింటికీ రూ.13.12కోట్లు ఖర్చు చేశారు. ప్రత్యేకంగా ఈ ప్రాంత మత్స్యకారులకు జీవనానికి మూలంగా నల్ల చెరువు, అమ్మచెరువులకు నేడు జీవనబండారాలుగా నిలిచాయి.
వనపర్తి చుట్టూ అన్యాక్రాంతమై, నిరాధరణకు సాక్ష్యాలుగా నిలిచిన నల్లచెరువు, రాజనగరం అమ్మచెరువు, తాళ్ల చెరువు, ఈదుల చెరువులను పునర్నిర్మించారు. తాళ్ల చెరువు, అమ్మచెరువు, నల్ల చెరువులను మినీ ట్యాంక్బండ్లుగా చేసి వనపర్తి పట్టణవాసులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించారు. శ్రీనివాసపురం మొండి కుంటకు అధునీకరించి లక్ష్మీకుంటగా మంత్రి నామకరణం చేసి ప్రాణం పోశారు. రాష్ట్రంలోనే అత్యధికంగా 4.40 మీటర్లకు భూగర్భజలాలుగా పెరిగిన ప్రాంతంగా వనపర్తి నిలిచింది. దీంతో వనపర్తి పట్టణ ప్రాంత ప్రజలకు నీటి అవసరాలకు భవిష్యత్‌లో కూడా ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చేశారు.
వనపర్తి పట్టణానికి ఉత్తర భాగాన్న ఉన్న తాళ్ల చెరువు రైతులకు ఆయువు పట్టుగా ఉండేది. వర్షాలు లేక భూములు సాగు లేక బీడుగా మారి కొంత మంది రియల్ ఎస్టేట్ వ్యాపారుల కుట్రలతో చెరువు అన్యాకాంతం అవుతూ వచ్చింది. మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి తాళ్లచెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా చేపట్టాలన్న లక్ష్యంగా పునరుద్ధరణ పనులను చేపట్టారు. ప్రస్తుతం ఈ చెరువు కింద 50ఎకరాల ఆయకట్టు సాగవడమే కాకుండా భూగర్భజలాల వృద్ధి, తాగునీటి కొరత కూడా తీరింది. కట్ట సుందరీకరణతో ఇరువైపులా చెట్లు నాటించారు. ఎల్ఈడీ లైట్స్, ఎల్లవేళలా ప్రజలు, బాటసారులు సేద తీరడానికి బెంచీలు ఏర్పాటు చేయించారు. తాళ్లచెరువు సుమారుగా 37.49 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీని పుననిర్మాణం కోసం ప్రభుత్వం రూ.78.40లక్షలు వెచ్చించింది.
నల్లచెరువు గత పాలకుల హయాంలో నిరాధారణకు గురైంది. 160 ఎకరాల ఆయకట్టులో, 60 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ కింద అన్యాక్రాంతమైంది. 35 ఏండ్లుగా మురికికూపంగా మారిన చెరువు మంత్రి నిరంజన్‌రెడ్డి చొరవతో పునరుజ్జీవం పోసుకున్నది. నల్లచెరువు సుందరీకరణ కోసం మంత్రి నిరంజన్‌రెడ్డి రూ.11.44కోట్లతో పనులను చేపట్టారు. ప్రత్యేకంగా బతుకమ్మ ఘాట్‌ను ఏర్పాటు చేశారు. చెరువుకింద 398 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు పారుతుంది. ప్రస్తుతం నల్లచెరువు సుమారుగా 229.5 ఎకరాల్లో విస్తరించి ఉండటంతో ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు బోటింగ్ సౌకర్యానికి ఏర్పాట్లు చేశారు.
ఒకప్పడు రాజనగరం అమ్మచెరువు చుట్టపక్కల పెద్ద ఎత్తున నెలరోజుల పాటు జాతర సాగేది. అక్కడికి వచ్చిన ప్రజలకు ఆహ్లాదనిచ్చేది. పశువులకు దాహన్ని తీర్చేదిగా ఉండేది. కానీ కాలక్రమేణ పిచ్చిమొక్కలతో కనుమరుగయ్యే స్థితికి వచ్చింది. మంత్రి నిరంజన్‌రెడ్డి మినీ ట్యాంక్‌బండ్‌గా చేశారు. ఒకప్పుడు అమ్మచెరువు కట్టపై సైకిల్ దూరని స్థితి నుంచి, ఒకేసారి నాలుగు భారీ వాహనాలు వెళ్లేలా కట్ట విస్తరణ చేపట్టారు. ఈ చెరువు కింద సుమారు 230 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందిస్తున్నది. ప్రస్తుతం అమ్మ చెరువు సుమారుగా 135.66 ఎకరాల్లో విస్తరించి ఉంది. పుననిర్మాణం కోసం ప్రభుత్వం రూ.68.80 లక్షలు వెచ్చించింది.
శ్రీనివాస్‌పురం లక్ష్మీకుంటకు మొండి కుంటగా పేరుండేది. ఈ ప్రాంత బోర్ల ఆసరాగా ఉండేది. వర్షకాలంలో మాత్రమే నిండి భూగర్భ జలాలకు కొంత ఊరట అందిస్తుండేది. మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో ఈ ప్రాంత ప్రజలకు సాగు, తాగునీటి కొరత తీర్చేందుకు ఈ కుంటకు పునరుజ్జీవం పోసి లక్ష్మీకుంటగా నామకరణాన్ని మంత్రి చేశారు. కుంటచుట్టూ కట్టలు పోయించి, నీళ్లు నింపి, అందంగా తయారు చేయించారు. ఈదుల చెరువు నుంచి ప్రత్యేక పైపులైన్ ద్వారా లక్ష్మీకుంటలో నీటిని నింపి శ్రీనివాస్‌పురం గ్రామానికి సాగు, తాగునీటి ఢోకా లేకుండా చేశారు.
ఇక్కడి అడవిలోని వణ్యప్రాణుల దాహర్తిని తీర్చడంతోపాటు ఈ ప్రాంతంలోని బోర్ల రీచార్జ్‌కు ఎంతగానో తోడ్పాటు అయ్యింది. లక్ష్మీకుంట ప్రాంతం సూర్యోదయం, సూర్యాస్తమయంలో వాతావరణం ప్రకృతి ప్రేమికుల మనస్సులను దోచుకుంటుంది. 50ఎకరాల వరకు ఆయకట్టు సాగవుతున్నది. 17.85 ఎకరాల్లో విస్తరించి ఉండగా, పుననిర్మాణం కోసం ప్రభుత్వం రూ.20లక్షలు వెచ్చించింది.